ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కుల సమీకరణలు తెరపైకి రానున్నాయా? ఇందుకు సంబంధించి చాప కింద నీరులా క్షేత్రస్థాయిలో ఆ రెండు కులాలు మినహా, మిగిలిన కులాలను ఏకం చేసే పని జరుగుతోందా? అంటే …ఔననే సమాధానం వస్తోంది. రాజకీయాలు కులాలతో ముడిపడి ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆరేడు శాతం జనాభా ఉన్న కమ్మ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ల చేతుల్లోనే రాజ్యాధికారం ఎందుకు ఉండాలనే ప్రశ్నలు బలంగా తెరపైకి వస్తున్నాయి. రెడ్డి లేదా కమ్మ సామాజిక వర్గాలకు చెందిన నాయకులే అధికార మార్పిడిలో భాగస్వాములు అవుతున్నారని, ఇతరులకు అవకాశమే రానివ్వడం లేదనే ఆవేదన, ఆలోచన ఇప్పుడిప్పుడే మిగిలిన సామాజిక వర్గాల్లో కలుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో ఎస్సీ, బీసీ వర్గాల నాయకులు సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది కేవలం మొదటి సమావేశమే అని, రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా అన్ని కులాలను ఏకం చేసే దిశగా ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలన్నీ ఐక్యం కావాలనే నినాదంతో వివిధ కుల సంఘాల నాయకులు పావులు కదుపుతున్నారు.
94 శాతం జనాభా ఉన్న సామాజిక వర్గాలను ఐక్యం చేయడమే ప్రధాన ఎజెండాగా వివిధ కులసంఘాల నాయకులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అత్యధిక జనాభా కలిగిన కాపు సామాజికవర్గం ఇందుకు నాయకత్వం వహించాలని ముద్రగడ పద్మనాభంపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. జనసేనాని పవన్‌కల్యాణ్ మంచి అవకాశాన్ని చేజార్చుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది.
తాను అధికారంలోకి రావాలనే ఆకాంక్ష కంటే, ఇతరుల్ని గద్దె ఎక్కనివ్వకూడదనే ప్రతీ కారమే…పవన్ రాజకీయ జీవితాన్ని పతనం చేస్తోందని కొందరు అన్నట్టు తెలిసింది. అన్ని కులాలు కలిస్తే మాత్రం రాజ్యాధి కారాన్ని దక్కించుకోవడం కష్టమేమీ కాదనే అభిప్రాయాలు కిర్లంపూడి సమావేశంలో వ్యక్తమైనట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ రాజకీయాలను అధ్యయనం చేయాలని పలువురు సూచించినట్టు తెలిసింది.