ఇన్నాళ్ళూ టీడీపీదే అధికారం 160 సీట్లు అని ఆ పార్టీ పెద్దలు భారీ ప్రకటనలు ఇస్తూ వచ్చారు. ఇంతలో చంద్రబాబు అరెస్ట్ కావడం జైలు పాలు కావడం కూడా చకచకా జరిగిపోయాయి. ఇపుడు పక్కాగా టీడీపీ గెలుపు రాసుకోండి అంటున్నారు తమ్ముళ్ళు.
మరి బాబు ఒకవేళ జైలుకు వెళ్లకపోతే ఆయన అరెస్ట్ జరగకపోయి ఉంటే టీడీపీ మళ్లీ ఓడి ఉండేదా. గత నాలుగున్నరేళ్ళుగా టీడీపీ చేసిన పోరాటాలు ఏవీ ప్రజలకు ఎక్కలెదా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదా అని అంటున్నారు అంతా.
చంద్రబాబు అరెస్ట్ తో పులివెందులలోనే జగన్ ఓడిపోతారు అని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత జోస్యం చెప్పారు. జగన్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇక చూసుకోండి సైకిల్ ప్రభంజనం అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటిస్తున్నారు.
దీనిని బట్టి ఆలోచిస్తే కాళ్ళరిగేలా ఎనిమిది నెలల పాటు లోకేష్ చేసిన పాదయాత్ర, చంద్రబాబు రెండేళ్ళుగా జిల్లాలను పట్టుకుని తిరిగిన తిరుగుళ్ళు అన్నీ జనాల మనసులను కనీసంగా కూడా తాకలేకపోయాయా అన్నదే ప్రశ్నగా ముందుకు వస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ తో జైలుతో సానుభూతి వెల్లువలా వస్తుందని దాంతో ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ వేసుకుంటున్న లెక్కలు నిజం కాకపోతే సంగతేంటి అంటున్నారు. సానుభూతి ఎపుడూ ఒకేలా ఉండదు, ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్యమాల నేపధ్యంలో ప్రతీ విషయం జనాలకు అవగాహన ఉంది అంటున్నారు.
టీడీపీకి సానుభూతి కనుక వర్కౌట్ కాకపోతే అపుడు సంగతేంటి అని అడిగిన వారూ ఉన్నారు. బాబు జైలు పాలు కావడంతోనే టీడీపీ గెలుస్తుంది అనుకుంటే బెయిల్ కోసం తపన ఎందుకు పడుతున్నారు అని కూడా అడుగుతున్న వారు ఉన్నారు. సింపతీ మీద ఇపుడు టీడీపీ ఆధారపడుతోందా అన్న డౌట్ వస్తున్నాయి. ఎన్నికల్లో ఎన్నో ఫ్యాక్టర్లు పనిచేస్తాయని అంటున్నారు. అసలైన జోస్యం చెప్పేది జనాలే తప్ప నాయకులు కాదనీ అంటున్నారు.