ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఇవాళ ఉదయం 11 గంటల నుంచి విచారణ ఎదుర్కొంటోంది. ఢిల్లీలో ఆమెను ఐదుగురు ఈడీ టీమ్ విచారిస్తున్నట్టు సమాచారం. పలువురు నిందితులను ముందు పెట్టుకుని కవితపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. విచారణ ముగించుకుని సాయంత్రం ఆరు గంటలకు బయటకు వస్తారని మొదట భావించారు.
అయితే దాదాపు 9 గంటల పాటు సుదీర్ఘ విచారణ జరుగుతుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. గత రెండు గంటలుగా కాసేపట్లో ఈడీ కార్యాలయం నుంచి కవిత బయటకు వస్తారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతూ వచ్చాయి. అయితే ఆలస్యమవుతుండడంతో అసలేం జరుగుతున్నదో అర్థం కాక తెలంగాణ అధికార పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
భయపడుతున్నట్టుగానే కవితను ఈడీ అరెస్ట్ చేయవచ్చనే అనుమానాలు బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒక వైపు కవిత విచారణ ఎదుర్కొంటున్న ఈడీ కార్యాలయం వెలుపల బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఏకంగా ఆరుగురు మంత్రులు ఢిల్లీలో మకాం వేసి ఈడీ విచారణపై ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్నదో ఆరా తీస్తున్నారు.
కవిత విచారణ పూర్తి చేసుకుని బయటకు నవ్వుతూ వస్తారా? లేక మరో పరిణామాన్ని చూడాల్సి వస్తుందా? అనే విషయమై పెత్త ఎత్తున చర్చ నడుస్తోంది. కవితను మొదటిసారే ఈడీ విచారిస్తోందని, అరెస్ట్ చేసే అవకాశం వుండదని బీఆర్ఎస్ శ్రేణులు బయటికి చెబుతున్నప్పటికీ, వారి అంతరంగం మరోలా ఉందనేది వాస్తవం.