అమ్మా భువనేశ్వరి , ఎంత చల్లని హృదయమమ్మా నీది. ఎంత మంచి మనసు తల్లీ నీది. నీ పుట్టింటి గడ్డ అమరావతిలో రైతులు ఆందోళన చేస్తుంటే తట్టుకోలేక పోయావు. ఎంత చలించిపోయావో నా బంగారు కొండా!
అమరావతిలో రైతుల ఆందోళనకు మంచులా కరిగిపోయావు. వారి ఆందోళన కొనసాగింపునకు రెండు బంగారు గాజులు ఇచ్చేశావు. నీ మనసు మంచుకంటే చల్లదని, వెన్నకంటే మెత్తనిదని ఉప్పొంగిపోయాం.
కోస్తా జిల్లాలో పుట్టినా, మా రాయలసీమకు కోడలుగా వచ్చావు. నీకు మా గోడును వినిపించుకుందామనుకుంటున్నాం. నీలాగే మేము కూడా ఆడబిడ్డలం. మేము పుట్టిన ఈ సీమ బాగుండాలని కోరుకుంటాం.
మీలాగా ఇక్కడ కృష్ణమ్మ మా పంట పొలాలను తడపదు. వర్షాలు సరిగ్గా కురవవు. బోర్లు వేసినా నీళ్లు పడవు. సరిగా పంటలు పండవు. అప్పులు పెరిగిపోయి, మా బతుకులు ఎండిపోయి, చావుతోనే ఈ సమస్యలకు విముక్తి లభిస్తుందని పైర్లకు తెచ్చిన పురుగు మందులు మా మగవాళ్లు తాగేస్తున్నారు. ఎద్దులకు కట్టే పగ్గాలతో ఉరి బిగించుకుంటున్నారు. భర్తలను పోగొట్టుకున్న రాయలసీమ ఆడబిడ్డలమమ్మా మేము.
వ్యవసాయాన్ని నమ్ముకుంటే , అది కాస్తా పసుపు కుంకుమలకు , మట్టిగాజులకు మమ్మల్ని దూరం చేసింది. నాయకుల్ని నమ్ముకుంటే నట్టేట ముంచారు. మమ్మల్ని ముంచిన వారిలో నీ మగడు ముందున్నాడు తల్లీ.
పిల్లల్ని పస్తులు పడుకోబెట్టలేక , భర్తలాగా ప్రాణాలు తీసుకోలేక , ఉన్న పల్లెను, కన్న తల్లిలాంటి ఈ నేలని, కడుపున పుట్టిన బిడ్డల్ని విడిచి పెట్టి కువైట్, మస్కట్, దుబాయ్, సౌదీ లాంటి దూర దేశాలకు వెళ్లిపోతున్నాం తల్లీ.
దేశం కాని దేశానికి , భాషరాని దేశానికి వెళ్లిపోతున్నామమ్మా. మా కష్టాలు మీ ప్రాంత రైతులకు లేవు. మీ ఊహలకు కూడా అందవు. ఎప్పుడూ వీధిలోకి రాని నీ పుట్టింటి ఆడవాళ్లు రోడ్డెక్కారని చలించిపోయావా తల్లీ!
ఈ సీమలో జీవితం యుద్ధమైంది. ఇక్కడ జీవితం నిత్య సంఘర్షణే. ఈ కరవు సీమలో బతకడం చేతకాక, మా ప్రాణాలను నీ భర్త వంటి పాలకుల ముఖాన విసిరికొట్టి మరీ ఈ లోకం నుంచి ఎందరు వెళ్లిపోయారో తల్లీ.
కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని నిజానికి అడగాల్సింది మేము. కానీ కాస్తోకూస్తో బతకనేర్చిన వారు మీరు. ఆత్మహత్య చేసుకుంటామని అనుమతి ఇమ్మని బెదిరించడం చేతకాని వాళ్లం మేము. అందుకే ఎందరో ఈ సీమ బిడ్డలు జీవితాలను పుటుక్కున తుంచేసుకుంటున్నారు.
వ్యవసాయం దండగ, వ్యాపారం చేసుకోమని నీ భర్త సలహా ఇచ్చాడు. నేల తల్లిని నమ్ముకున్న వాళ్లం. వ్యాపారాలు చేతకాని వాళ్లం. మోసపోవడమే తప్ప మోసాలు చేయడం చేతకాని వాళ్లం.
‘చెప్పుకుంటే సిగ్గుపోతాది, చేయకపోతే ప్రాణాలు పోతాయ’ నే లెక్కన మా దుర్భర జీవితాలున్నాయి తల్లి. అందుకే నీకై ఓ చేదు నిజాన్ని చెబుతాం తల్లీ. కడుపులో పెట్టుకో. రాయలసీమలోని తాండాలకు చెందిన అందమైన ఆడపిల్లలు బతుకు కోసం మాన ప్రాణాలను సైతం విడిచి పెట్టాల్సి వస్తోంది తల్లీ. బాంబే, పూణేలాంటి నగరాల్లోని రెడ్లైట్ ఏరియాలకు తరలివెళ్లాల్సిన దైన్య స్థితి తల్లీ మాది. అమ్ముకోడానికి మాకేమీ రాజధాని భూములు లేవమ్మా…ఒళ్లు తప్ప. ఇంతకంటే తోడుకోడళ్లు నీకేం చెప్పాలమ్మా.
మిమ్మల్ని బంగారు గాజులు అడగడం లేదు. బాతుగుడ్లు అడగడం లేదు. మీరిచ్చినా ఏం చేసుకుంటాం? వ్యవసాయం తప్ప ఇంకేమీ చేతకానివాళ్లం. పొలాలకు నీళ్లు కూడా రాకుండా జీవోలతో అడ్డుకున్న గొప్ప చరిత్ర మీ ఆయనది తల్లీ. కడుపు చించుకంటే కాళ్ల మీద పడతాదని…మీ ఆయన చేసిన ద్రోహం గురించి చెప్పాలంటే చాలానే ఉందిలేమ్మా తల్లీ.
ఈ సీమలో పుట్టిన నీ భర్తను ఇల్లరికం తీసుకెళ్లిపోయావు. భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ (ఏపీ అంటే మీరే కదా!), అమరావతి అని కలవరిస్తారని నిన్న రాజధాని రైతులతో చెప్పినట్టు తెలిసింది. చూశావా తల్లీ జన్మనిచ్చిన తల్లి లాంటి మా సీమ గడ్డను కాకుండా మిమ్మల్నే 24 గంటలూ కలవరించేంత గొప్ప భర్తను ఇచ్చిన ఘనత ఈ సీమది. ‘పెళ్లాం అంటే బెల్లము, తల్లీతండ్రీ అల్లము’ అన్న సామెతలా , నీ భర్తను కన్న ఈ రాయలసీమ మీకు అల్లంలా కారమై పోయిందా తల్లీ. అత్తారిల్లైన అమరావతి తియ్యని బెల్లమై పోయిందా తల్లీ.
జీవితంలో ఎప్పుడైనా రాయలసీమ రైతుల ఆందోళనలో నీ భర్త పాలుపంచుకున్నాడా తల్లీ! సిద్ధేశ్వరం అలుగు కోసం 30 వేల మంది రైతులు ఆందోళన చేస్తే , వారిలో ఎంత మందిని జైల్లో పెట్టించారో గదా తల్లీ మీ వారు. అమరావతి రైతుల పట్ల ఇంత ప్రేమ ఎలా కలిగింది తల్లీ!
పవళించే సమయంలోనైనా ఈ విషయాలపై మీ వారిని పలకరించి చూడండి.
సొదుం రమణారెడ్డి