కాస్త తగ్గుతానంటున్న కుర్రహీరో

2019లో రెండు పాఠాలు నేర్చుకున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. సీత సినిమాతో ఎలాంటి సినిమాల్లో నటించకూడదో తెలుసుకున్నాడు. రాక్షసుడు మూవీతో ఎలాంటి సినిమాలు చేయాలో తెలుసుకున్నాడు. ఆ అనుభవంతో కొత్త ఏడాదిలో మరింత జాగ్రత్తగా ఉంటానంటున్నాడు.…

2019లో రెండు పాఠాలు నేర్చుకున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. సీత సినిమాతో ఎలాంటి సినిమాల్లో నటించకూడదో తెలుసుకున్నాడు. రాక్షసుడు మూవీతో ఎలాంటి సినిమాలు చేయాలో తెలుసుకున్నాడు. ఆ అనుభవంతో కొత్త ఏడాదిలో మరింత జాగ్రత్తగా ఉంటానంటున్నాడు.

“ఇక నుంచి మరింత సెలక్టివ్ గా వెళ్తాను. ఏడాదికి ఒక సినిమా చేసినా ఓకే. జాగ్రత్తగా మాత్రం ఉండాలని నిర్ణయించుకున్నాను. కరెక్ట్ సినిమాలు చేయాలి. దేవుడి దయ వల్ల అంతో ఇంతో పేరొచ్చింది. దాన్ని నిలబెట్టుకోవాలి. ఒక్కటి చేసినా క్వాలిటీ ఫిలిం చేయాలి. నా ఆలోచన విధానం మారింది. రాక్షసుడు సినిమా నాకు చాలా నేర్పించింది. కంటెంట్ అనేది ఇంపార్టెంట్ అనే విషయం అర్థమైంది.”

ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ. ఇది రీమేక్ కాదంటున్నాడు. ఎందుకు రీమేక్ చేయడం లేదో కూడా చెప్పుకొచ్చాడు. సెంటిమెంట్ కొద్దీ ఓ రీమేక్ ప్రాజెక్ట్ ను పక్కనపెట్టాం అంటున్నాడు.

“ఇప్పుడు నేను చేస్తున్నది తేరీ రీమేక్ కాదు. ముందు తేరి రీమేక్ అనుకున్నాం కానీ తప్పుకున్నాం. నిజానికి అది కల్యాణ్ రామ్ చేయాల్సిన సినిమా. కానీ జరగలేదు. తర్వాత రవితేజతో షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. దీంతో ఇక తేరీ ప్రాజెక్టు వద్దనుకున్నాం. ఓ ఫ్రెష్ కథతో స్టార్ట్ చేశాం.”

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ఆఖరి 20 నిమిషాలు తప్ప మిగతాదంతా కామెడీనే ఉంటుందంటున్నాడు బెల్లంకొండ. అల్లుడు శీను తర్వాత ఆ స్థాయిలో కామెడీ ఎలిమెంట్స్ తో ఈ సినిమా వస్తోందని.. తన క్యారెక్టరే సినిమాకు హైలెట్ అని అంటున్నాడు.