రాజధాని కేసులపై విచారణ ఇంకే మిగిలి ఉంది. మూడు రాజధానుల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులతో పాటు సీఆర్‌డీఏ రద్దు బిల్లులను ఉప సంహరించుకుంటున్నట్టు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో అందుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
చట్ట సభల్లో మూడు రాజధానులు, అలాగే సీఆర్‌డీఏ రద్దు బిల్లులను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటికి గవర్నర్ ఆమోదం కూడా లభించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రెండు రోజుల క్రితం హైకోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి రాజధాని కేసులపై హైకోర్టులో విచారణకు జరిగింది.
పిటిషన్లపై విచారణ కొనసాగించాలని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది శ్యాందివాన్ కోర్టును కోరారు. సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో పిటిషన్లలో ఇంకా కొనసాగాల్సిన అంశాలు ఏమున్నాయనే వివరాలను పది రోజుల్లోగా నోట్లు దాఖలు చేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది.
ఆ తర్వాత ప్రభుత్వం అఫిడవిట్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కొత్త ఏడాది జనవరి 28కి విచారణను వాయిదా వేసింది. అప్పటి నుంచి పూర్తిస్థాయి వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది.