తెలంగాణ రాజకీయంలో మరో తార మెరవనుందా? తల్లి తెలంగాణ పార్టీతో, ఆ తర్వాత టీఆర్ఎస్ ఎంపీగా విజయశాంతి ఉనికిని చాటుకున్నారు! ప్రస్తుతం విజయశాంతి రాజకీయంగా మునుపటి ఉనికితో అయితే లేదు! కాంగ్రెస్ , బీజేపీ.. ఇలా పార్టీలు మారారు ఆమె. బీజేపీలో చేరాకా విజయశాంతి రాజకీయంగా మరింత వెనుకబడిపోయినట్టుగా ఉన్నారు!
అయితే తెలంగాణ రాజకీయంలోకి మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తూ ఉంది. అది సమంత రూపంలో జరగబోతోందనే వార్తలు వస్తున్నాయి. మరి సమంత నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇస్తుందో లేదో కానీ, వస్తే మాత్రం రకరకాల విశ్లేషణలు, విమర్శలకు లోటు లేకపోవచ్చు. పొలిటికల్ ఎంట్రీ ఇస్తే సమంత బీఆర్ఎస్ లోకే చేరుతుందనే అంచనాలు వేయడానికి ప్రత్యేక జ్ఞానం అక్కర్లేదు!
హైదరాబాద్ లోని సినీ జనాలు కేసీఆర్ పార్టీతో చాలా సన్నిహితంగానే మెలుగుతూ ఉన్నారు మొదటినుంచి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాకా.. టీఆర్ఎస్ కు సినిమా వాళ్లలో విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది! హైదరాబాద్ లో స్టూడియోలు, పెద్ద ఎత్తున ఆస్తులు, వ్యవహారాలను కలిగి ఉన్నందున టీఆర్ఎస్ తో సఖ్యతగా మెలగడం తప్పని పరిస్థితుల్లో ఉన్నారు సినిమా వాళ్లు! టీఆర్ఎస్ నాయకత్వానికి చిన్న ఇబ్బంది కలిగించినా.. తమ పని అయిపోతుందనే భయాలతో సినిమా వాళ్లు ఉన్నారనేది బహిరంగ రహస్యం!
చిన్నా పెద్ద తేడా లేకుండా.. టీఆర్ఎస్ కు గులాం అన్నట్టుగా సినిమా వాళ్ల ధోరణి కొనసాగుతూ ఉంది. అయితే ఎవ్వరూ టీఆర్ఎస్ లోకి అధికారికంగా చేరలేదు! అందుకు కుల భావనో మరోటో అడ్డు వస్తూ ఉండవచ్చు. టీఆర్ఎస్ అంటే భయం ఉంది తప్ప.. సినిమా జనాల్లో ప్రేమ అయితే లేదు! మరి ఇప్పుడు సమంత ఆ పార్టీలోకి చేరితే.. ఆమెకు పొలిటికల్ సపోర్ట్ లభించినట్టే!
తన విడాకుల వ్యవహారంతో సమంత కొన్ని విమర్శలను అయితే ఎదుర్కొంది. విడాకులు తీసుకున్న వాళ్లంటే, ప్రత్యేకించి విడాకులు తీసుకున్న ఆడవాళ్లంటే సమాజానికి చులకన ఉంటుంది. ఈ విషయంలో సమంత కూడా అతీతం కాలేకపోయింది. ఎంత స్టార్ హీరోయిన్ అయినప్పటికీ… విడాకులు తీసున్నదనే ముద్ర తో ఆమెను మానసికంగా ఒత్తడానికి సోషల్ మీడియా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. ఆమెతో విడాకులు తీసుకున్న హీరోకు అలాంటి ఇబ్బంది ఉండదు!
మరి అలాంటి పరిస్థితులను ఎదుర్కొని కూడా తన సినిమా కెరీర్ ను కొనసాగిస్తూ, తనే ప్రధాన పాత్రల్లో సినిమాలను చేస్తూ సమంత తన ధీటుగా అయితే నిలుస్తోంది. మరి ఆమె సినిమాలకే పరిమితం అయితే ఆమెకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ కొనసాగవచ్చు. అదే రాజకీయాల్లోకి ఎంటరయితే మాత్రం.. ఇక ఫిల్మ్ కెరీర్ లేదనే లెక్కలేసుకుని రాజకీయాల్లోకి వస్తుందోనే విశ్లేషణలూ మొదలవుతాయి.
అది కూడా శాకుంతలం సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ఆమె సినిమా ఖుషీ కూడా పెద్ద హిట్ అనే పరిస్థితి ఏమీ లేదు! ఇలాంటి నేపథ్యంలో గ్లామర్ ఉన్న రోజుల్లో సినిమా గ్లామర్ ను రాజకీయ గ్లామర్ గా మార్చుకునే ప్రయత్నం చేస్తోందనే అభిప్రాయాలే సర్వత్రా వినిపిస్తాయి. సినిమా వాళ్లు జనాలను ఏదో ఉద్ధరించేయడానికి రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయాలు ఏమీ లేవిప్పుడు. హీరోలైనా.. హీరోయిన్లు అయినా.. పాలిటిక్స్ ను కూడా గ్లామరస్ ఫీల్డ్ గా చూస్తున్నారు! మరి రాజకీయాల్లోకి అంటూ వస్తే సమంత కూడా ఇలాంటి విమర్శలను ఎదుర్కొనడానికి రెడీగానే ఉండి ఉండాలి!