వంగ‌వీటితో వ‌ల్ల‌భ‌నేని చెట్ట‌ప‌ట్టాల్‌…దేనికి సంకేతం?

టీడీపీ నాయ‌కుడు, దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా కుమారుడు వంగ‌వీటి రాధాతో టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇవాళ చెట్ట‌ప‌ట్టాల్ అన్న‌ట్టు క‌లిసి తిరిగారు. వీళ్ల‌ద్ద‌రి భేటీ బెజ‌వాడ పాలిటిక్స్‌లో కీల‌క ప‌రిణామంగా రాజ‌కీయ…

టీడీపీ నాయ‌కుడు, దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా కుమారుడు వంగ‌వీటి రాధాతో టీడీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇవాళ చెట్ట‌ప‌ట్టాల్ అన్న‌ట్టు క‌లిసి తిరిగారు. వీళ్ల‌ద్ద‌రి భేటీ బెజ‌వాడ పాలిటిక్స్‌లో కీల‌క ప‌రిణామంగా రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ జ‌గ‌న్ ప్ర‌భుత్వంతో స‌న్నిహితంగా మెలుగుతున్న నేప‌థ్యంలో….వంగ‌వీటి రాధా వైసీపీలో చేరుతార‌నే ప్ర‌చారానికి తెర‌లేచింది.

గ‌తంలో వంగ‌వీటి రాధా వైసీపీ యువ‌జ‌న విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు ఎమ్మెల్యే సీటు విషయ‌మై జ‌గ‌న్‌తో విభేదించి ఆయ‌న పార్టీని వీడారు. అప్ప‌ట్లో జ‌గ‌న్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఆ త‌ర్వాత టీడీపీలో చేరిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న టీడీపీలో యాక్టీవ్‌గా లేరు. జ‌న‌సేన కార్య‌క్ర‌మాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు.

ప‌వ‌న్ నాయ‌క‌త్వాన్ని కాపాడుకోవాల‌ని ఆయ‌న పిలుపునివ్వ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో ఆయ‌న జ‌న‌సేన‌లో చేరుతార‌నే ప్ర‌చారం సాగింది. దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగాను కాపు సామాజిక వ‌ర్గం ఆరాధించే విష‌యం తెలిసిందే. ఆయ‌న కుమారుడిగా రాధాను కాపులు అభిమానిస్తారు. వంగ‌వీటి రాధాకు సరైన వేదిక జ‌న‌సేనే అని కాపుల అభిప్రాయం. కానీ ఆయ‌న జ‌న‌సేన‌లో చేరేందుకు ముందూవెనుకా ఆలోచిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో వంగ‌వీటి మోహ‌న్‌రంగా 33వ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని రాఘ‌వ‌య్య పార్క్ వ‌ద్ద రంగా విగ్ర‌హానికి రాధా, వంశీ క‌లిసి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అనంత‌రం ఇద్ద‌రూ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ స‌భ‌లో వంశీ మాట్లాడుతూ ప్ర‌పంచంలో చ‌నిపోయిన త‌ర్వాత కూడా ప్ర‌జ‌లు గుర్తించుకునే నాయ‌కులు ముగ్గురు ఉన్నార‌న్నారు. వారు ఎన్టీఆర్‌, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, వంగ‌వీటి మోహ‌న్‌రంగా అని వంశీ తెలిపారు.

ఇద్ద‌రు నాయ‌కులు రాధా కార్యాల‌యంలో కాసేపు భేటీ అయ్యారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. మంత్రి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీతో వంగ‌వీటి రాధాకు మంచి స్నేహం ఉంది. పైగా రాధా అంటే జ‌గ‌న్‌కు ఇప్ప‌టికీ అభిమాన‌మే అని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో వైసీపీలోకి రాధాను తీసుకొచ్చేందుకే వంశీ చ‌ర్చిస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. వంగ‌వీటి రాధా రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.