అనుకూల తీర్పులు రాకుంటే జడ్జిలపై విమర్శలు చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ఆయనకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజానీకం కూడా ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన పలు ముఖ్య సభల్లో పాల్గొంటూ కీలక ఉపన్యాసాలు చేస్తున్నారు.
ఇవాళ సిద్ధార్థ బీటెక్ కాలేజీలో జస్టిస్ లావు వెంకటేశ్వరరావు స్మారకోపన్యాస సభలో మాట్లాడుతూ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఇబ్బందులను ఏకరువు పెట్టడం గమనార్హం. ఎగ్జిక్యూటివ్, శాసన వ్యవస్థల్లో ఉల్లంఘనలు జరిగితే దాన్ని సరిదిద్దే పాత్ర న్యాయవ్యవస్థదే అని స్పష్టం చేశారు. పరిపాలన వ్యవస్థ నుంచి సరైన సహకారం లేకపోవడం కూడా.. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రధానమైందని కీలక వ్యాఖ్య చేశారు. పరువుకు భంగం కలిగించే కంటెంట్‌ను ఇంటర్నెట్లో ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటివన్నీ న్యాయవ్యవస్థకు సవాళ్లుగా మారాయన్నారు. న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలని ఆకాంక్షించారు. ఒక వ్యక్తిపై ఆరోపణలు అవాస్తమని తేలితే వారికి నష్టపరిహారం ఇచ్చే వ్యవస్థ లేదన్నారు. నిరాధారమైన ఆరోపణలతో సదరు వ్యక్తికి నష్టం కలుగుతుందన్నారు. దీనిపై తన తీర్పులో పలుసార్లు ప్రస్తావించానని సీజేఐ గుర్తు చేశారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక నిపుణులకు భాగస్వామ్యం ఉండాలని కోరారు. చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా.. లేదా? అనేది సమీక్షించుకోవాలని కోరారు. ఇటీవల జడ్జిలపై భౌతికదాడులు పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అనుకూల తీర్పులు రాకుంటే జడ్జిలపై విమర్శలు చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ తరహా ఘటనలపై విచారణ జరపాలని కోర్టులు ఆదేశిస్తేనే విచారణ ముందుకెళ్తోందని, ఇది దురదృష్టకర పరిణామన్నారు. జడ్జిలకు స్వేచ్చా వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని స్పష్టం చేశారు. జడ్జిల నియామకంలో అనేక వ్యవస్థల పాత్ర ఉంటుందన్నారు. రిటైర్మెంట్ తర్వాత జడ్జిలకు సరైన భద్రత ఉండడం లేదన్నారు. సరైన ఇంటి, వైద్య సదుపాయాలు కూడా ఉండడం లేదన్నారు.