ఈ ఊహ కూడా తెలుగుదేశం పార్టీకి భయంకరమైనది! స్కిల్ డెవలప్ మెంట్ కేసుల్లో తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి పరోక్ష మద్దతు కూడా ఉన్నట్టుగా అయితే అప్పుడు పరిస్థితి ఏమిటి? అనే ఊహ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కలవరపెడుతూ ఉండాలి! అందునా చంద్రబాబుపై ఇప్పుడు ఉన్నది కేవలం స్కిల్ కేసు మాత్రమే కాదు!
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతూ ఉంది! కనీసం ఆ కేసులను ఒక దాని తర్వాత మరోటి తెరపైకి తెచ్చినా.. చంద్రబాబును కనీసం రెండు మూడు నెలల పాటు జైలు, కోర్టు చుట్టూ తిప్పడానికి పుష్కలమైన అవకాశాలున్నాయి! ఇవే అనుకుంటే.. ఇన్ కమ్ ట్యాక్స్ నోటీసుల సంగతి సరేసరి!
ఇప్పటి వరకూ ఈ వ్యవహారానికి ఢిల్లీ మద్దతు ఎంత ఉందనేది బయటపడని సంగతి! ఎన్నికల వరకూ చంద్రబాబును జైలు, కోర్టు చుట్టూ తిప్పుతూ.. ఆయన అవినీతి బాగోతాలను చర్చలో ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ఉండవచ్చు! మరి దీనికి కేంద్రంలోని పెద్దలు కూడా ఆశీస్సులు ఇస్తే మాత్రం.. ఇక ఎన్నికల ప్రణాళికల సంగతిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు ఈ కేసుల ఉచ్చు నుంచి ఎలా బయటపడాలనే అంశం గురించి మాత్రమే దృష్టి సారించాల్సి ఉంటుంది!
ఇదే సమయంలో చంద్రబాబు కేరాఫ్ రాజమండ్రి సెంట్రల్ జైలు అయితే తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరం ఏర్పడుతుంది. లోకేష్ కు అంత సీనుందా అనేది ఇంకా అనుమానాస్పదమైన అంశమే! చంద్రబాబు అరెస్టుకు కేంద్ర పెద్దలు కూడా మద్దతు పలికి, ఆయన విచారణను ఎదుర్కొని , నిర్దోషిగా బయటకు రావాలనే కామెంట్ గనుక ఢిల్లీ నుంచి వచ్చిందంటే మాత్రం.. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అంతకు మించిన శరాఘాతం లేదు.
జగన్ కక్ష సాధింపు కోసం అరెస్టు చేశారనే వాదన దీర్ఘకాలం నిలబడదు! చంద్రబాబును అరెస్టు చేస్తే సాయంత్రానికళ్లా విడుదలయ్యేంత వీక్ వ్యూహంతో అయితే జగన్ ముందుకు వెళ్లి ఉండరు! అందులోనూ.. గత నాలుగేళ్లలో కోర్టుల్లో తెలుగుదేశం పార్టీ చాలా విజయాలు సాధించింది! ఆ విషయం జగన్ ఎరగనిది ఏమీ కాదు. కోర్టుల్లో చంద్రబాబును కొట్టేవాడు లేడనే టాక్ ఈనాటిది కూడా కాదు!
ఇలాంటి నేపథ్యంలో.. చాలా లోతైన వ్యూహంతోనే చంద్రబాబును జైలుకు పంపారని టీడీపీ శ్రేణులకు కూడా అర్థం అయి ఉండవచ్చు! మొత్తానికి ఎన్నికలకు మరెంతో సమయం లేని నేపథ్యంలో.. మొత్తం పొలిటికల్ గేమ్ కొత్త టర్న్ తీసుకుని ఆసక్తిదాయకంగా మారింది!