మాజీ మంత్రి నారాయణ చాన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ ఘోర పరాభవం తర్వాత ఆయన పూర్తిగా విద్యాసంస్థల వ్యవహారాల్లోనే తలమునకలై ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల విషయంలో కూడా ఆయన నేరుగా తెరపైకి రాలేదు, తెరవెనక ఆర్థిక సహాయం అందించి మంత్రాంగం నడిపారంతే. కానీ సడన్ గా ఇటీవల క్రిస్మస్ సందర్భంగా ఆయన నెల్లూరులో ప్రత్యక్షమయ్యారు. తనతోపాటు తన కుమార్తె శరణితో కలసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.
కూతురు శరణిని వచ్చే దఫా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీకి దింపే ఆలోచనలో నారాయణ ఉన్నట్టు తెలుస్తోంది. దీని కోసమే బిషప్ దీవెనలు తీసుకున్నారట. రెండేళ్ల ముందుగానే కుమార్తెకు నెల్లూరు రాజకీయాలను పరిచయం చేస్తున్నారు. చూస్తుంటే.. రాబోయే ఎన్నికల్లో మంత్రి అనిల్ కి ప్రత్యర్థిగా శరణి దాదాపుగా ఖరారైనట్టు కనిపిస్తోంది.
నారాయణ కుమార్తె శరణి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోడలు. పుట్టినింట, మెట్టినింట కూడా ఆమెకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. 2019 ఎన్నికల్లో ఇప్పటి మంత్రి అనిల్ పై అప్పటి మంత్రి నారాయణ స్వల్ప తేడాదో ఓడిపోయారు. నెల్లూరుకి చేసిన అభివృద్ధి పనులు తనను గెలిపిస్తాయనే ధీమాలో ఉన్న ఆయన.. చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతకు బలైపోయారు. వచ్చే దఫా ప్రత్యక్ష రాజకీయాల్లో వేలు పెట్టకుండా.. తన కుమార్తెను బరిలో దింపాలనుకుంటున్నారు. దీని కోసం నెల్లూరులో తన సామాజిక వర్గాన్నంతా ఓవైపుకి తీసుకు రావాలనుకుంటున్నారు.
10కి 10 అసెంబ్లీ సీట్లు, రెండు ఎంపీ సీట్లు.. ఇలా నెల్లూరులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినా అంతర్గత రాజకీయాలు మాత్రం అధిష్టానానికి చాలా సార్లు తలనొప్పి తెచ్చిపెట్టాయి. ఎమ్మెల్యేలలో ఒకరికొకరికి పడటం లేదనేది బహిరంగ రహస్యం. ఇదే విషయంలో ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద 3 సార్లు పంచాయితీలు జరిగాయి. ఇన్ చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి జోక్యం చేసుకున్నా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.
నెల్లూరు సిటీ పాలిటిక్స్ విషయంలో వైసీపీలోనే అంతర్గత పోరు నడుస్తుందని అంటున్నారు. సిటీపై ఆనం రామనారాయణ రెడ్డి పట్టు పెంచుకోడానికి అదను కోసం వేచి చూస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. నెల్లూరు నగరంలో ఆనం కుటుంబానికి మంచి పట్టు ఉంది. మంత్రి అనిల్ తో ఆయనకు పూర్తి స్థాయిలో విభేదాలున్నాయనేది బహిరంగ రహస్యం.
దీంతో నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గంపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్నారు. వైసీపీలో ప్రస్తుతం నడుస్తున్న అంతర్గత పోరును తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు.