బాబ్బాబు.. రూ.20 టికెట్లు ఎక్కడిస్తున్నారో చెప్పండి

బాల్కనీ – రూ.20, ఫస్ట్ క్లాస్ – రూ.15, సెకండ్ క్లాస్ – రూ.10. Advertisement వాట్సప్ స్టేటస్ లలో బాగా సర్కులేట్ అవుతున్న ఫొటో ఇది. చాలామంది ఈ రేట్లు చూపించి ఏందీ…

బాల్కనీ – రూ.20, ఫస్ట్ క్లాస్ – రూ.15, సెకండ్ క్లాస్ – రూ.10.

వాట్సప్ స్టేటస్ లలో బాగా సర్కులేట్ అవుతున్న ఫొటో ఇది. చాలామంది ఈ రేట్లు చూపించి ఏందీ ఘోరం టికెట్ రేట్లు ఇలా తగ్గిపోయాయేంటి అంటూ థియేటర్ల ఓనర్లపై జాలి చూపిస్తున్నారు. అసలు నిజంగా ఈ రేట్లు ఎక్కడున్నాయి, ఎవరిస్తున్నారు.

ఏపీలో సినిమా టికెట్ల రేట్లు భారీగా తగ్గిపోయాయి. కిరాణా కొట్టు కౌంటర్ కంటే బాక్సాఫీస్ కౌంటర్ తగ్గిపోయింది. ఇదంతా నిజమేనా..? అసలేంటీ గొడవ, థియేటర్ల ఓనర్లు ఎంత నష్టపోతున్నారు, 5, 10 రూపాయల టికెట్లు ఏంటి అని చర్చ జరుగుతోంది. ఆరా తీస్తే.. అసలు 10, 20 టికెట్లు ఎక్కడిస్తున్నారు, ఎన్ని ఇస్తున్నారు. ఏ హాల్ లో చూసినా పాత రేట్లే ఉన్నాయి, ఏ మల్టీప్లెక్స్ కి వెళ్లినా అంతకు ముందున్న రేట్లే కనిపిస్తున్నాయి. మరి బయట జరుగుతున్న చర్చ ఏంటి..? థియేటర్లలో ఉన్న రేట్లు ఏంటి.. సామాన్యుడికి పిచ్చెక్కిపోతోంది. బాబ్బాబు… ఆ 20 రూపాయల టికెట్లు ఎక్కడిస్తున్నారో చెప్పండి..?

పల్లెటూళ్లలో కూడా థియేటర్లో టికెట్ రేటు రూ.150గా ఉంది. మాల్స్ లో అయితే రూ.200, రూ.250 ఇలా నడుస్తోంది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు టికెట్ రేట్లు తగ్గాలి. కానీ థియేటర్ల ఓనర్లు తెలివిగా అన్నిటినీ బాల్కనీ రేట్లకే అమ్ముతున్నారు. సింగిల్ స్క్రీన్స్ లో నేల, బెంచి టికెట్లు.. మల్టీప్లెక్స్ లలో కిందిస్థాయి (సెకండ్ క్లాస్) టికెట్లను అమ్మడం మానేస్తున్నారు. అంటే, ఆ సీట్లు ఖాళీగానే పెట్టుకుంటారు కానీ తక్కువ రేటుకి అమ్మరన్నమాట.

ఒకవేళ ఎవరైనా అడిగితే వాటిని ముందుగానే ఎవరి పేరు మీదో బుక్ చేసి పెడతారు. మిగతావాటిని 200 రూపాయలకు అంటగడతారు. ఒకవేళ నేల టికెట్లు ఉన్నా కూడా.. ఓ థియేటర్లో బాల్కనీ టికెట్ దొరకని ప్రేక్షకుడు, మరో థియేటర్ ని ఎంచుకుంటాడు కానీ, అదే థియేటర్లో నేల టికెట్ కి వెళ్లాలనుకోడు. ఈ లాజిక్ తోనే ఇప్పుడు జనాన్ని మోసం చేస్తున్నారు థియేటర్ల ఓనర్లు.

ప్రభుత్వ మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో అమలైతే.. బాల్కనీ రేటెంత..? సీట్లెన్ని..? నేల టికెట్ రేటెంత..? సీట్లెన్ని..? సినిమా టికెట్ రేటు ప్రకారమే పార్కింగ్ ఫీజు వసూలు చేయాలి అనే నిబంధనలు వస్తే అప్పుడు ప్రేక్షకుడికి జేబు శాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా లేకుండా టికెట్ రేట్లు తగ్గించి, వాటిని పాప్ కార్న్ రేటులో కలిపి వసూలు చేస్తే అంతిమంగా థియేటర్ ఓనర్ కే లాభం.

సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు 5, 10 రూపాయల టికెట్లు అసలు ఏపీలో ఏ మారుమూల ప్రాంతంలోనూ కనిపించవు. పత్రికల్లో, టీవీల్లో కనిపిస్తున్న గొడవలేవీ క్షేత్రస్థాయిలో లేవు. బోర్డుపై 5 రూపాయల టికెట్అని రాసి ఉంటుంది. దందా మాత్రం పాత రేట్ల ప్రకారమే జరుగుతోంది.