ఇప్పటికే అమరావతి ఉద్యమంలో తనమునకలైన తెలుగుదేశం పార్టీ, మరో ఉద్యమంతో రోడ్డెక్కింది. అదే ఓటీఎస్ వ్యతిరేక ఉద్యమం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ వాళ్లు నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వాస్తవానికి ఓటీఎస్ వ్యవహారంపై టీడీపీ అనుకూల మీడియా ఇప్పటికే రాసి రాసి వదిలింది!
గత మూడు దశాబ్దాల్లో ఏపీ గృహనిర్మాణ కార్పొరేషన్ నుంచి ఇళ్ల నిర్మాణం కోసం లోన్లు తీసుకున్న వాళ్లు, అందులో ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించి సెటిల్ చేసుకోవచ్చని, ఇళ్ల పట్టాలను తమ పేర్ల మీదుకు బదిలీ చేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం ఆఫర్ ఇచ్చింది. ఓటీఎస్ పూర్తిగా ఐచ్ఛికం అని.. ఇందులో ప్రభుత్వం ఒత్తిడి లేదని చెబుతోంది.
ఈ వన్ టైమ్ సెటిల్ మెంట్ కు గ్రామాల్లో అయితే స్పందన లేదు. రాదు కూడా. గ్రామాల్లో ఇళ్ల పట్టాలు, హక్కుల విషయంలో పెద్ద పట్టింపు లేదు కాబట్టి.. ఇప్పుడు ప్రభుత్వం వద్దకు వెళ్లి.. వెయ్యి రెండు వేలు కట్టి అయినా హక్కులను రాయించుకునేందుకు పెద్ద ఆసక్తితో లేరు జనాలు.
ఇలాంటి వారిపై ఒత్తిడి చేస్తే అది జగన్ పార్టీకే నష్టం కూడా. అయితే పట్టణాలు, సెమీ అర్బన్ ఏరియాస్ లో మాత్రం ఓటీఎస్ చాలా ఉపయుక్తం. ఇలాంటి చోట స్థలాల రేట్లు, ఇళ్ల రేట్లు చాలా పెరిగిపోయాయి. ఇలాంటి క్రమంలో ప్రభుత్వం నుంచి లోన్లను తీసుకున్న వారు ఆ డబ్బులను కట్టడం ఇష్టం లేక, అలాగని ఆ ఇళ్లను అమ్ముకోనూ లేక ఉన్నారు. ఇలాంటి వారు ఓటీఎస్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. అవసరం అయిన వారు సెటిల్ చేసుకుంటున్నారు!
అయితే ఈ వ్యవహారం టీడీపీలో బాగా అసహనాన్ని పుట్టిస్తోంది. ఈ వ్యవహారంపై టీడీపీ అనుకూల మీడియా రాసిందే రాసి.. రాసి.. అలసి పోయింది. ఓటీఎస్ పై ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందని రాశారు. వలంటీర్ల ఒత్తిడితో ఆత్మహత్యలూ అని కూడా రాశారు! మరి అంత జరిగితే.. ముందుగా ఆనందించాల్సింది టీడీపీనే! ఓటీఎస్ తో ప్రజలకు నష్టం అయితే.. జగన్ పార్టీకి రేపు ఓట్ల విషయంలో భారీ నష్టం జరుగుతుంది. కాబట్టి.. ఓటీఎస్ ను టీడీపీ చూసీ చూడనట్టుగా ఉండాలి.
ఎన్నికల టైమ్ లో చూశారుగా.. అని చెప్పొచ్చు. కానీ, టీడీపీ ఈ వ్యవహారంలో ఇంకో కల్పిత ఉద్యమాన్ని మొదలుపెట్టింది. ఓటీఎస్ వల్ల ఐదు వేల కోట్ల ప్రజాధనం దోపిడీ అవుతోందట! మరి ఓటీఎస్ లేకపోతే.. ఎక్కడి లోన్లు అలాగే, చెల్లింపులు లేకుండా ఆగిపోయినా ఫర్వాలేదా? అనే ప్రశ్నకు టీడీపీ వద్ద సమాధానం లేదు. పిండి కొద్దీ రొట్టె అన్నట్టుగా.. అమరావతి తరహాలోనే, ప్రజలతో సంబంధం లేని మరో ఉద్యమంతో టీడీపీ రోడ్డెక్కింది! దీంతో ఎక్కడి వరకూ ప్రయాణిస్తుందో!