చంద్ర‌బాబు కోసం.. ప‌వ‌న్ జార‌డానికి ఇంకా మెట్లున్నాయా?

అరెస్టుతో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎంత డ్యామేజీ క‌లిగిందో కానీ, ఇదే అరెస్టుతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మాత్రం చాలా డ్యామేజే జ‌రిగింది! త‌న ద‌త్త‌తండ్రి అరెస్టుపై తెగ ఇదైపోయి…

అరెస్టుతో తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు ఎంత డ్యామేజీ క‌లిగిందో కానీ, ఇదే అరెస్టుతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మాత్రం చాలా డ్యామేజే జ‌రిగింది! త‌న ద‌త్త‌తండ్రి అరెస్టుపై తెగ ఇదైపోయి ఈ ద‌త్త‌పుత్రుడు రోడ్డున ప‌డ‌టం జ‌న‌సేన శ్రేణుల‌నే నివ్వెర‌ప‌రిచింది! 

ఎంత పొత్తు ఉన్నా.. ఎంత మిత్ర‌ప‌క్షం అయినా.. మ‌రీ ఇంత‌నా! అనే అభిప్రాయాలు జ‌న‌సైనికుల్లోనే వినిపిస్తూ ఉన్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఒక స్థాయిలో ఊహించుకుంటున్న వాళ్లు చంద్ర‌బాబు అవినీతి కోసం ఆయ‌న రోడ్డు ప‌డ‌టం మాత్రం జీర్ణించుకోలేని అంశంగా మారింది!

అందునా.. చంద్ర‌బాబు సొంత పుత్రుడు క‌న్నా దత్త‌పుత్రుడు చాలా బాధ‌ప‌డిపోతున్నాడ‌నే కామెంట్ జ‌న‌సైనికుల‌ను నిస్తేజానికి గురి చేస్తోంది.  ఏ అంగ‌ళ్లు అల్ల‌ర్ల కేసులో చంద్ర‌బాబును అరెస్టు చేసి ఉంటే.. అప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రేంజ్ రియాక్ష‌న్ ఇచ్చి ఉంటే, అదో లెక్క! అయితే చంద్ర‌బాబు జైలుకు వెళ్లింది అవినీతి కేసులో! మ‌రి ఇలాంటి కేసులో ఇంత రియాక్ష‌న్ వ‌ల్ల చంద్ర‌బాబు అవినీతిలో ప‌వ‌న్ కు కూడా వాటా ఉంది కాబోలు అని సామాన్యులు అనుకునే ప్ర‌మాదం కూడా ఏర్ప‌డింది!

ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా మాట‌లు మార్చాడు. ఆయ‌న వ్యూహాల‌కు అనుగుణంగా డ్యాన్సులు చేశాడు! ఎవ‌రితో క‌ల‌వ‌మంటే వారితో క‌లిశాడు. ఓట్ల కూడిక‌, చీలిక అంటూ అభాసుపాల‌య్యాడు! త‌న‌కు గుండు కొట్టించిన‌ట్టుగా ప్ర‌చారం చేసుకున్న వారి ఇంటికే వెళ్లి వారి ఆతిథ్యం స్వీక‌రించాడు! వారే త‌న‌కు గుండు కొట్టించిన‌ట్టుగా ప్ర‌చారం చేశార‌ని చెబుతూనే, వారి ఇంటికే వెళ్లి విందులు పొంద‌డం ప‌వ‌న్ కే సాధ్య‌మైంది!

మ‌రి ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు వ్యూహాల్లో భాగ‌మై ప‌వ‌న్ మూట‌గ‌ట్టుకున్న‌ది రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోవ‌డం అనే ఖ్యాతి! తాజా ఎపిసోడ్ తో ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సైనికుల‌ను కూడా ఖిన్నుల‌ను చేశాడు! మ‌రి చంద్ర‌బాబు జైలు నుంచి ఇప్పుడ‌ప్పుడే బ‌య‌ట‌కు రాక‌పోతే, ప‌వ‌న్ ఇంకా ఎంత ఇదైపోతాడో! అయినా.. చంద్ర‌బాబు కోసం ప‌వ‌న్ జార‌డానికి ఇంకా మెట్లున్నాయా? ఉన్నా లేక‌పోయినా.. ఎన్నిక‌ల వ‌ర‌కూ చంద్ర‌బాబు కోసం దిగ‌జార‌డ‌మే ప‌వ‌న్ ప‌ని కావొచ్చు!