ఆలూ లేదు చూలూ లేదు, కొడుకు పేరు సోమ లింగం అని వెనకటికి ఒక ముతక సామెత ఉంది. ఇపుడు చూస్తే ఎక్కడా ఎన్నికలే లేవు. అవి షెడ్యూల్ ప్రకారం జరగడానికి కచ్చితంగా మరో రెండున్నరేళ్ల సమయం ఉంది. అయితే రాజకీయ పార్టీలలో మాత్రం తెగ ఉత్సాహం కనిపిస్తోంది.
ఏపీలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సీట్లను రెడీ చెసుకుంటున్నారు. ఈ విషయంలో జనసేన అందరి కన్నా ముందు ఉంది అనే చెప్పాలి. విశాఖ జిల్లాలో ఆ పార్టీ ఈసారి పొత్తులు ఉంటే కనుక కనీసం అరడజన్ సీట్లను కోరనుంది అంటున్నారు.
ఆ సీట్లు అన్నీ కూడా టీడీపీకి పెట్టని కోటలే కావడం విశేషం. గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాకతో మొదలుపెడితే ప్రస్తుతం మాజీ మంత్రి టీడీపీ నేత ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్, భీమునిపట్నం, రూరల్ జిల్లాలో చూసుకుంటే చోడవరం, అనకాపల్లి, ఎలమంచిలి సీట్లను జనసేన గట్టిగా కోరుకుంటోంది అంటున్నారు.
ఈ సీట్లలో పూర్తిగా ఒక సామాజికవర్గం ఆధిపత్యం ఉంది. దాంతో సులువుగా ఈ సీట్లను పొత్తులతో గెలుచుకుంటామని జనసేన పెద్దలు అంచనా వేస్తున్నారుట. కాగా గంటా సిట్టింగ్ సీటు అయిన విశాఖ నార్త్ ని గట్టిగా జనసేన టార్గెట్ చేస్తోంది. ఆయన గెలిచినా ఇప్పటికి రెండున్నరేళ్ళుగా ఈవైపు పెద్దగా వచ్చింది లేదు. దాంతో ఇక్కడ నుంచి పని మొదలుపెడితే సులువు అన్న తీరున జనసేన హడావుడి చేస్తోంది.
ఇక్కడ తాజాగా ఇతర పార్టీలకు చెందిన నాయకులు కొందరిని చేర్చుకున్న జనసేన తగ్గేది లేదు అంటోంది. ఇక విశాఖ నార్త్ కోసం జనసేనలో ఉన్న ఒక మహిళానేతతో పాటు, రాష్ట్ర స్థాయిలో పదవిని నిర్వహిస్తున్న ఒక మాజీ అధికారి కూడా కర్చీఫ్ వేశారని టాక్.
ఇక జనసేనలో చేరడానికి గోడ దూకుళ్ళు కూడా ఉంటాయని టాక్ నడుస్తోంది. దాంతో వేరే పార్టీ నుంచి ఒకసారి గెలిచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఒక సీనియర్ నాయకుడు జనసేన కండువా కప్పుకుని ఈ సీటు నుంచి పోటీ చేస్తారు అని కూడా ప్రచారం సాగుతోంది. మొత్తానికి జనసేన హడావుడి ఇపుడు టీడీపీకి ఇబ్బందికరంగా మారుతోంది అనే చెప్పాలి.
పొత్తులు కనుక కుదిరితే మాత్రం టీడీపీకి గుండెకాయ లాంటి సీట్లనే జనసేన కోరనుంది. మరి వాటిని ఇచ్చేస్తే తమ్ముళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.