మరింత పటిష్టంగా చేస్తే మరింతగౌరవం

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.  రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి వరకు చదువుకునే పిల్లల  తల్లులకు ఏడాదికి పది వేల రూపాయల…

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.  రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి వరకు చదువుకునే పిల్లల  తల్లులకు ఏడాదికి పది వేల రూపాయల వంతున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి అనేది ఈ పథకం లక్ష్యం. 

ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అనే తేడాలు ఎంచకుండా  ఈ పథకం ద్వారా అందరికీ సాయం చేయాలని సంకల్పించారు.  అయితే నిజమైన పేదలను ఆదుకునే లక్ష్యానికి  తూట్లు పొడిచేలా నిబంధనలు ఉన్నాయని విమర్శలు సర్వత్రా వినిపించాయి.

ఆ మేరకు ప్రభుత్వం అమ్మ ఒడి పథకం నిబంధనల్లో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. వేతన జీవుల పిల్లలకు ఇది వర్తించకుండా నిబంధనలను సవరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 120000,  పట్టణ ప్రాంతాల్లో ఏడాదికి 144000…  వేతన రూపంలో పొందుతున్న వారి పిల్లలకు అమ్మ ఒడి పథకం వర్తించదు. 

ఈ లెక్కన ప్రభుత్వ ఉద్యోగులు,  కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ పద్ధతిపై పనిచేస్తున్న చిరుద్యోగులకు కూడా అమ్మ ఒడి వర్తించే అవకాశం సన్నగిల్లి పోతుంది.  ఇలాంటి ఒక సవరణ ద్వారా పిల్లల చదువులు భరించే ఆర్థిక స్తోమత గల ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారిని అమ్మ ఒడి నుంచి పక్కకు తప్పించి నట్లు అవుతుంది.

అయితే ఈ విషయంలో ప్రభుత్వం మరిన్ని సవరణలు చేయాల్సిన అవసరం ఉంది.  వేతన జీవులు కాకపోయినా అంతమాత్రాన..  ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితిని మించి  సంపాదించే వ్యక్తులు అనేక మంది ఉంటారు.  పన్ను చెల్లింపు స్థాయిలను మదింపు చేసుకుని…   పేదల కోసం ఉద్దేశించిన అమ్మఒడి పథకం లబ్ధి అనేది ఎగువ మధ్య తరగతి సంపన్న వర్గాల వారికి దక్కకుండా నిబంధనలను సవరించాలి.  వ్యాపారాలలో ఉన్నవారికి కూడా లాభాలను మదింపు చేసి,  ఒక పరిమితి కంటే తక్కువ ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా చూడాలి. 

తద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు లక్ష్యం నెరవేరుతుంది.  పేదలు తమ పిల్లలను ఆర్థిక ఇబ్బందుల వలన చదువుకు దూరం చేసే దుస్థితి తొలగుతుంది.  జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరిట నిధులు పంచిపెట్టడం కాకుండా…  ప్రాక్టికల్ గా వ్యవహరిస్తూ అసలైన పేదలను మాత్రమే ఆదుకునే ఉద్దేశంతో ఉందని సంకేతాలు పంపినట్లు అవుతుంది.