ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల థరలపై మాటల యుద్ధం జరుగుతోంది. ఈ సమస్యను రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు ఎల్లో బ్యాచ్ తనదైన శైలిలో అగ్గికి ఆజ్యం పోస్తోంది. మరోవైపు సినిమా టికెట్ల ధరలను పెంచే ప్రశ్నే లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కావాలంటే నటీనటులు తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకోవాలని హితవు చెబుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పుడున్న రేట్ల ప్రకారం కనీసం కరెంట్ బిల్లుల ఖర్చు కూడా రాదని థియేటర్ల యజమానుల వాదన. ఈ క్రమంలో ఏపీలో కొన్ని సినిమా థియేటర్లను యాజమాన్యాలు స్వచ్ఛంగా మూసివేస్తున్నాయి.
ఏపీలో థియేటర్ల తాజా పరిణామాలపై హీరో నిఖిల్ ప్రభుత్వానికి వినయపూర్వక విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ…నిఖిల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.
“ప్రతి సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో 20 రూపాయల టిక్కెట్ సెక్షన్ కూడా ఉంది. ఇప్పుడున్న సినిమా థియేటర్లు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఫ్లెక్సిబుల్ టిక్కెట్ రేట్‌తో బాల్కనీ/ప్రీమియం విభాగాన్ని అనుమతించాలని అధికారులను కోరుతున్నా. థియేటర్లు నాకు దేవాలయం లాంటివి. ప్రజలకు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తాయి. థియేటర్లు మూతపడడం చాలా బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమను ఆదరిస్తున్నందుకు సంతోషం. అలాగే థియేటర్లు తిరిగి తమ వైభవాన్ని తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం సహాయపడుతుందని ఆశిస్తున్నా”..అని ట్వీట్‌లో పేర్కొన్నాడు.