దాని కోసం తెలంగాణకు, దీని కోసం ఏపీకి..!

ఏపీ, తెలంగాణ విడిపోయే నాటికి రెండు చోట్ల అన్ని వ్యవహారాలు సమానంగానే ఉండేవి. అక్కడ ఇక్కడ అన్నిటి రేట్లు దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి. కానీ విడిపోయిన తర్వాత మాత్రం తేడా వచ్చేసింది. రెండు…

ఏపీ, తెలంగాణ విడిపోయే నాటికి రెండు చోట్ల అన్ని వ్యవహారాలు సమానంగానే ఉండేవి. అక్కడ ఇక్కడ అన్నిటి రేట్లు దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి. కానీ విడిపోయిన తర్వాత మాత్రం తేడా వచ్చేసింది. రెండు ప్రభుత్వాల నిర్ణయాలు వేర్వేరుగా ఉండటంతో అక్కడ కొన్ని వస్తువుల రేట్లు తగ్గడం, ఇక్కడ కొన్ని వస్తువుల రేట్లు పెరగడం సహజంగా మారింది. ఇది ఎంత వరకు వెళ్లిందంటే గతంలో మందు రేటు ఎక్కడ తక్కువ అంటే ఉమ్మడి ఏపీలో యానాం పేరు వినపడేది.

కానీ ఇప్పుడు ఏపీ వాసులు మాత్రం తెలంగాణకు పరిగెడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో మద్యం రేట్లు పెరిగిపోయాయి, అప్పటివరకు అలవాటైన బ్రాండ్లు తగ్గిపోయాయి. దీంతో సహజంగానే లిక్కర్ అంటే తెలంగాణ వైపు చూడటం ఏపీ వాసులకి అలవాటైంది. హైదరాబాద్ నుంచి వస్తున్నా.. ఏం కావాలి అని అడిగితే ఓ ఫుల్ బాటిల్ అనేది మొదటగా వినపడే రిక్వెస్ట్ అయిపోయింది.

అక్కడ మందు.. ఇక్కడ వినోదం..

ఇప్పుడు సినిమా టికెట్ల వ్యవహారంలో పరిస్థితి రివర్స్ అయింది. తెలంగాణ ప్రేక్షకులంతా ఏపీకొచ్చి సినిమా చూడాలేమో అనేలా ఉంది. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ లో అమాంతం టికెట్ రేట్లు తగ్గిపోయాయి. అదే టైమ్ లో తెలంగాణలో ఒక్కసారిగా టికెట్ రేట్లు పెరిగాయి. ఓ మధ్యతరగతి వ్యక్తి, కుటుంబంతో కలిసి మల్టీప్లెక్టులో సినిమా చూసే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో లేదు. దీంతో ఏపీకి వెళ్తే, పనిలోపని ఓ సినిమా చూసేద్దాం అనుకుంటున్నారు చాలామంది.

సోషల్ మీడియాలో మస్త్ మీమ్స్..

అదృష్టవంతులంటే ఆంధ్ర, తెలంగాణ బోర్డర్ లో ఉన్నోళ్లు మచ్చా.. మందు కొట్టాలంటే తెలంగాణకి, మూవీ చూడాలంటే ఆంధ్రాకి వెళ్లొచ్చు అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. అవును, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇదే నిజం.

తెలంగాణలో మద్యం రేట్లు తక్కువ, ఏపీలో సినిమా టికెట్ రేట్లు తక్కువ. సో.. సరిహద్దులో ఉండే వాళ్లు.. సినిమా చూడాలంటే ఏపీకి, లిక్కర్ కోసం తెలంగాణకు రావొచ్చన్నమాట. ఓరోజు అక్కడికెళ్లి మందు కొడితే, ఇంకోరోజు ఇక్కడికొచ్చి సినిమా చూడొచ్చు.