చంద్రబాబు గారు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి పంపబడిన కేసు గురించి చదువుతూంటే ఇది స్కిల్ డెవలప్‌మెంట్‌లో స్కామా? స్కాము చేయడంలో స్కిల్లా? అనే అనుమానం వచ్చింది. చివరకు రెండూ ఉన్నాయని అర్థమైంది. దీనిలో బాబు పాత్ర అనేది యితమిత్థంగా తేల్చడం కష్టం. ఒకవేళ సులభం అయినా తేల్చరు. వివేకా హత్య కేసులో రాశాను కదా, హై ప్రొఫైల్ కేసుల్లో అసలు నిందితులు బయటపడడం, వారికి శిక్షలు పడడం చాలా అరుదుగా జరుగుతుందని. ముఖ్యమంత్రులు నోటి మాట మీదే పనులు జరిపిస్తారు. సంతకాలు అధికారుల చేత పెట్టించి వారిని యిరికిస్తారు. దశాబ్దం పోయాక విచారణాధికారులు అడిగితే ‘ఏమో, మర్చిపోయాను. నాకు లక్ష వ్యవహారాలు. ఇవన్నీ గుర్తు పెట్టుకోవడం సాధ్యమా?’ అంటారు.
ఇంతలో రాష్ట్రంలోనో, కేంద్రంలోనో అధికారంలో ఉన్నవారికి వాళ్లతో రాజకీయ అవసరాలు పడతాయి. కేసు అటకెక్కుతుంది. దింపేసరికి యీ నాయకుడికి వృద్ధాప్యం వచ్చిందంటారు. జ్ఞాపకశక్తి నశించిందంటారు, ఫైళ్లు వరదల్లో కొట్టుకుని పోయాయంటారు. ఆనాటి సాక్షులు కొందరు చచ్చిపోయారంటారు. కేసు సంగతి ప్రజలు మర్చిపోతారు. జగన్ కేసులే చూడండి. ఎప్పుడు మొదలు పెట్టారు, పదేళ్లు దాటినా ఓ కొలిక్కి వచ్చాయా? దోషో, నిర్దోషో తేల్చగలిగారా? ఈలోపుగా ప్రజలు ఎలాగైనా అనుకోవవచ్చు. అక్రమ వ్యవహారాలు చేసేవారు సాక్ష్యాలు లేకుండా చాలా జాగ్రత్త పడతారు. ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలో వారికి ఆడిటర్లు చెప్తారు. విచారణకు వస్తే ఎలాటి సమాధానాలు చెప్పాలో న్యాయవాదులు చెప్తారు. అందువలన బాబుకి బెయిలు వస్తుందా రాదా, శిక్ష పడే అవకాశం ఎంత ఉంది యిలాటివి తెలుసుకోవడానికైతే యీ వ్యాసం చదవకండి.
ఇక అరెస్టు ఉచితమా? అనుచితమా? వంటి విషయాలు కూడా దీని ద్వారా మీరు తెలుసుకోలేరు. నాకు దాని మీద ఆసక్తి లేదు. ఇవన్నీ తాత్కాలిక వార్తలు. పవన్‌ను వైజాగ్ హోటల్లో నిర్బంధించినపుడు అదో పెద్ద న్యూస్. ఇప్పుడు గుర్తుకే రాదు. స్కాము జరిగిన విధానమేమిటో తెలుసుకోవడమే నాకు ఆసక్తిదాయకం. ఆ సొమ్ములో కొంతభాగం బాబుకి చేరిందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయడం వృథా అని నా అభిప్రాయం. జగన్ కేసులప్పుడే రాశాను – యీ క్విడ్ ప్రోకోలు గట్రా నిరూపించడం కష్టం అని. నిరూపణ అయ్యి, కోర్టులో శిక్ష పడేవరకూ జగన్‌ను కానీ, బాబును కానీ, మరొకర్ని కానీ దోషి అని నిర్ధారణగా చెప్పడం కష్టం. అనుమానాలంటారా? ఎవరి యిష్టం వారిది, ఎవరి ఊహాశక్తి వారిది. ఊహించడానికి ముడిసరుకు కోసం పేపర్లు వెతికాను.
గతంలో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ రోజులైతే సమాచారం కోసం ఒక పత్రిక చదివితే సరిపోయేది. వాళ్ల వార్తను సమగ్రంగా యిచ్చేసి, వ్యాఖ్యల కోసం ఎడిట్ పేజీ కేటాయించేవారు. అక్కడి సంపాదకీయం, వ్యాసాల ద్వారా పత్రిక స్టాండు తెలిసేది. ఈనాడు వచ్చాక వార్తలు, వ్యాఖ్యలు కలపడం, కొన్ని వార్తలను తొక్కిపెట్టడం, సగం రాయడం, మరి కొన్నిటి విషయంలో అబద్ధాలు, అతిశయోక్తులు రాయడం ప్రారంభమైంది. తర్వాత అన్ని పత్రికలకూ అదే ఒరవడి అయింది. ఈరోజు దేని గురించైనా తెలుసుకోవాలంటే నాలుగైదు పత్రికలు, టీవీలు, వెబ్‌సైట్లు సంప్రదించవలసి వస్తోంది. ఈ కేసు విషయంలో ఆంధ్రజ్యోతి, సాక్షి చెరో సగం రాశారు. రెండూ కలిపితే జరాసంధుడి రూపం తోచింది. అయినా స్పష్టరూపం రాలేదు. నెట్, ఎసిబి రిపోర్టూ చదివాను. అయినా గ్యాప్స్ కనబడ్డాయి, సందేహాలు వచ్చాయి. అన్నీ మీ ముందు ఉంచుతాను. మీకేమైనా తెలిస్తే పూరించండి.
దానికి ముందు ఒకటి రెండు విషయాలపై క్లారిటీ తెచ్చుకుని ముందుకు సాగుదాం. ‘మొదటి ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదు. ఇప్పుడు చేర్చారు, అన్యాయం’ అంటూ కొందరంటున్నారు. తర్వాత చేర్చే ప్రొవిజన్ ఉన్నపుడు చేరుస్తారు. ‘ఈ కేసులో మొదట్లో అధికారుల నిర్వాకమే అనుకుని చేర్చలేదు. ఇప్పుడేమైనా ఆధారాలు దొరికాయేమో, అందుకు చేర్చార’ని ఎందుకనుకోకూడదు? వివేకా హత్య కేసులో అవినాశ్ పేరు ముందులో లేదు. తర్వాత వచ్చి చేరింది. అప్పుడు యిలాటి సందేహం రాలేదేం? ఎసిబి కోర్టులో తన వాదనల్లో బాబు తరఫు వకీలు సిద్ధార్థ లూథ్రా గారు యీ పాయింటు లేవనెత్తారా? ఆయన కేసు గురించి మాట్లాడకుండా కేవలం అనేక సాంకేతిక అంశాలపైన మాత్రమే మాట్లాడారు. ఆరోపణల గురించి మాట్లాడితే సిఐడి వారు వాటికి సమాధానాలు తయారు చేసుకుంటారని భయం కాబోలు, యివన్నీ విచారణకు వచ్చినపుడే మాట్లాడదాం, ప్రస్తుతానికి గవర్నరుకి చెప్పారా? ఎన్ని గంటలకి అరెస్టు చేశారు యిత్యాది వాదనలతో సరిపెట్టారు. అన్నీ నియమబద్ధంగా చేశామని సిఐడి వారు న్యాయమూర్తిని కన్విన్స్ చేయగలిగారు.
ఇక రెండో పాయింటు ఏమిటంటే, ‘స్కిల్ డెవలప్‌మెంట్‌ను స్కాము అనడమేమిటి? 2016లో దాని ద్వారా శిక్షణ ప్రారంభమయ్యాక నిరాఘంటంగా సాగుతూ 3.80 లక్షల మందికి శిక్షణ యిచ్చారు. వారిలో 64444 మందికి టిడిపి హయాంలో, 20001 మందికి వైసిపి హయాంలో ఉద్యోగాలు వచ్చాయి. ఇవన్నీ ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి.’ అని ఆంధ్రజ్యోతి చెప్పింది. కొందరు ఔను మేం లబ్ధి పొందాం అని స్టేటుమెంట్లు యిచ్చారట కూడా. స్కాముకీ, దీనికీ సంబంధం ఏముందని నా సందేహం. ఒక యిరిగేషన్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపణ ఉంది. ప్రాజెక్టు వలన యిన్ని వేల ఎకరాల చేలు తడిశాయి చూడు అంటే ఎలా? మధ్యలో పాలకుల చేతులూ తడిశాయా అనే ప్రశ్నకు బదులివ్వాలి కదా! గత ఏడేళ్లగా యీ సెంటర్ల ఖర్చు ఎవరు భరిస్తున్నారు? కార్పోరేషనా? ప్రభుత్వశాఖా? లేక ప్రభుత్వం నుంచి 371 కోట్లు తీసుకున్న డిజైన్ టెక్కా?
దాని కంత సీనుందా? డిజైన్‌టెక్ కంపెనీ ఎలాటిదో ఆంధ్రజ్యోతే రాసింది. పన్నుల రూపంలో చెల్లించే సొమ్మును మిగుల్చుకోవాలనే కక్కుర్తితో తక్కువ లావాదేవీలు చూపించి అది దాదాపు రూ.7 కోట్ల పన్నులు ఎగ్గొట్టిందని పుణెకు చెందిన జీఎస్టీ యింటెలిజెన్స్ విభాగం 2017లో నిర్ధారించింది. ఇదీ దీని కారెక్టర్. దీనికి తోడు ఆంధ్రజ్యోతి యింకోటీ రాసింది. సీమెన్స్ ఇండియా మాజీ ఎండీ సుమన్ (అలియాస్ సౌమ్యాద్రి శేఖర్) బోస్, డిజైన్‌టక్ ఎండీ వికాస్ కన్వేల్కర్లు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారని సీమెన్స్ కంపెనీ జరిపిన అంతర్గత విచారణలో వెల్లడించింది. ఆ షెల్ కంపెనీలు బాబుకి డబ్బులు చెల్లించాయని ఆంధ్ర సిఐడి ఆరోపిస్తోంది. పోనీ అదేమీ లేదనుకున్నా డిజైన్‌టెక్ కంపెనీ షెల్ కంపెనీలు పెట్టుకుందని సీమెన్స్ కంపెనీ వెల్లడించింది కదా! ఆ మేరకు డిజైన్‌టెక్ ఎలాటి కంపెనీయో మనకు తేటతెల్లమౌతోంది. దాని ఎండీ వికాస్ ఖన్విల్కర్ అరెస్ట్ అయ్యారు. దానికున్న రూ.31.20 కోట్ల బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్లు ఉంటే ఈడీ యిటీవలే జప్తు చేసింది.
ఇక వాళ్లతో కలిసి షెల్ కంపెనీలు పెట్టిన సుమన్ బోస్ మాజీ ఎలా అయ్యాడు? మనం సీమెన్స్ అని లూజుగా అనేస్తున్నాం కానీ యీ కేసులో ప్రస్తావనకు వస్తున్నది సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్ (ఎస్ఐఎస్‌డబ్ల్యు) ప్రై.లి. ఇది సీమెన్స్ ఎజి అనే కంపెనీకి 100% సబ్సిడియరీ. దీనికి యీ సుమన్ ఎండీ. ఇతను తన పేరంటు కంపెనీకి చెప్పకుండా, వారి లీగల్ డిపార్టుమెంటును సంప్రదించకుండా తనంతట తనే ఆంధ్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. తమ భాగస్వామి ఐన డిజైన్‌టెక్‌తో కలిసి కుమ్మక్కయి గోల్‌మాల్ వ్యవహారాలు చేశాడు. జిఎస్‌టి వారి ప్రశ్నించడం వలన యిదంతా సీమెన్స్ పేరంటు సంస్థ దృష్టికి వచ్చింది. వెంటనే ‘ఇదంతా సుమన్ నిర్వాకం. మాకేమీ సంబంధం లేదు’ అని చెప్పేసింది. చెప్పి ఊరుకోకుండా సుమన్‌ను ఉద్యోగం లోంచి అవమానకరంగా తీసేసింది. అతనికి సహకరించిన మరో ముగ్గుర్ని కూడా తీసేసింది. అంతేకాదు, డిజైన్‌టెక్‌కు భాగస్వామ్యం మానేసింది. వాళ్లు ప్రస్తుతం ఫ్రాన్సుకి చెందిన దసో అనే ప్రత్యర్థి కంపెనీకి భాగస్వాములయ్యారు.
ఇక్కడ 2005లో ఆంధ్ర ప్రభుత్వాన్ని మోసగించిన ఫో(వో)క్స్‌వ్యాగన్ ఉద్యోగి గుర్తుకు వస్తాడు. సీమన్స్ లాగానే అదీ ఓ జర్మన్ కంపెనీ. ఆ కంపెనీ డైరక్టరు హెల్మత్ షుస్టర్ అనే అతను, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా ప్రతినిథి అశోక్ జైన్ అనే అతను కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసి ‘మేం వైజాగ్‌లో మా కార్ల ఫ్యాక్టరీ పెడతాం.’ అని ఆఫర్ యిచ్చారు. వైయస్, అప్పటి పరిశ్రమల మంత్రి బొత్సా సత్యనారాయణను దీని సంగతి చూడమన్నారు. ఆయన అడిగితే ఈ హెల్మత్ ‘‘మీరు మీ వాటాగా రూ. 11 కోట్లు విడబ్ల్యు అనే ఖాతాలో వేయండి.’ చెప్పాడు. ఆయన ఎపిఐఐసి ద్వారా ఆ ఖాతాలో వేశారు. విడబ్ల్యు అంటే వోక్స్‌వ్యాగన్ అని వీళ్లనుకున్నారు. కానీ అది ‘వశిష్ట వాహన్’ అనే కంపెనీ పేర హెల్మత్, అశోక్‌లు తెరిచిన ఖాతా అని తర్వాత తెలిసింది.
వాళ్లు వెంటనే డబ్బు విత్‌డ్రా చేసేయడంతో వీళ్లకు అనుమానం వచ్చి పేరంటు కంపెనీని అడిగితే, వాళ్లు హెల్మత్ మాకు చెప్పకుండా యీ పని చేశాడు. అతనిపై చర్య తీసుకుంటాం. అన్నారు. వెంటనే వైయస్ కేసు సిబిఐకు అప్పగించారు. బొత్స జర్మనీ వెళ్లి ‘అయిందేదో అయింది, యిప్పటికైనా మీరు వైజాగ్‌లో ఫ్యాక్టరీ పెట్టండి’ అని ఫోక్స్‌వ్యాగన్‌ను అడిగారు. వాళ్లు కుదరదన్నారు. ‘కావాలంటే మీకు 11 కోట్లు వెనక్కి యిచ్చేస్తాం, కేసు విత్‌డ్రా చేసుకోండి’ అని ఆఫర్ చేశారు. కానీ వైయస్ ఒప్పుకోలేదు. డబ్బు ముఖ్యం కాదు, మీ కంపెనీ పేరు చెప్పి మా ప్రభుత్వాన్ని మోసం చేసినవాళ్లకి శిక్ష పడాల్సిందే’ అన్నారు. ఆ కేసు యింకా నడుస్తూనే ఉంది. బొత్స 2019లో సిబిఐ కోర్టులో సాక్ష్యం యిచ్చారు.
ఈ కేసు జరిగినప్పుడు బొత్సను యిప్పుడేం చేస్తారు? అని ఓ విలేకరి అడిగితే ‘సొమ్ములు పోనాయ్, యింకేం చేత్తాం?’ అని ఉత్తరాంధ్ర యాసలో సమాధాన మిచ్చారు. మర్నాడు ‘‘ఈనాడు’’లో అదే హెడ్‌లైన్స్! వెక్కిరించి, వెక్కిరించి వదిలిపెట్టారు. ఇదీ మన ముఖ్యమంత్రి తెలివితేటలు, ప్రజాధనాన్ని కాపాడలేక పోయారు అంటూ చంద్రబాబు చెలరేగి పోయారు. ఆ అనుభవం కళ్లెదురుగా ఉండగా ఆయన హయాంలో మళ్లీ అలాటి స్కామే జరిగింది. కానుకోలేక పోయారు.
ఎస్ఐఎస్‌డబ్ల్యు మోదీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంతో 2013 అక్టోబరులో చేసుకుంది. అది చూసే బాబు ఆంధ్రలో చేశామన్నారు. ఇది జరిగిన తర్వాత 2017 జూన్‌లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అది రూ. 2031 కోట్ల ప్రాజెక్టు. రూ.1822 కోట్లు సీమెన్స్ సబ్సిడియరీది, రూ.219 కోట్లు కర్ణాటక ప్రభుత్వంది. అక్కడ యిలాటి స్కాములు జరగలేదు. అంటే మోదీ, సిద్ధరామయ్య మెలకువతో వ్యవహరించారన్నమాట. సిద్ధరామయ్య ఏ మాత్రం పొరపాటుగా వ్యవహరించి ఉన్నా, అతని తర్వాత వచ్చిన బిజెపి వదిలి పెట్టి ఉండేది కాదు. 2022లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కుదుర్చుకుంది. ఇప్పటిదాకా దానిపైనా గొడవ జరగలేదు. గుజరాత్ ప్రభుత్వంతో మేం చేసుకున్నాం చూడండి అని సుమన్ బోస్ చెప్పినపుడు ఆంధ్ర టీము వెళ్లి చూసి వచ్చి భేషుగ్గా ఉందని చెప్పారట. మరి ఒప్పందం కూడా అలాగే కుదుర్చుకోవాలిగా!
ఒక పాఠకుడు గుజరాత్‌లో జరిగిన ఒప్పందం లింకు పంపారు. http://www.gecrj.cteguj.in/
ఈ సెంటరుకు గాను గుజరాత్ ప్రభుత్వం డిజైన్‌టెక్‌కు చెల్లించే మొత్తం పన్నులతో కలిపి రూ.17.10 కోట్లు! ఆంధ్రకు వచ్చేసరికి 6 క్లస్టర్లు. ఒక్కో క్లస్టర్‌కు రూ. 547 కోట్లు అని చెప్పారు. దానిలో ప్రభుత్వం వాటా 10% అంటూ సెంటరుకు 54.7 కోట్లు చొప్పున 330 కోట్లు చెల్లించారు. దానికి పన్నులు కలిపితే 371 అయింది. గుజరాత్ పన్నులతో సహా 17.10 కోట్లు ఒక సెంటరుకై చెల్లించింది. ఆంధ్రకు గుజరాత్ కంటె 3 రెట్లు విలువైన సాఫ్ట్‌వేర్ యిస్తామన్నారా? తెలియదు. ఈ సెంటర్‌కు సంబంధించి ఆదాయవ్యయాల గురించి డిజైన్‌టెక్ వేరే ఖాతా తెరవాలి అని కూడా ఒప్పందంలో ఉంది. దానిలో 90% వాటా సీమెన్స్‌ది వంటి డాబుసరి మాటలేవీ లేవు.
ఆంధ్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చేసరికి కొత్తగా ఏర్పరచిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్, ఎస్ఎస్ఐడబ్ల్యు, డిజైన్‌టెక్ యీ మూడు కలిసి త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. మొత్తం రూ.3300 కోట్ల ప్రాజెక్టు, 10% ఆంధ్రది. 90% ఎస్ఎస్ఐడబ్ల్యుది అన్నారు. జర్మనీ నుంచి డబ్బు రావడం లేటవుతుంది, అందువలన ముందు మీది యిచ్చేయండి అని అడిగారు, అందుకే మా అధికారులు యిచ్చారు అని బాబు ఎసిబి కోర్టుకి చెప్పారు. రూ.371 కోట్లు డిజైన్‌టెక్‌కి యిచ్చారు. తమకు వచ్చిన డబ్బులోంచి డిజైన్‌టెక్ రూ.58.8 కోట్లు ఖర్చు పెట్టి ఎస్ఎస్ఐడబ్ల్యు దగ్గర సాఫ్ట్‌వేర్ కొంది. అంటే ఒక కస్టమర్ కంపెనీ నుంచి కొన్నట్లు కొందన్నమాట. అక్కడితో ఎస్ఎస్ఐడబ్ల్యు పని సరి!
ఇదంతా సీమెన్స్ హెడాఫీసుకి తెలియకుండా ఎస్ఎస్ఐడబ్ల్యు చేసిన నిర్వాకం. అమరావతి నిర్మాణం చూడండి, సింగపూరు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అని యిక్కడ మీడియా హోరెత్తించింది. ప్రభుత్వంతో కాదు, ఈశ్వరన్‌కు సంబంధించిన కంపెనీలతో అని తర్వాత తేలింది. అది మెటీరియలైజ్ కాలేదు. ఇది అయ్యింది. ఈ 371 కోట్లలో ఆ రూ.58.8 మాత్రమే సద్వినియోగం అయినట్లు లెక్క. అందుకనే అదీ, మరి కొంతా తీసేసి యిది రమారమి రూ. 279 కోట్ల స్కాము అంటోంది సిఐడి. ఆ స్కాము డబ్బు అంతిమంగా ఎవరికి చేరింది అనేది మనం బతికుండగా తేలకపోవచ్చు. అది వదిలేయండి. కానీ సామాన్య మానవుడు కూడా ప్రశ్నించే అంశం ఒకటుంది యిక్కడ.
మార్జిన్ మనీ విషయం అందరికీ అనుభవమే. ఇల్లు కట్టుకుంటూ ఉంటే మనం కొంత మార్జిన్ కడితే, బ్యాంకు కొంత లోను యిస్తే ఒక స్టేజి వరకు యిల్లు కడతాం. తర్వాతి స్టేజిలో మనం కొంత వేస్తాం, బ్యాంకు కొంత విడుదల చేస్తుంది. ఎవరూ పూర్తిగా తమ వాటా యిచ్చేసి కూర్చోరు. దీని విషయంలో ప్రభుత్వం యివ్వాల్సిన వాటా 371 కోట్లలో 270 కోట్లు మొదటి విడతగా యిచ్చారు. తక్కినది రిలీజు చేయడానికి మూడు, నాలుగు నెలలు పట్టి ఉంటుంది కదా! ‘గడువై పోతోంది, జర్మనీ నుంచి ఓడలో డబ్బు రావడం ఆలస్యమౌతుంది, మొదటి విడత యిచ్చేయండి’ అంటే సరే అని యిచ్చారనుకోండి. ఆ తర్వాత రెండో విడత యిచ్చేముందు ‘మీ 90% లో ఎంత యిస్తున్నారండీ?’ అని అడగాలిగా! అలా అడక్కుండా యిస్తూ పోవడమేమిటి? పోనీ 10% సాంతం యిచ్చేసేకైనా ‘మీది యింకా రాదేం? రూ. 3 వేల కోట్ల మీ వాటా వస్తే యింకా లక్షల కొద్దీ విద్యార్థులకు తర్ఫీదు యిద్దుం కదా’ అని పోట్లాడాలిగా! కార్పోరేషన్ కానీ, ప్రభుత్వం కానీ యీ దిశగా ఏమైనా కరస్పాండెన్స్ నడిపిందా? అదేమీ చూపటం లేదేం?
బాబు అవినీతికి పాల్పడలేదనే అందాం, అది రుజువు కాలేదు కనక! కానీ యిది అసమర్థత కాదా? భాగస్వామి మోసం చేస్తే కోర్టులో కేసు వేయవద్దా? వైయస్ లాగ సిబిఐకి కేసు అప్పగించవద్దా? ప్రజాధనాన్ని కాపాడవలసిన ముఖ్యమంత్రి యిలా ప్రవర్తించవచ్చా? గుజరాత్, కర్ణాటకలలో ఏ విధమైన ఒప్పందాలు జరిగాయో పూర్తిగా తెలిస్తే యిక్కడ తేడాగా జరిగిందని ఖరారుగా తెలుస్తుంది మనకు. సంఘటనలను ఒక క్రమంలో పెట్టి చూస్తే ఈ వ్యవహారం అనుమానాస్పదంగా ఉందని తోస్తుంది.
*2014 ఆగస్టులో ఇల్లెందు రమేశ్ అనే టిడిపి నాయకుడి ద్వారా డిజైన్‌టెక్‌కు సంబంధించిన సంజయ్ దాగా అనే అతను బాబును కలిశాడు. * కాబినెట్ ఆమోదం లేకుండానే బాబు 2014 సెప్టెంబరులో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేశారు. * దీనికి డైరక్టర్‌గా వేసినది కె. లక్ష్మీనారాయణను. ఆయన బాబు క్లాస్‌మేట్, నువ్వు-నువ్వు అనుకునే స్నేహితుడు, బాబు హయాంలోనే ఆయనకు ఐఏఎస్ కన్‌ఫర్ అయింది. *ఎండీ-సిఇఓగా వేసినది గంటా సుబ్బారావుని. లక్ష్మీనారాయణతో పాటు ఈయనకూ ఉన్నత విద్యాశాఖలో ఎక్స్అఫీషియో సెక్రటరీ పదవి యిచ్చారు. అదనంగా ముఖ్యమంత్రికి ఎక్స్-అఫీషియో కార్యదర్శి పదవీ, మరో పదవీ యిచ్చారు. * ఎస్ఎస్ఐడబ్ల్యులో సుమన్ బోస్ సహచరుడు, ప్రాజెక్టు అంచనాలు పెంచేసిన డిప్యూటీ డైరక్టరు జివిఎస్ భాస్కర్ అనే ఆయన భార్య అపర్ణ 2001 బ్యాచ్ యుపి క్యాడర్‌లో ఐఏఎస్ అధికారిణిగా ఉంటే ఆమెను ఆంధ్రప్రదేశ్‌కు తెచ్చి, కార్పోరేషన్‌కు డిప్యూటీ సిఈఓగా వేశారు. (ఇటువంటి పోస్టింగ్‌ను కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ అంటారు. అది ఆవిడ ప్రభుత్వానికి రిపోర్టు చేయలేదు. ఈ 371 కోట్ల చెల్లింపు జరిగిన తర్వాత హెడాఫీసు కనిపెట్టే లోపునే భాస్కర్ సీమన్స్‌కు రిజైన్ చేసి, ఏప్టస్ హెల్త్‌కేర్ అనే కంపెనీలో చేరాడు. డిజైన్‌టెక్ ద్వారా నిధులు అందుకున్న షెల్ కంపెనీల్లో అది ఒకటిట)
* 2014 నవంబరులో ఎస్ఎస్ఐడబ్ల్యు చేత ప్రతిపాదన యిప్పించారు.* 2015 ఫిబ్రవరిలో కాబినెట్‌లో యీ ప్రాజెక్టును చేపట్టాలని తీర్మానించారు. విద్యాశాఖతో ఎస్ఎస్ఐడబ్ల్యు ఒప్పందం, అని 2015 జూన్‌లో జీవో 4 విడుదల చేశారు. * కానీ తర్వాత విద్యాశాఖను తప్పించి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌ని తీసుకుని వచ్చి, దాని ద్వారా ఒప్పందం చేసుకున్నారు. * డిజైన్‌టెక్ అనే సంస్థను కలిపి త్రైపాక్షిక ఒప్పందం చేశారు. * మొత్తం ఆరు క్లస్టర్లకు రూ.3300 కోట్లు. కార్పోరేషన్ వాటా రూ.330 కోట్లు, పన్నులతో కలిపి రూ.371 కోట్లు. (డబ్బు చెల్లించేటప్పుడు వాటా అనకుండా వర్క్ ఆర్డర్‌గా మార్చారనే అభియోగం కూడా ఉంది) ఎస్ఎస్ఐడబ్ల్యు గ్రాంట్-ఇన్-ఎయిడ్ 90% అని ఒప్పందంలో ఉన్నా 5 10 2015 నాటి జీవో 8 లో కార్పోరేషన్ గ్రాంటు 370.78 కోట్లు అని ఉంది తప్ప సీమెన్స్ 90% వాటా ప్రస్తావన లేదు.
* మన వాటా 10% మనం అలాగే యిచ్చేయకూడదని, మన వాటా, ఎస్ఎస్ఐడబ్ల్యు గ్రాంట్ ఒక ఎస్క్రో అకౌంట్‌లో ఉంచి ఖర్చు చేయాలని, ప్రాజెక్టు పురోగతి గమనిస్తూ దశలవారిగా నిధులు విడుదల చేయాలని తను చెప్పానని అప్పటి ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పివి రమేశ్ సిఐడికి వాంగ్మూలం యిచ్చారు.* ఫైనాన్స్ శాఖలో స్పెషల్ సెక్రటరీగా ఉన్న సునీత గారు కూడా లిఖితపూర్వకంగా అభ్యంతరం తెలిపారు. * మొదటి విడతగా రూ. 270 కోట్లు విడుదల చేసేటప్పుడు చీఫ్ సెక్రటరీ ఐవైయార్ కృష్ణారావు గారు కూడా యిలాటి అభ్యంతరమే తెలిపితే, చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి విడుదల చేయండి అని చెప్పారు. ఆ విషయాన్ని ఐవైయార్ ఫైల్లో రికార్డు చేశారు. * తర్వాత దఫదఫాలుగా తక్కిన సొమ్మును విడుదల చేశారు.
* ఈ 371 కోట్లను డిజైన్‌టెక్‌కు విడుదల చేశారు. * దానిలో నుంచి అది ఎస్ఎస్ఐడబ్ల్యు కు సాఫ్ట్‌వేర్ నిమిత్తం 58.8 కోట్లు యిచ్చింది. * ఇతరత్రా ఎవరికి, ఎందుకు యిచ్చిందో (మౌలిక సదుపాయాలకై ఏమైనా ఖర్చు పెట్టిందా?) తెలియలేదు కానీ ప్రస్తుత వివాదం నడుస్తున్న స్కీలర్ ఎంటర్‌ప్రైజెస్ (పాత పేరు పివిఎస్‌పి ఐటి స్కిల్స్)కు 238.29 కోట్లు, ఎపిఐ అనే కంపెనీకి 2.71 కోట్లు, మొత్తం 241 కోట్లను యిచ్చేసింది.* అవి యీ డబ్బును యీ ప్రాజెక్టుకై ఎలా వినియోగించాయో ఆంధ్రజ్యోతి కూడా చెప్పటం లేదు. ఆ కంపెనీలు కూడా ఏ స్టేటుమెంటూ యిచ్చినట్లు కనబడటం లేదు. * ఈ డబ్బే దొంగ ఇన్‌వాయిస్‌లు (పని జరగకుండా జరిగిందని పుట్టించే బోగస్ బిల్లులు) ద్వారా షెల్ కంపెనీల్లోకి వెళ్లిందని 2017-18లో జిఎస్‌టి ఇంటెలిజెన్స్ శాఖ తెల్పింది. * అయినా బాబు ఏ చర్యా తీసుకోలేదు.
2016లో పుణెలోని ఒక విజిల్ బ్లోయర్ (పారాహుషారీ అందాం) ద్వారా ఎసిబి (యాంటీ కరప్షన్ బ్యూరో)కు యీ సమాచారం చేరింది. అప్పుడు బాబు ప్రభుత్వమే అధికారంలో ఉంది. పుణెలోని జిఎస్టీ యింటెలిజెన్స్ విభాగం డిజైన్‌టెక్ వ్యవహారాలను కనిపెట్టింది కూడా 2017-18లో, అంటే ఆయన హయాంలోనే! ఆయినా బాబు చలించలేదు. 2018లో ఇడి, జిఎస్‌టి ఇంటెలిజెన్స్ విభాగం, ఐటీ వంటి కేంద్ర సంస్థలు వీటిపై విచారణ చేస్తున్నాయని తెలిసిందో, తనకు చుట్టుకుంటుందని అనుకున్నారు కాబోలు, ‘నేను ప్రత్యేక హోదా గురించి బిజెపితో పోరాడుతున్నాను కాబట్టి ఏ క్షణాన్నయినా నన్ను అరెస్టు చేయవచ్చు’ అనసాగారు. కానీ ఆ దర్యాప్తు సంస్థలు, వాటిని నడిపించే కేంద్రం 2019 ఎన్నికల టైముకి యీ అస్త్రాన్ని వాడదలచుకోలేదేమో! అప్పుడేమీ జరగలేదు. 2024కి దీన్ని బయటకు తీసి ఉంటారు. 2019 ఎన్నికలకు ముందే బాబు తనంతట తనే సిబిఐ విచారణ కోరి ఉంటే, యీ స్కాములో ఆయన పాత్ర లేదని ప్రజలకు నమ్మకం చిక్కేది. పాపం అధికారుల మీదకు తోసుకుపోయేది.
2021 డిసెంబరులో విచారణ చేపట్టిన సిబిసిఐడి పైన చెప్పిన 241 కోట్లకు మరి కొంత కలిపి 279 కోట్ల గోల్‌మాల్ జరిగిందని అంటోంది. 2021 డిసెంబరులో స్కిల్లార్ ఫైనాన్షియల్ ఎడ్వయిజర్ ముకుల్ చంద్ర అగర్వాల్‌ను, సురేశ్ గోయల్ అనే చార్టెర్డ్ ఎకౌంటెంట్ కూడా సుమన్ బోస్, వికాస్ ఖాన్వేల్కర్‌లతో పాటు పిఎంఎల్ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) చట్టం కింద ఇడి తన కస్టడీలోకి తీసుకుంది. 2023 మార్చి నాటికి రూ. 70 కోట్ల డైవర్షన్‌ను కనిపెట్టింది. స్కిల్ డెవలప్‌మెంట్ తరఫున ఆ శాఖకు కార్యదర్శిగా ఉన్న ప్రేమచంద్రా రెడ్డి ఎంఓయుపై సంతకం పెట్టినా అతని పేరు ఎఫ్ఐఆర్‌లో ఎందుకు పెట్టలేదని ఆంధ్రజ్యోతి అడుగుతోంది. ప్రేమచంద్రా రెడ్డిని ఎందుకు వదిలేశారో సిఐడి జవాబు చెప్పాలి కదా!
రాష్ట్ర సిఐడి రెండేళ్లగా విచారణ జరుపుతూ వచ్చింది. ఈ ఏడాది మార్చి నెలలో కొన్ని అరెస్టులు చేసింది. ఇప్పుడు సెప్టెంబరు 9న బాబునే అరెస్టు చేసింది. దీన్ని బాబు బొత్తిగా ఊహించకుండా లేరు. ఆ డబ్బు తనకు తిరిగి వచ్చిందని (వచ్చి ఉంటే సుమా) నిరూపించడం కష్టమనే ధీమా ఉన్నా, మధ్యలో ఎంతో కొంత యిబ్బంది తప్పదని అనుకుని ఉంటారు. రాజకీయ కక్ష అని టిడిపి ఎంత యాగీ చేసినా, సామాన్యులతో పాటు టిడిపి శ్రేణుల మెదళ్లలో పైన చెప్పిన సందేహాలు (సీమన్స్ వాటా గురించి ఎందుకు పట్టబట్టలేదు, నిధులు డిజైన్‌టెక్‌కు ఎందుకిచ్చారు, స్కాము బయటకు వచ్చినా ఎందుకు విచారణకు ఆదేశించలేదు వగైరాలు) మెదలుతున్నాయి కాబోలు. అందుకే బాబు అరెస్టుపై రావలసినంత ప్రతిఘటన కనబడటం లేదు. ఇప్పటికైనా టిడిపి ఒక శ్వేతపత్రం విడుదల చేసి తామెందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరిస్తే బాగుంటుంది. లేకపోతే తటస్థ ఓటర్లలో కూడా టిడిపి అనుకూలత తగ్గే ప్రమాదం ఉంది. (ఫోటోలో ప్రశ్నలెదుర్కుంటున్న బాబు, ఇన్‌సెట్‌లో సీమన్స్ సుమన్, డిజైన్ టెక్ వికాస్) విచారణ
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2023)