వంగవీటి రాధాపై టీడీపీ గుర్రుగా ఉన్నట్టు సమాచారం. వంగవీటి రాధా ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల కంటే, టీడీపీకి బద్ద శత్రువులుగా భావించే మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీల వెంట తిరగడమే ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వల్లభనేని వంశీ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పార్టీ కేడర్ మొదలుకుని నాయకత్వం వరకూ తీవ్ర ఆగ్రహంగా ఉన్న వల్లభనేని వంశీతో వంగవీటి రాధా అంట కాగడాన్ని టీడీపీ అధిష్టానం జీర్ణించుకోలేకపోతోంది. అలాగే చంద్రబాబు, లోకేశ్‌లపై దూషణలకు పాల్పడే మంత్రి కొడాలి నానితో వంగవీటి రాధా కలియదిరగడం ఏంటనే ప్రశ్నలు టీడీపీ వైపు నుంచి వస్తున్నాయి.
ఇది చాలదన్నట్టు తనను అంతమొందించేందుకు రెక్కీ నిర్వహించారని, తానెవరికీ భయపడేది లేదని కొడాలి నాని, వల్లభనేని వంశీ సమక్షంలో వంగవీటి రాధా విమర్శించడం… టీడీపీపై అనుమానపు చూపులు పడేలా చేస్తోందనే ఆవేదన ఆ పార్టీ నేతల నుంచి వస్తోంది.
పైగా టీడీపీ పాలనలోనే రాధా తండ్రి వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా చంపడంతో, ఆ పార్టీని ప్రధాన శత్రువుగా కాపులు భావిస్తారు. తాజాగా రాధా సంచలన వ్యాఖ్యలు నాటి టీడీపీ అరాచకాన్ని గుర్తు చేస్తుందనే ఆవేదన కనిపిస్తోంది. రాజకీయంగా రాధా వ్యాఖ్యలు టీడీపీకి నష్టం కలిగిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. కానీ పార్టీలో కొనసాగుతూ, కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతీసేలా కొడాలి నాని, వంశీ వెంట తిరుగుతూ, వాళ్లు చెప్పినట్టు సంచలన వ్యాఖ్యలు చేయడంపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. వంగవీటి రాధా విషయమై ఏం చేయాలనేది పార్టీ సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.