ఒక్క ఛాన్స్ ప్లీజ్.. ఈ దేబిరించడం ఏంటి బాలయ్యా..!

బాలకృష్ణ వచ్చాడు.. 'ఆహా'కు ఊపొచ్చింది. సబ్ స్క్రిప్షన్ పెరిగింది. బాలయ్యలో కొత్త యాంగిల్ ను ఆడియన్స్ కు పరిచయం చేసింది. టాక్ షోలకు ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. బాలయ్య ఉత్సాహం, చొచ్చుకుపోయే గుణం,…

బాలకృష్ణ వచ్చాడు.. 'ఆహా'కు ఊపొచ్చింది. సబ్ స్క్రిప్షన్ పెరిగింది. బాలయ్యలో కొత్త యాంగిల్ ను ఆడియన్స్ కు పరిచయం చేసింది. టాక్ షోలకు ఓ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. బాలయ్య ఉత్సాహం, చొచ్చుకుపోయే గుణం, ప్రశ్నలు సంధించే విధానం, గెస్ట్ ను సరదాగా ఇరకాటంలో పడేసే నేర్పరితనం, మద్యం బ్రాండ్ ఏంటంటూ అడిగే తుంటరితనం అంతా బాగున్నాయి. కానీ ఒక్కటి..ఒకే ఒక్కటి మాత్రం పంటి కింద రాయిలా తగులుతోంది. బాలయ్యను తక్కువ చేస్తోంది.

“మరి నాతో కూడా ఓ సినిమా చేయొచ్చుగా..” ఈమధ్య కాలంలో బాలయ్య నుంచి వస్తున్న విన్నపం ఇది. టాక్ షో వరకు బాగుంది. కానీ అదే కార్యక్రమంలో గెస్టులుగా వస్తున్న దర్శకుల్ని నాతో కూడా ఓ సినిమా చేయమని బాలయ్య రిక్వెస్ట్ చేయడం మాత్రం బాగాలేదు. ఈ విషయంలో నందమూరి అభిమానులు చాలా హర్ట్ అవుతున్నారు. బాలయ్య ఫ్లోలో అలా అడిగేస్తున్నాడా లేక క్రియేటివ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ రవి స్క్రిప్ట్ లో అలా ఉందా అనే విషయం పక్కనపెడితే.. బాలయ్య ఇలా 'ఒక్క ఛాన్స్' అంటూ దేబిరించడం మాత్రం అభ్యంతరకరం.

రాజమౌళి ముందు మరీ అంతలా..!

సాధారణంగా పెద్ద హీరోల దగ్గరకు కథలు పట్టుకొని దర్శకులు వస్తుంటారు. చిన్న హీరోలు దర్శకుల్ని రిక్వెస్ట్ చేస్తుంటారు. ఈమధ్య కాలంలో ఓ మోస్తరు పేరున్న హీరోలు కూడా దర్శకుల వెంటపడడం మానేశారు. ఎవరైనా మా దగ్గరకే రావాలి అనేలా ఉంటోంది వాళ్ల యూటిట్యూడ్. కానీ బాలకృష్ణ మాత్రం రాజమౌళిని రిక్వెస్ట్ చేశాడు. నాతో కూడా ఓ సినిమా చేయొచ్చుకదా అని బహిరంగంగా అడిగేశాడు. కారవాన్ దిగితే మళ్లీ లోపలికి వెళ్లనని, బాయ్ తో గొడుగు కూడా పట్టించుకోనని, ఎంత కష్టమైనా పడతానంటూ తన బయోడేటాను రాజమౌళి ముందుంచాడు. 

బాలయ్య ఏ దర్శకుడ్ని సినిమా చేసి పెట్టమని నోరుతెరిచి అడగరు. ఆ విషయం అభిమానులతో పాటు చాలామందికి తెలుసు. మరి ఈ టాక్ షోలో ఎందుకిలా బాలయ్యతో చేయిస్తున్నారు? కామెడీ అనుకుంటున్నారేమో.. అభిమానుల దృష్టిలో కామెడీ అయిపోతున్నారు. ఆ విషయం అర్థమౌతున్నట్టు లేదు.

సుకుమార్ ను కూడా అదే ప్రశ్న

తాజాగా తన టాక్ షోకు వచ్చిన సుకుమార్ ను కూడా ఇదే ప్రశ్న అడిగేశాడు బాలయ్య. తను నెగెటివ్ షేడ్స్ లో కూడా కనిపించగలనని, ఎంత యాక్టివ్ గానైనా ఉంటానని చెప్పుకొచ్చాడు. ఛాన్స్ ఇస్తే 3 నెలల్లో సినిమా పూర్తిచేస్తానని కూడా సుక్కూ ముందు విన్నవించుకున్నాడు బాలయ్య. అప్పటికీ సుకుమార్, బాలయ్యను దేవుడ్ని చేశాడు. 

తన ఇంట్లో ఓవైపు చిరంజీవి బొమ్మ, మరోవైపు బాలయ్య బొమ్మ ఉంటుందని, ఊరిలో సగం మందికి బాలయ్య దేవుడని ఓవైపు చెబుతుంటే.. మరోవైపు బాలకృష్ణ మాత్రం తనతో ఎప్పుడు సినిమా తీస్తావో చెప్పాలంటూ చిన్న పిల్లాడిలా సుక్కూ చుట్టూ తిరిగి మారాం చేశాడు. అక్కడితో ఆగకుండా దసరాకు కొబ్బరికాయ, క్రిస్మస్ కు గుమ్మడికాయ, సంక్రాంతికి రిలీజ్ అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశాడు.

రాబోయే రోజుల్లో ఏ డైరక్టర్ వచ్చినా బాలయ్య నుంచి ఈ విన్నపం మాత్రం తప్పకుండా ఉండేలా షో నిర్వహకులు జాగ్రత్తలు తీసుకునేలా ఉన్నారు. కార్యక్రమం హిట్టవ్వడం కోసం బాలయ్య రేంజ్ ను తగ్గించే ఇలాంటి పనుల్ని ఉన్నఫలంగా ఆపేస్తే బెటర్. సరదాకు కూడా ఇలాంటివి పెట్టకుండా ఉంటేనే మంచిది. బాలయ్య భోళా. అందుకని మరీ ఇంతలా వాడేస్తే ఎలా?