సంక్రాంతి స్పెషల్: ఏపీని టార్గెట్ చేసిన సజ్జనార్

ఆమధ్య ర్యాపిడో బైక్ సర్వీస్ అడ్వర్టైజ్ మెంట్ పై తెలంగాణ ఆర్టీసీ ఎంత హంగామా చేసిందో అందరికీ తెలుసు. ఆర్టీసీ బస్సు ఎక్కడం కంటే.. ర్యాపిడో బైక్ ట్యాక్సీని తీసుకోవడం మేలంటూ అల్లు అర్జున్…

ఆమధ్య ర్యాపిడో బైక్ సర్వీస్ అడ్వర్టైజ్ మెంట్ పై తెలంగాణ ఆర్టీసీ ఎంత హంగామా చేసిందో అందరికీ తెలుసు. ఆర్టీసీ బస్సు ఎక్కడం కంటే.. ర్యాపిడో బైక్ ట్యాక్సీని తీసుకోవడం మేలంటూ అల్లు అర్జున్ చేసిన ప్రకటనపై ఏకంగా కోర్టుకెక్కింది టీఎస్ఆర్టీసీ. సరిగ్గా ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీపై అలాంటి సెటైరే పేల్చారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. 

నేరుగా పేరెత్తలేదు కానీ.. పండగ వేళ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఎక్కడం శుద్ధ దండగ అనేలా ఓ మీమ్ తయారు చేసి వదిలారు. అక్కడితో ఆగకుండా దాన్ని తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసి తెలంగాణ రవాణా శాఖ మంత్రి తోపాటు, హీరో మహేష్ బాబుని కూడా ట్యాగ్ చేశారు.

ఏపీఎస్ఆర్టీసీపై సెటైర్లు..

పండగ వేళ రద్దీ దృష్ట్యా బస్సుల టికెట్ రేట్లు పెంచడం సహజం. తిరుగు ప్రయాణాల్లో ఖాళీ బస్సుల్ని తిప్పాల్సి ఉంటుంది కాబట్టి 50 శాతం అధికంగా టికెట్ రేట్లు వసూలు చేస్తుంటారు. గతంలో తెలంగాణ ఆర్టీసీ కూడా ఇలాగే చేసింది. కానీ ఇప్పుడెందుకో సంక్రాంతి విషయంలో టికెట్ రేట్లను ఇంకా పెంచలేదు.

అయితే ఏపీఎస్ఆర్టీసీ మాత్రం టికెట్ రేట్లు పెంచేసి అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టింది. ఈ క్రమంలో సజ్జనార్ వేసిన సెటైర్ బాగానే పేలింది. ఏపీ ఎస్ఆర్టీసీ సహా ఇతర అన్ని టికెట్ల రేట్లు పెరిగాయి, దానికి బదులుగా తెలంగాణ ఆర్టీసీలో టికెట్లు బుక్ చేసుకోండి సురక్షితంగా, సుఖవంతంగా ప్రయాణించండి అంటూ సజ్జనార్ మెసేజ్ ఇచ్చారు.

అఫిషియల్ గా అవమానించాలా..?

ఇలాంటి సవాలక్ష మీమ్స్ సోషల్ మీడియాలో రోజూ వస్తుంటాయి. అధికారులు కొంతమంది వాటిని క్రియేట్ చేసినా.. అనధికారికంగానే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయిస్తుంటారు. ఎవరో చేసిన వాటిని తాము రీట్వీట్ చేసి.. ఆ మెసేజ్ ని జనాల్లోకి వెళ్లేలా చేస్తుంటారు. కానీ ఇక్కడ ఈ మీమ్ టీఎస్ఆర్టీసీ ఎండీ ఆఫీస్ అనే అధికారిక ముద్రతో బయటకు వచ్చింది. పైగా దాన్ని అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వదిలారు సజ్జనార్.

ఆయన చేసిన తెలివైన పని ఏంటంటే.. ఎక్కడా ఏపీఎస్ఆర్టీసీ ప్రస్తావన లేదు. అన్ని టికెట్ల రేట్లు పెంచేశారంటూ కామన్ డైలాగ్ కొట్టేశారు. సంక్రాంతికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ రేట్లు పెరగడం సహజమే. కానీ సరిగ్గా ఏపీఎస్ఆర్టీసీ రేట్లు పెంచిన రెండ్రోజుల్లోనే ఇలాంటి మీమ్ బయటకు వదిలారంటే సజ్జనార్ టార్గెట్ ఎవరో వేరే చెప్పక్కర్లేదు.

మొత్తానికి ఏపీఎస్ఆర్టీసీ పై సజ్జనార్ భలే పంచ్ వేశారు. బహుశా ఆయన కూడా ఈ మీమ్ ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదేమో. దీనికి ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలి. సినిమా టికెట్ రేట్లపై హీరో నాని స్పందనపై మూకుమ్మడిగా విరుచుకుపడిపోయిన మంత్రులు.. సజ్జనార్ పంచ్ కి గట్టిగా రియాక్ట్ అవుతారా..? మాకెందుకొచ్చిన తలనొప్పి అని సైలెంట్ గా ఉంటారా..? రేట్లు పెంచి తప్పుచేశామని ఒప్పేసుకుంటారా..?