స్కిల్ స్కామ్ లో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కోసం ఆ పార్టీ వరస పెట్టి పిటిషన్లను దాఖలు చేస్తూ ఉంది. ఇప్పటి వరకూ ఇందుకు సంబంధించి మూడు పిటిషన్లు విచారణకు వచ్చాయి. తొలి రోజే చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ ఏసీబీ కోర్టులో సాంకేతిక కారణాలను చూపుతూ ఒక పిటిషన్ వేశారు. అది తిరస్కరణకు గురైంది.
ఇక చంద్రబాబును అరెస్టు చేస్తే చేశారు.. దాన్ని హౌస్ అరెస్టుగా మార్చాలంటూ మరో పిటిషన్ వేశారు. దీనికి చాలా బిల్డప్ ఇచ్చారు. లూథ్రా ఈ పిటిషన్ వాదన సందర్భంగా ఏవేవో కేసులను ప్రస్తావించారట! అయితే సీఆర్పీసీలో హౌస్ అరెస్టు మాటే లేదని సీఐడీ తరఫున వాదనలు సాగాయి. చంద్రబాబు తరఫు వాదన నిలబడలేదు!
ఇక వ్యవహారం హైకోర్టుకు మారాకా కూడా చంద్రబాబు అండ్ కో కు ఊరట లభించలేదు. అసలు చంద్రబాబుపై ఈ కేసులే పెట్టడానికి వీల్లేదని, ఎఫ్ఐఆర్ ను సైతం రద్దు చేసేయాలని.. అంటూ దాఖలైన క్వాష్ పిటిషన్ ను కూడా కోర్టు అప్పుడే విచారణకు తీసుకోలేదు. కౌంటర్ లేకుండా క్వాష్ పిటిషన్ కుదరదని.. 19వ తేదీ వరకూ కౌంటర్ కు గడువు ఇస్తూ ఈ పిటిషన్ విచారణను వాయిదా వేశారు హైకోర్టులో! అయినా ఈ దశలో క్వాష్ పిటిషన్ నిలబడుతుందా! అనేది అనుమానమే!
చంద్రబాబుపై ఆ సెక్షన్లు పెట్టాలంటనే పక్కా ఆధారాలు ఉండాలని, ఆధారాలున్నాయనే ధైర్యంతోనే సీఐడీ ఆ సెక్షన్లను నమోదు చేసిందని స్పష్టం అవుతోంది. మరి గజం మిథ్య, పలాయనం మిథ్య అనే స్థాయిలో క్వాష్ పిటిషన్ కు కోర్టు ఏ మేరకు సానుకూలంగా స్పందిస్తుందనేది సందేహమే!
ఇక అదొక్కటే కాదు, చంద్రబాబు కోసం టీడీపీ తరఫు నుంచి పలు పిటిషన్లు కోర్టుల్లో ఉన్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పు కేసు, అంగళ్లు అల్లర్ల కేసులతో సహా స్కిల్ కేసులో కూడా బెయిల్ ఇచ్చేయాలని అన్ని కేసుల తరఫునా పిటిషన్లు వేశారట! ప్రభుత్వం ఏదో ఒక కేసులో చంద్రబాబును అరెస్టును చూపవచ్చనే భయం తో అన్ని కేసుల విషయంలోనూ బెయిల్ పిటిషన్లు వేసినట్టుగా ఉన్నారు!
ఇంకోవైపు చంద్రబాబు అరెస్టును అక్రమ నిర్బంధంగా పేర్కొంటూ టీడీపీ నేతల తరఫున మరో పిటిషన్ దాఖలైంది. దీన్ని కూడా హైకోర్టులో దాఖలు చేశారు. మరి న్యాయస్థానం ఈ పిటిషన్ ను విచారణకు తీసుకుంటూ రెండు వారాల్లో కౌంటర్ వేయాలంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మరి ఈ పిటిషన్ ను ప్రత్యేకంగా విచారిస్తారా, ఆల్రెడీ విచారిస్తున్న బెంచ్ కు బదిలీ చేస్తారో చూడాల్సి ఉంది.
ఇప్పటి వరకూ దక్కిన ఊరట చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వడానికి ఇంకా న్యాయస్థానం ఓకే చెప్పకపోవడం. క్వాష్ పిటిషన్ విచారణ జరిగేంత వరకూ సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని న్యాయస్థానం చెప్పింది. మరి ఆ క్వాష్ పిటిషన్ నిలబడకపోతే.. చంద్రబాబు సీఐడీ కస్టడీకి వెళ్లడం లాంఛనం కావొచ్చు!