సస్పెండ్ చేసే దాకా ఇలాగే జరుగుతుంటుంది…

మద్దాలి గిరి వ్యవహారం  రచ్చకెక్కుతోంది.  సాధారణంగా రాజకీయాలలో పార్టీలు నాయకులను వెళ్ళగొట్టదలుచుకుంటే గనుక,  పొమ్మనకుండా పొగ పెట్టడం అనేది ఆనవాయితీ.  అయితే ప్రస్తుతం తెలుగుదేశం రాజకీయాలలో అందుకు పూర్తిగా విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది.  పార్టీ…

మద్దాలి గిరి వ్యవహారం  రచ్చకెక్కుతోంది.  సాధారణంగా రాజకీయాలలో పార్టీలు నాయకులను వెళ్ళగొట్టదలుచుకుంటే గనుక,  పొమ్మనకుండా పొగ పెట్టడం అనేది ఆనవాయితీ.  అయితే ప్రస్తుతం తెలుగుదేశం రాజకీయాలలో అందుకు పూర్తిగా విరుద్ధమైన వాతావరణం కనిపిస్తోంది.  పార్టీ నుంచి వెళ్ళిపోదలచుకున్న నాయకులు,  తాము నేరుగా వెళ్లకుండా,  పార్టీని తమను సస్పెండ్ చేసే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా సృష్టించుకున్నారు.  గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కూడా ఇలాంటి ప్రయత్నాలు లోనే ఉన్నట్టు ఉంది.

మద్దాలి గిరి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, చంద్రబాబు నాయుడు తీరు మీద విపరీతంగా విమర్శలు గుప్పించారు.  ఒక కులానికి తప్ప ఆ పార్టీలో ఇతర కులాల నాయకులకు ఏమాత్రం ఆదరణ దక్కడం లేదని ఆరోపణలు చేశారు.  పార్టీ రాజకీయాలలో కొత్త వివాదాన్ని రేకెత్తించారు. మనలాంటి వాళ్ళు పార్టీని వీడే పరిస్థితులు దాపురించాయి అంటూ తన మనోగతాన్ని చెప్పకనే చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని చంపేస్తున్నారు అంటూ విమర్శలు కూడా చేశారు.

ఇదంతా ఎందుకు జరుగుతోందో ప్రజలకు అర్థం కాని విషయం కాదు.  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బంధాన్ని ముడివేసుకున్న మద్దాలి గిరి…  తాను రాజీనామా చేయకుండా తనను సస్పెండ్  చేయాలని కోరుకుంటున్నారు.  కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశానని ఆయన అంటున్నారు.

ఇదంతా వల్లభనేని వంశీ చూపించిన బాట.  పార్టీ నేత మీద విమర్శలు చేయడం,  తర్వాత రాజీనామా,  తర్వాత పార్టీ తనను సస్పెండ్ చేస్తే, అనర్హత వేటు తప్పించుకుని శాసనసభలో స్వతంత్ర సభ్యుడిగా కొనసాగడం ఒక వ్యూహం లాగా చలామణి అవుతోంది.  మద్దాల గిరి ఆ బాటనే అనుసరిస్తున్నారు.  పార్టీ తనను సస్పెండ్ చేసే దాకా ఆయన చంద్రబాబు నాయుడును నిందించడం జరుగుతూనే ఉంటుంది.

తెలుగు దేశంలో కులపెత్తనం గురించి గిరి నిందలు వేస్తే…  అదే కులానికి చెందిన వారితో ఎదురు దాడి చేయించడం పార్టీకి సరైన వ్యూహం కాదు.  కానీ అలాంటి ప్రయత్నాల ద్వారా… తెలుగుదేశం మరింతగా తమ మీది ఆరోపణలను ప్రజలు నమ్మేలా చేసుకుంటుంది. పర్యవసానంగా  త్వరలోనేమద్దాలి గిరి సస్పెన్షన్,  ఆయన స్వతంత్ర సభ్యుడిగా గుర్తింపు పొందడం జరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.