సినిమా టికెట్ రేట్లను ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.. దీన్ని కొంతమంది తీవ్రంగా నిరసిస్తున్నారు! ఈ నిరసించే వారిలో సినిమా హీరోలే కాదు, వారి వీరాభిమానులు, తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లను నియంత్రించడం తీవ్రమైన నేరంగా కనిపిస్తోంది వీళ్లందరికీ.
థియేటర్లో సదుపాయాలు, వసూళ్లు చేస్తున్న రేట్లకు తగ్గట్టుగా అక్కడ సౌకర్యాలుంటున్నాయా? సినిమా టికెట్ రేటును వెయ్యి రూపాయలు, పదిహేను వందలు పెట్టడం న్యాయమేనా? సినిమా టికెట్ల రేట్లను నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? వంటి వాదనలతో, తర్కాలతో ఎవరికీ అవసరం లేదు.
జగన్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్లను నియంత్రిస్తానని అంటోంది కాబట్టి.. అది నేరం! అది కక్ష సాధింపు. సినిమా టికెట్ రేట్లనే నియంత్రించాలా? సామాన్యులకు అవసరమైన మిగతా వాటి గురించి ఎందుకు నియంత్రించరు? అనే విలువైన ప్రశ్న కూడా వీరి వాదనల్లో ఉంది.
కట్ చేస్తే.. ఏపీలో ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ కాలేజీల ఫీజులను నియంత్రిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఆ జీవోలను ఏపీ హై కోర్టు కొట్టి వేసింది. దీంతో సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం తెచ్చిన ఫీజుల నియంత్రన జీవో కూడా గాలికి కొట్టుకుపోతోంది.
సినిమా టికెట్ లపై నియంత్రణ అయినా, ఫీజులపై నియంత్రణ అయినా.. ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించే అంశాలే! థియేటర్ల వాళ్ల దందా కళ్ల ముందు కనిపించినప్పుడు.. అధికారులు ఏం చేస్తున్నారు? అనే ఆక్రోశపు ప్రశ్న రాక మానదు. థియేటర్లలో ప్రమాదాలు ఏవైనా జరిగితే.. అధికారులు ఏం పీకుతున్నారు? ప్రభుత్వం ఏం పీకుతోంది? అంటూ ప్రశ్నించే వాళ్లు కోకొల్లలు. అయితే ఇప్పుడు థియేటర్లలో సేఫ్టీ మెజర్ మెంట్స్ అడిగితే.. అది మాత్రం కక్ష సాధింపుగా తోస్తుంది! తీరా తమ వరకూ వస్తే మాత్రం.. గగ్గోలు, ప్రభుత్వంపై విరుచుకుపడటం ఇదీ కథ.
ఇక ఫీజుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఏపీలో కోరుకోని తల్లిదండ్రులు ఉండరు. సాటి వారి లాగే పిల్లలను ప్రైవేట్ కాలేజీలకు, స్కూళ్లకు పంపి చదివించుకోవాలని కోరుకునే వాళ్లంతా.. ఆ సంస్థలు కోరినంత ఫీజులను కట్టలేక, అలాగని పిల్లలను ఆపలేక సతమతం అవుతూ ఉంటారు. ఇది నూటికి తొంభై శాతం మధ్యతరగతి ఇళ్లలో కనిపించే దృశ్యమే. వారి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం చేసిన నియంత్రణ కూడా ఇప్పుడు కోర్టులో నిలబడలేదు.
ఇంటర్ ఫెయిల్ అయిన వారితో, డిగ్రీ పూర్తి చేయలేని వారితో.. టెన్త్ క్లాస్ పిల్లలకు పాఠాలు చెప్పించే స్కూళ్లు.. తమకు ప్రభుత్వం చెప్పిన ఫీజులు చాలవనే వాదనతో కోర్టుకు ఎక్కి నెగ్గాయి! స్థూలంగా.. జగన్ ప్రభుత్వం ఏ రేటును నియంత్రించాలని చూసినా.. అందులో ప్రజాప్రయోజనాలే పరమావధి అయినా, ఝలక్కులు మాత్రం తప్పవంతే!