సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు, అలాగే థియేటర్ల మూసివేతపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మొసలి కన్నీళ్లు కారుస్తోంది. చిత్ర పరిశ్రమపై ప్రేమ వాక్యాలు వల్లించడం ద్వారా టాలీవుడ్ ఆదరణ పొందొచ్చని టీడీపీ ప్లాన్. అయితే టీడీపీకి చిత్ర పరిశ్రమ మొదటి నుంచి మద్దతుగా నిలుస్తోందని, ఇప్పుడు కొత్తగా అండగా నిలబడడం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. సినిమా టికెట్ల రేట్లపై టీడీపీ ఓ పథకం ప్రకారం జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుతో పరిశ్రమ మూతపడే పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వం గమనించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఇద్దరు, ముగ్గురు హీరోలపై కక్షతో సినిమా పరిశ్రమను నాశనం చేసే హక్కు ఎవరిచ్చారని ఏపీ ప్రభుత్వాన్ని సోమిరెడ్డి ప్రశ్నించారు.
ఇప్పటికే రాష్ట్రంలో 125 థియేటర్లు మూతపడ్డాయన్నారు. కక్ష సాధింపులకూ ఒక అడ్డుఅదుపూ ఉంటుందని సోమిరెడ్డి చెప్పుకొచ్చారు. సూళ్లూరుపేటలో అతి పెద్ద థియేటర్‌ను మూసివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా థియేటర్లలో గంజాయి ఏమైనా ఉందా? అని సోమిరెడ్డి నిలదీశారు. రాత్రి వెళ్లి దాడులు చేసి మూసివేసే హక్కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వానికి చేతనైతే నిత్యావసర వస్తువులు, ఇసుక ధరలు తగ్గించాలని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్ చేయడం గమనార్హం.