జనసేనాని పవన్‌కల్యాణ్‌పై బీజేపీ నేత, సినీ నటి మాధవీలత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్‌కల్యాణ్ సోషల్ మీడియా పేజీని చూసే వాళ్లు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకుంటే మంచిదని మాధవీలత గట్టి వార్నింగ్ ఇచ్చారు. తీవ్రస్థాయిలో మాధవీలత హెచ్చరించడానికి దారి తీసిన పరిస్థితులేంటి? అనే చర్చ జరుగుతోంది.
ఇంతకూ పవన్ చేసిన అపరాధం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. పైగా జనసేన మిత్రపక్షమైన బీజేపీ మహిళా నాయకురాలు, అందులోనూ చిత్ర పరిశ్రమకు చెందిన నటి నుంచి ఈ విధమైన హెచ్చరికలు రావడం సహజంగానే సంచలనం రేకెత్తిస్తోంది.
ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే సినీ నటి మాధవీలత సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు గురించి తెలుసుకోవాలి. మాధవీ లతది పవన్ పోస్టుపై రియాక్షన్. అందువల్ల ముందుగా యాక్షన్ గురించి తెలుసుకోవాలి. అంటే పవన్ పెట్టిన పోస్టు ఏంటో చూద్దాం.
‘దైవం మానుష రూపేణా'… మానవునిగా జన్మించి.. మానవులను ప్రేమించి.. మానవులను జాగృతపరచడానికి దివికి ఏతెంచిన దైవపుత్రుడు ఏసుక్రీస్తు. ఆ అవతార పురుషుని జన్మదినం మానవాళికి గొప్ప పర్వదినం. ఏసు నామమును స్మరిస్తూ, ఏసు ప్రభువు పట్ల అచంచల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. సర్వ ప్రాణుల పట్ల కరుణ, ప్రేమ, సేవాభావం చూపాలని క్రీస్తు చేసిన బోధనలు ఎల్లవేళలా ఆచరణీయం. క్షమ, దయ కలిగి ఉండడమే క్రీస్తుపై భక్తికి తార్కాణం. దుర్బుద్ధితో ఉన్నవారికి సద్బుద్ధిని, ఆశ్రిత జనులకు సుఖసంతోషాలను ప్రసాదించమని ఆ కరుణామయుణ్ణి ప్రార్ధిస్తున్నాను’ అంటూ పవన్‌కల్యాణ్ పోస్టు పెట్టారు.
ఇది తెలుగుతోపాటు ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఉంది. క్రీస్తును అవతార పురుషుడిగా సంబోధించడం మాధవీలతకు గిట్టలేదు. దీంతో ఆమె పవన్‌పై ఫైర్ అయ్యారు. ఏకంగా పవన్ మత మార్పిళ్లు చేయిస్తున్నారనే తీవ్రస్థాయిలో ఆమె విమర్శలు చేయడం సంచలనం కలిగిస్తోంది.
‘పవన్ కల్యాణ్ గారు..క్రిస్మస్ విషెస్ చెప్పండి. నమ్మినవారికి విషెస్ అని చెప్పండి ఇంకా సంతోషం. మానవాళికి లాంటి పెద్దమాటలు ఎందుకండి..? మీరే మతమార్పిళ్లను ప్రోత్సహించేలా వుంది మీ పోస్ట్. బైబిల్ని మనమే బోధించనక్కర్లేదు. అక్కడ ఎవరూ దేవుడు లేరు. గౌరవిద్దాం అంతవరకే. మీరు చెప్పిన విషెస్ తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు. యూదుల వరకే ఆయన ప్రేమ. మనం యూదులం కాదు. మీ పేజి మెయిన్టేన్ చేస్తున్నవాళ్లు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచిది. ఒక హిందువుగా మీ పోస్టు పట్ల విచారం వ్యక్తంచేస్తున్నాను’ అని మాధవీలత తన ఆగ్రహాన్ని, అసహనాన్ని సోషల్ మీడియాలో పోస్టు రూపంలో ప్రదర్శించారు. మాధవీలత ఆగ్రహంపై జనసేన, బీజేపీ స్పందన ఏంటో అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.