ఆర్ఆర్ఆర్ లో గాయాలు.. ఎన్టీఆర్-చరణ్ అనుభవాలు

ఓ పెద్ద సినిమా తీసినప్పుడు, మరీ ముఖ్యంగా యాక్షన్ మూవీ తీసినప్పుడు నటీనటులు తరచుగా గాయాల బారిన పడుతుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ టైమ్ లో కూడా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాల…

ఓ పెద్ద సినిమా తీసినప్పుడు, మరీ ముఖ్యంగా యాక్షన్ మూవీ తీసినప్పుడు నటీనటులు తరచుగా గాయాల బారిన పడుతుంటారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ టైమ్ లో కూడా హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ గాయాల పాలయ్యారు. ఈ గాయాలపై హీరోలిద్దరూ స్పందించారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే.. భారీ యాక్షన్ సీన్లు తీస్తున్నప్పుడు హీరోలిద్దరూ గాయపడలేదు. ప్రమాదవశాత్తూ ఒకరు, చిన్న షాట్ లో మరొకరు గాయాల బారిన పడడం బాధాకరం.

ముందుగా రామ్ చరణ్ విషయానికొద్దాం. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ షెడ్యూల్ ఇలా స్టార్ట్ అయిందో లేదో అలా గాయపడ్డాడు రామ్ చరణ్. అదేదో పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అనుకుంటే పొరపడినట్టే. ఓ సీన్ కోసం చరణ్-తారక్-రాజమౌళి చర్చించుకుంటున్నారట. డిస్కషన్ పూర్తయిన వెంటనే అలా కారవాన్ వైపు నడుచుకుంటూ వెళ్లి, ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు చరణ్. మోకాలి చిప్పకు దెబ్బ తగిలింది. ఏకంగా 3 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.

ఎన్టీఆర్ ది కూడా దాదాపు ఇలాంటి అనుభవమే. ఓ యాక్షన్ సన్నివేశంలో అత్యంత సులువైన మూమెంట్ ఒకటి ఉంది. రోప్ పై నుంచి ఫైటర్ ను కిందకు నెట్టే షాట్ అది. కనురెప్ప వేసినంత ఈజీగా తారక్ ఆ షాట్ కంప్లీట్ చేయగలడు. కానీ దురదృష్టం వెంటాడింది. నేలపై పడ్డమే మణికట్టుకు బలంగా దెబ్బ తాకింది. నెల రోజులు విశ్రాంతి తప్పలేదు.

2 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లతో చరణ్ ఫైట్ చేసే సీన్ ఒకటి ఉంది. ఆ షాట్ ను ట్రయిలర్ లో కూడా చూపించారు. మండే ఎండలో దాదాపు 16 రోజులు ఆ సీన్ షూట్ చేశారు. పైనుంచి నిప్పులు కూడా పడే సన్నివేశం అది. అంతటి రిస్కీ యాక్షన్ సీన్ లో కూడా చరణ్ తో పాటు ఏ ఒక్కరికీ గాయం అవ్వలేదట. కానీ అనుకోకుండా కాలుజారి గాయపడ్డాడు.

ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. బల్గేరియాలోని దట్టమైన అడవుల్లో తారక్ పై పరుగెత్తే సీన్ ఒకటి తీశారు. అడవిలో మట్టి, రాళ్లపై చెప్పుల్లేకుండా పరుగెత్తే సీన్ అది. 3 రోజులు షూట్ చేస్తే ఒక్క గాయం కూడా కాలేదంట. చిన్న యాక్షన్ మూమెంట్ లో కిందపడి మణికట్టుకు గాయం చేసుకున్నాడు తారక్.