తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. వాస్తవానికి సర్కారుకి ఈ ఆలోచన లేకపోయినా.. హైకోర్టు సూచనలతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై దాదాపుగా నిషేధం విధించినంత పని చేసింది. ఏకంగా జనవరి 2 వరకు ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్ సహా తెలంగాణలో చప్పగా సాగబోతున్నాయి.
విపత్తు నిర్వహణ చట్టం కింద జనవరి 2 వరకు కొత్త ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. జనవరి 2 వరకు తెలంగాణ వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించారు. జనసమూహాలు గుమికూడే కార్యక్రమాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
అప్పుడు కూడా సామాజిక దూరం, మాస్క్ లు తప్పనిసరి. సమూహాలుగా గుమికూడే చోట థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేయాలి. టెంపరేచర్ చెక్ చేయాలి. కొత్త సంవత్సర వేడుకలు అని ప్రత్యేకంగా చెప్పకపోయినా.. ఆంక్షల టార్గెట్ మాత్రం అదే. దీంతో తెలంగాణలో వ్యాపారులు ఒక్కసారిగా షాకయ్యారు. న్యూ ఇయర్ బిజినెస్ పై ఆశలు పెట్టుకున్నవారంతా తలలు పట్టుకున్నారు.
మాస్క్ లేకపోతే వెయ్యి కట్టాల్సిందే..
గతంలోనే తెలంగాణలో ఈ నిబంధన ఉన్నా కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. వెయ్యి రూపాయలనేది భారీ జరిమానా కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగానే ఉన్నారు. అధికారులు చూసీ చూడనట్టు వెళ్లిపోయేవారు. ఇప్పుడు కచ్చితంగా మాస్క్ నిబంధన అమలు చేయాలని ప్రభుత్వం కఠిన ఆదేశాలిచ్చింది. ముక్కుపిండి మరీ జరిమానా వసూలు చేయబోతున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, సహా ఇతర రాష్ట్రాలు కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాయి. తాజాగా తెలంగాణ కూడా ఆ జాబితాలో చేరింది. మరోవైపు కేంద్రం నైట్ కర్ఫ్యూకి సిఫార్సు చేస్తోంది. నైట్ కర్ఫ్యూ అమలు చేస్తే అసలు న్యూ ఇయర్ వేడుకలకు అర్థమే లేకుండా పోతుంది. అందుకే ఇప్పటికిలా సర్దుకుపొండి అంటూ ఆంక్షలు విధించింది తెలంగాణ సర్కారు. నిషేధం విధించకుండా ఆంక్షలతో సరిపెట్టింది.