అమరావతిలో మళ్లీ 3 పంటలు?

ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఏడాదికి 3 పంటలు పండేవి. అన్నీ వాణిజ్య పంటలే. రైతులంతా సంతోషంగా ఉండేవారు. అలాంటి ప్రాంతంపై చంద్రబాబు కన్నేశారు.రాజధాని ఆశలు కల్పించారు. కొందర్ని బుజ్జగించి, చాలామందిని భయపెట్టి, తిమ్మిని బమ్మిని…

ఒకప్పుడు ఆ ప్రాంతంలో ఏడాదికి 3 పంటలు పండేవి. అన్నీ వాణిజ్య పంటలే. రైతులంతా సంతోషంగా ఉండేవారు. అలాంటి ప్రాంతంపై చంద్రబాబు కన్నేశారు.రాజధాని ఆశలు కల్పించారు. కొందర్ని బుజ్జగించి, చాలామందిని భయపెట్టి, తిమ్మిని బమ్మిని చేసి, అరచేతిలో రాజధానిని చూపి భూములు లాక్కున్నారు.మొత్తం చదును చేసి పెట్టారు.

రాజధాని నిర్మాణం అంటూ తాత్కాలిక భవనాలు కట్టారు. కట్ చేస్తే, రైతుల జీవితాల్ని గాల్లో దీపాలుగా మార్చేశారు.తన వర్గీయులతో వందల ఎకరాలు కొనుగోలు చేయించిన చంద్రబాబు, రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ దందా చేశారు.

వాటి ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నారు. సరే.. చంద్రబాబు సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు రాజధాని రైతుల పరిస్థితేంటి? ఓవైపు ఎగ్జిక్యూటివ్ రాజధానిని వైజాగ్ లో పెట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించిన నేపథ్యంలో.. అమరావతి రైతుల భవిష్యత్ ఏంటి? దీనిపై జగన్ ఓ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ పేరిట సేకరించిన భూములన్నీ వ్యవసాయ క్షేత్రాలే. భూములు వదులుకున్న వాళ్లంతా వ్యాపారులు, ఉద్యోగులు కాదు.. అచ్చంగా రైతులు. సో.. అమరావతిని రాజధానిగా కొనసాగించడంతో పాటు.. ప్రత్యేక వ్యవసాయ జోన్ గా ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. ఇలా చేయడం ద్వారా రాజధాని కలలు నెరవేరడంతో పాటు.. తిరిగి రైతులు తమ పొలాల్లో పంటలు పండించుకోవచ్చు.

అంటే.. అమరావతిలోనే అసెంబ్లీ ఉంటుంది. హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటవుతుంది. ఇప్పుడున్న కట్టడాలు కూడా అలానే ఉంటాయి. రోడ్లు, భవనాలను యథాతథంగా ఉంచుతూనే రాజధాని ప్రాంతాన్ని వ్యవసాయ క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తారు.

లాభసాటి వాణిజ్య పంటలు వేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో రైతుల్ని భాగస్వాములుగా చేస్తారు. ఇలా చేయడం వల్ల రాజధాని ప్రాంతం వల్ల వచ్చే లబ్దితో పాటు.. వ్యవసాయ ఫలాల్ని కూడా రైతులు అందుకుంటారు.

ప్రస్తుతానికి ఇది ప్రభుత్వం వద్ద ప్రతిపాదన దశలోనే ఉంది. రాజధాని ప్రాంతంతో పాటు ప్రభుత్వ భూముల్ని కూడా ప్రత్యేక వ్యవసాయ జోన్ పరిథిలోకి తీసుకొస్తే మరింత ప్రయోజనం ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.