మ‌ళ్లీ సాగు చ‌ట్టాలు…సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

సాగు చ‌ట్టాల‌పై కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన సాగు చ‌ట్టాల‌పై దేశ వ్యాప్తంగా రైతాంగం తీవ్ర వ్య‌తిరేకించింది. సాగు చ‌ట్టాల బిల్లుల్ని వెన‌క్కి…

సాగు చ‌ట్టాల‌పై కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ చేసిన ప్ర‌క‌ట‌న సంచ‌ల‌నం సృష్టిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన సాగు చ‌ట్టాల‌పై దేశ వ్యాప్తంగా రైతాంగం తీవ్ర వ్య‌తిరేకించింది. సాగు చ‌ట్టాల బిల్లుల్ని వెన‌క్కి తీసుకోవాలనే డిమాండ్‌పై ఢిల్లీ కేంద్రంగా రైతులు చేప‌ట్టిన ఉద్య‌మానికి ఎట్ట‌కేల‌కు కేంద్ర ప్ర‌భుత్వం దిగి వ‌చ్చింది. 

సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించ‌డం, ఇచ్చిన మాట ప్ర‌కారం ఇటీవ‌ల చ‌ట్ట స‌భ‌ల్లో ర‌ద్దు బిల్లుల‌ను ఆమోదించ‌డం తెలిసిందే. అయితే సాగు చ‌ట్టాల‌ను మ‌ళ్లీ తీసుకొస్తామ‌ని కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ ప్ర‌క‌ట‌న‌తో దేశ వ్యాప్తంగా రైతాంగం ఆగ్ర‌హానికి గుర‌వుతోంది. 

కేంద్ర ప్ర‌భుత్వం రైతాంగాన్ని మోస‌గించింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలో  ఓ కార్యక్రమంలో తోమర్ మాట్లాడుతూ రైతుల మేలు కోసం ఒక్క అడుగు వెనక్కి వేశామన్నారు. భవిష్యత్‌లో మళ్లీ ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు.

స్వల్ప మార్పులతో వ్యవసాయ చట్టాలను మళ్లీ తెస్తామని స్వ‌యాన వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి ప్రకటించ‌డంతో మోడీ స‌ర్కార్‌పై రైతు సంఘాలు, విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. చ‌ట్ట‌స‌భ‌ల‌ను కూడా మోడీ స‌ర్కార్ అభాసుపాలు చేసేలా కేంద్ర మంత్రి వ్యాఖ్య‌లున్నాయ‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి.  

ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతు ఉద్య‌మ‌కారులు వెళ్లిపోవ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం త‌న మోస‌కారి త‌నాన్ని బ‌య‌ట పెట్టుకుంద‌నే అభిప్రాయాలు విప‌క్షాల నుంచి వ‌స్తున్నాయి. కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి ప్ర‌క‌ట‌న‌పై మోడీ స‌ర్కార్ ఎలా స్పందిస్తుందో చూడాలి!