న్యాయస్థానం టు దేవస్థానం అంటూ హడావిడి చేశారు అమరావతి రైతులు. తిరుపతి సభలో తమ వెనక ముందు ఎవరున్నారో స్పష్టంగా చెప్పారు. తీరా ఇప్పుడు పూర్తిగా చప్పబడ్డారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ పర్యటన సందర్భంగా ఆయన కారుపై పూలుచల్లి మళ్లీ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కారు. ఉద్యమం లేకపోయే సరికి ప్రస్తుతం ఎక్కడివారక్కడ గప్ చుప్ గా ఉన్నారంతే.
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు అంటూ ఉత్సాహంగా పాదయాత్ర చేశారు అమరావతి ప్రాంతానికి చెందిన కొంతమంది. వాళ్లు రైతులా, కేవలం పొలాల యజమానులా, ఇతర వృత్తుల్లో స్థిరపడిన స్థితిమంతులా అనే విషయం పక్కనపెడితే.. అందరూ అమరావతి రైతులు అనే ట్యాగ్ లైన్ వాడుకున్నారు.
మార్గం మధ్యలో టీడీపీ, బీజేపీ, జనసేన సపోర్ట్ తో నానా హంగామా చేశారు. వైసీపీ వాళ్లు తమకు వసతి ఏర్పాట్లు లేకుండా అడ్డుకున్నారంటూ రోడ్డుపైనే భోజనం చేసి మరీ సింపతీ పొందాలని చూశారు. దీన్ని టీడీపీ అనుకూల మీడియా ఎంత హైలెట్ చేసిందో అందరికీ తెలిసిందే. చివరకు తిరుపతిలో వీరికి పెద్ద షాక్ తగిలింది. రాయలసీమకు అన్యాయం చేస్తున్నారంటూ ఉద్యోగులు, విద్యార్థులు, వృత్తి నిపుణులు.. మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. తమకి మద్దతిస్తారనుకుంటే.. తరిమేసేలా ఉన్నారని భయపడ్డారు అమరావతి బ్యాచ్.
కానీ చివరకు కోర్టు అనుమతితో సభ పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ కి గాలమేశారు కానీ, చంద్రబాబు ఆ మీటింగ్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చి రెచ్చిపోయారు.
దేవస్థానం తర్వాత సంగతేంటి..?
దేవస్థానంలో దేవదేవుడి దర్శనం అయిపోయింది, లడ్డూ ప్రసాదం కూడా అరిగిపోయింది. ఇప్పుడిక అమరావతి రైతులు ఏం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకునే సరికి అసలు వీరి నెక్స్ట్ స్టెప్ ఏంటా అనేది కూడా డైలమాలో పడింది. అమరావతి రైతుల తక్షణ కర్తవ్యాన్ని నిర్ణయించేది సీఎం జగనే. జగన్ కొత్త బిల్లు ప్రవేశ పెడితేనే రైతులకు పని. సహజంగా వారిలో వ్యవసాయం చేసేవారెవరూ లేరు కాబట్టి.. పొలం పనులు కూడా లేవు. జగన్ బిల్లు పెడితేనే.. ఉద్యమం పేరుతో వీరికి ఉపాధి దొరుకుతుంది.
ఆవిరైన ఆశలు..
న్యాయస్థానం నుంచి దేవస్థానం వెళ్లేలోపు సంచలనాలు జరుగుతాయని ఆశించారు చాలామంది. కనీసం దేవస్థానం వెళ్లొచ్చిన తర్వాత అయినా తమ ఉద్యమానికి అన్ని వైపులనుంచి మద్దతు వస్తుందని, ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని భావించారు. కానీ జగన్ కొట్టిన దెబ్బకి అందరికీ మైండ్ బ్లాక్ అయింది. అటు ఉద్యమం చేయలేక, ఇటు సైలెంట్ గా ఉండలేక సతమతం అవుతున్నారు.
అమరావతి ఏకైక రాజధాని అని ప్రభుత్వం ప్రకటించలేదు కాబట్టి.. రైతులు ఉద్యమం చేయాల్సిందే. అదే సమయంలో బిల్లు యాక్టివ్ గా లేదు కాబట్టి.. నిరసన ప్రదర్శనలు చేసినా ఎవరూ పట్టించుకోరు. వారిని అలా త్రిశంకు స్వర్గంలో వదిలి పెట్టారు జగన్.