గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీకి 151 సీట్లతో ప్రజలు పట్టం కట్టారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో హామీలను ఇప్పటికే 80 శాతం అమలు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఔరా అనిపించుకున్నారు. ఒక్కసారి లక్షకు పైబడి ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించి తండ్రిని మించి ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు.
ఇదే ఒరవడిలో మరో సాహసోపేతమైన నిర్ణయాన్ని అమలు చేసేందుకు జగన్ సంకల్పించారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు శరవేగంతో అడుగులు వేశారు. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. రాజధాని అమరావతి రైతులు తమ దగ్గరే రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌పై 15 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. వారికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్, సుజనాచౌదరి, సీపీఐ నారాయణ తదితరులు మద్దతు తెలిపారు.
ఇదే వరుసలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని టీడీపీ నేతలు చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా బుధవారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్‌నాయుడు ప్లకార్డుల ప్రదర్శించారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి రాజధానిని అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ అనంతపురంలో తన ఇంట్లోనే దీక్ష చేశారు. అలాగే పరిపాలనా వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కనిగిరిలో పార్టీ శ్రేణులతో దీక్ష నిర్వహించారు.
రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఆధ్వర్యంలో అమరావతి కోసం సంతకాల సేకరణ మొదలెట్టారు. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ గుంటూరు జిల్లా పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, భార్య, కూతురితో కలసి దీక్షలో కూర్చున్నారు. అలాగే విజయవాడలో సేవ్ రాజధాని పేరుతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విజయవాడలో 24 గంటల దీక్షకు దిగారు. అలాగే మాజీ మంత్రులు పరిటాల సునీత, భూమా అఖిలప్రియ కూడా అమరావతిలోనే రాజధాని ఉండాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం నేతలు ఒక ప్రణాళిక ప్రకారం అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తుంటే…వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్న సొంత పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు. తమ ఎమ్మెల్యేల నిర్లక్ష్యం, అలసత్వంపై వారు మండిపడుతున్నారు. రాజధానుల ప్రకటనతో తిట్లు జగన్‌కు, పదవులు మాత్రం నాయకులకా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న జగన్‌కు మద్దతుగా రాయలసీమ ఉద్యమకారులను, విద్యావంతులను, రైతులను , ప్రజాసంఘాలను కలుపుకుని సంఘీభావ దీక్షలు, ప్రకటనలు చేయాలని ఎమ్మెల్యేలకు ఎందుకు ఆలోచన రావడం లేదని వారు నిలదీస్తున్నారు.
అలాగే ఉత్తరాంధ్రలో స్పీకర్ సహా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి కౌంటర్‌లు ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు. నిజానికి సీమలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలని జగన్ అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈ విషయమై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రస్తుత తరుణంలో జగన్‌కు అండగా నిలిచేలా కార్యక్రమాలను రూపొందించాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ ఎమ్మెల్యేల్లో కదలిక వస్తుందేమో చూడాలి.