మిత్ర‌ప‌క్షాన్ని శాంత ప‌రిచే య‌త్నంలో మోడీ!

భార‌తీయ జ‌న‌తా పార్టీకి గ‌త ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటి ఊపు చాలా వ‌ర‌కూ త‌గ్గింద‌నేది స్ప‌ష్టం అవుతోంది. బీజేపీ వాళ్లు ఇంకా మోడీని ఒక మ‌హానేత‌గా చూపించే ప్ర‌య‌త్న‌మే చేస్తూ ఉన్నారు. మాట‌ల…

భార‌తీయ జ‌న‌తా పార్టీకి గ‌త ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటి ఊపు చాలా వ‌ర‌కూ త‌గ్గింద‌నేది స్ప‌ష్టం అవుతోంది. బీజేపీ వాళ్లు ఇంకా మోడీని ఒక మ‌హానేత‌గా చూపించే ప్ర‌య‌త్న‌మే చేస్తూ ఉన్నారు. మాట‌ల గార‌డీలు ఇంత కాలం న‌డ‌వ‌డ‌మే ఎక్కువ‌. అయితే మ‌ధ్యంలో క‌మ‌లం పార్టీకి హిందుత్వ ఎజెండా, పాకిస్తాన్ బూచి క‌లిచి వ‌స్తూ ఉంది.

అయితే జాతీయ స్థాయిలో బీజేపీకి అలాంటి అంశాలు ఎన్నిక‌ల వేళ బ్ర‌హ్మాండంగా ప‌నికి వ‌చ్చాయేమో కానీ, రాష్ట్రాల వారీగా మాత్రం అవేవీ ఉప‌యోగ‌ప‌డే అంశాలుగా క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే బీజేపీ ప‌లు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతూ ఉంది.

ఇప్పుడు బీజేపీ ముందుకు మ‌రిన్ని రాష్ట్రాలు వ‌స్తున్నాయి. వాటిల్లో బిహార్ ఒక‌టి. అక్క‌డ బీజేపీ పాల‌క ప‌క్ష‌మే. అయితే ప్ర‌జ‌లు ఇచ్చిన అధికారం కాదు. నితీష్ కుమార్ క‌లిసి రావ‌డం వ‌ల్ల బీజేపీ అక్క‌డ పాల‌క ప‌క్షం అయ్యింది. త్వ‌ర‌లోనే ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతూ ఉన్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో జేడీయూ ప‌లు అంశాల విష‌యంలో బీజేపీతో విబేధిస్తూ ఉంది. అందులో ముఖ్య‌మైన‌ది ఎన్ఆర్సీ. 

త‌మ రాష్ట్రంలో ఎన్ఆర్సీ చెల్ల‌ద‌ని నితీష్ స్ప‌ష్టం చేశారు. బీజేపీతో సంప్ర‌దింపులు లేకుండానే ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న చేశారు. అయినా నితీష్ ను ప‌క్క‌న పెట్టే ధైర్యం చేయ‌డం లేదు క‌మ‌లం పార్టీ. జేడీయూను మోడీ కేబినెట్లోకి తీసుకునేందుకు ఇప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చార‌ట‌! లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీతో క‌లిసే పోటీ చేసింది జేడీయూ.

అయితే కేబినెట్లో మాత్రం చేర‌లేదు. అందుకు కార‌ణం.. త‌మ‌కు ఒకే ఒక మంత్రి ప‌ద‌విని ఆఫ‌ర్ చేయ‌డం. త‌మ డిమాండ్ల‌కు అనుగుణంగా ప‌ద‌వులు ఇవ్వ‌డం లేద‌ని మోడీ కేబినెట్లోకి జేడీయూ చేర‌లేదు. కానీ ఎన్డీయేలోనే కొన‌సాగుతూ ఉంది.

ఇటీవ‌లే బీజేపీకి ఒక మిత్ర‌ప‌క్షం శివ‌సేన దూరం అయ్యింది. ఇక ఇప్పుడు జేడీయూ కూడా గుడ్ బై చెబితే బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ చిత్త‌యిపోవ‌డ‌మే! అందుకే వీలైనంత‌గా జేడీయూను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింద‌ట‌. అందులో భాగంగా జేడీయూను రెండు మూడు మంత్రి ప‌ద‌వుల‌తో కేబినెట్లోకి తీసుకునేందుకు మోడీ ఓకే చెప్పేసిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.