రాజకీయ పార్టీల్లో ఉత్తరాది, దక్షిణాది పార్టీలు ఉంటాయా ? ఎస్ …తప్పనిసరిగా ఉంటాయి. మన దేశంలోని రాజకీయ పార్టీలను సాధారణంగా రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి …జాతీయ పార్టీలు. రెండు ….ప్రాంతీయ పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎంలను జాతీయ పార్టీలుగా పరిగణిస్తారు. ఇక ప్రాంతీయ పార్టీల్లో కొన్ని ఒక రాష్టానికే పరిమితమై ఉంటాయి. కొన్ని రెండు లేదా మూడు రాష్ట్రాల్లో కూడా ఉండొచ్చు.
సరే … ఇప్పుడు అసలు విషయమేమిటంటే వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని తెలంగాణలోకి ఉత్తరాది పార్టీలు చొరబడుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీ చురుగ్గా ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఇవే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. మిగతావి యేవో చిన్నా చితక పార్టీలు వాటిని పట్టించుకునే వారు లేరు.
మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఇది ఉత్తర ప్రదేశ్ కు చెందిన పార్టీ అని అందరికీ తెలిసిందే. యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఈ పార్టీ అధినేత్రి. ప్రవీణ్ కుమార్ చేరికతో బీఎస్పీ కచ్చితంగా బలోపేతమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీఎస్పీ తెలంగాణాకు కొత్త పార్టీ కాదు. ఆ పార్టీ గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి ఇద్దరు విజయం సాధించారు. ఒకరు ఇంద్రకరణ్ రెడ్డి, మరొకరు కోనేరు కోనప్ప. వీరు ఎమ్మెల్యేలుగా గెలిచాక టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో తెలంగాణలో బీఎస్పీ అంతరించింది. మళ్ళీ మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరి పార్టీని పటిష్టం చేస్తానని చెబుతున్నారు.
ఇక మరో పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తెలంగాణలో ప్రవేశించినట్లు కనబడుతోంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఈ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్నసంగతి తెలిసిందే. ఈ పార్టీ పలు రాష్ట్రాల్లో విస్తరించాలని ప్రయత్నిస్తోంది. దక్షిణాదిలో తెలంగాణలో అడుగుపెట్టింది. కాంగ్రెస్, షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ మాజీ నాయకురాలు ఇందిరా శోభన్ తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీలో చేరింది.
ఒకప్పుడు తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న ఇందిరా శోభన్ అప్పట్లో టీవీ చర్చల్లో యమ పాల్గొనేది. కారణాలు తెలియవుగానీ వైఎస్ షర్మిల పార్టీ పెట్టగానే అందులో చేరింది. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు కాగానే కాంగ్రెస్ లో చేరాలని షర్మిల పార్టీ నుంచి వచ్చేసింది. ఏమైందో గానీ కాంగ్రెస్ లో చేరలేదు. ఆమె చేరలేదో, రేవంత్ రెడ్డి చేర్చుకోలేదో తెలియదు. ఇప్పుడు ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరింది.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రాథమిక సభ్యత్వంతోపాటు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పేద ప్రజలకు విద్యా, వైద్యంతోపాటు అన్ని రంగాల్లో అండగా నిలిచిందని, అలాంటి పాలనే తెలంగాణలో తెచ్చేందుకు ఆప్’లో చేరానని చెప్పింది. తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఎంత వరకు నిలదొక్కుకుంటారు, అనేది చూడవలసి వుంది.
అయితే, అన్ని విషయాల్లో జాతీయ పార్టీ నేతలు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్టు ఆమె తెలిపింది. నిజంగా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కు పోటీగా విస్తరణ దిశగా గట్టిగానే అడుగులు వేస్తోంది. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరిగే పంజాబ్, గోవా పై ప్రత్యేక దృష్టి పెట్టింది.అలాగే, ఉత్తర ప్రదేశ్, ఉత్తారాఖండ్’లోనూ పోటీకి దిగుతోంది. పంజాబ్’లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆప్’ అవతరిస్తుందని సర్వేలు సూచిస్తున్నాయి. తెలంగాణలో ఎలా ఉన్నా, దేశంలో మాత్రం ఆప్’ రేపటి పార్టీగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో బీఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో చెప్పలేం.