అమరావతి నుంచి పరిపాలన రాజధానిని విశాఖకు తరలించే విషయంలో ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని మాత్రమే ఇప్పటిదాకా అధికారిక ప్రకటన ఉంది. అదే సమయంలో ప్రభుత్వం లోని మంత్రులు ఇతర పెద్దలు అనేక మంది మాత్రం… రాజధాని తరలింపు లేదా మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
మూడు రాజధానులు అనే వివాదం చల్లారి పోకుండా చర్చల్లో నే ఉండేలాగా వారి మాటలు ఉంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పరిపాలన రాజధాని అమరావతి నుంచి విశాఖకు తరలించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముహూర్తం కూడా నిర్ణయించిందని వార్తలు వస్తున్నాయి.
కొన్ని పత్రికలలో వస్తున్న కథనాలను బట్టి ఏప్రిల్ 6 వ తేదీని రాజధాని తరలింపునకు ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.అనధికారికంగా తెలుసుకున్న సమాచారాన్ని బట్టి ఈ నెలాఖరులో గణతంత్ర దినోత్సవం ముగిసిన తరువాత 27వ తేదీ నుంచి మూడు రోజుల అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానుల ప్రతిపాదనపై అధికారికంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
కొత్త సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ను సకుటుంబంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన సందర్భంలో కూడా రాజధాని తరలింపు పై దానికి సంబంధించిన చర్చ జరిగిందని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో బోస్టన్ గ్రూపు నివేదిక అనేది అత్యంత కీలకం అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఈనెల 8వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశానికి కంటే ముందే బోస్టన్ గ్రూపు నివేదిక వచ్చే అవకాశం ఉంది.కేబినెట్ భేటీలో అటు జి.ఎస్.రావు కమిటీ నివేదిక, ఇటు బోస్టన్ గ్రూప్ నివేదిక రెండింటినీ కలిపి చర్చిస్తారని సమాచారం.
రెండు కమిటీల నివేదికలలో పెద్దగా తేడా ఉండకపోవచ్చునని అంచనాలు సాగుతున్నాయి. అదే నిజమైతే గనుక, రాజధాని తరలింపునకు సంబంధించి 8వ తేదీ క్యాబినెట్ సమావేశం ఒక నిర్ణయానికి వస్తుంది. అసెంబ్లీ సమావేశాలలో ఈ నిర్ణయానికి రాజ ముద్ర పడుతుంది. అంతిమంగా ఏప్రిల్ 6వ తేదీ ముహూర్తం నాటికి రాజధాని విశాఖ తరలిపోవడం జరుగుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి.