రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి ఇద్దరు పెద్ద హీరోలతో మల్టీస్టారర్ సినిమా అనగానే.. అందరికీ మెదిలిన మొదటి ప్రశ్న ఒక్కటే. ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఉంటుందా ఉండదా? మరీ ముఖ్యంగా ఇద్దరు హీరోల అభిమానులు కోరుకున్న అంశం కూడా ఇదే. ఇద్దర్లో ఏ ఒక్కరికైనా కొద్దిగా ప్రాధాన్యం తగ్గినా ఫ్యాన్స్ హర్ట్ అవుతారు.
ఈ విషయంపై రాజమౌళి ఓపెన్ అయ్యాడు. ఇద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి తన సినిమాలోకి తీసుకున్నానని మొన్నటివరకు చెబుతూ వచ్చిన ఈ దర్శకుడు.. ఈ అంశంపై ఇద్దరు హీరోల అభిమానులతో కూడా చర్చించిన విషయాన్ని బయటపెట్టాడు. అభిమానుల సమ్మతం కూడా తీసుకున్న తర్వాతే ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేశామంటున్నాడు.
“నేను చరణ్ ఫ్యాన్స్ తో మాట్లాడాను. మా హీరోనే బెస్ట్ అన్నారు వాళ్లు. మరి ఎన్టీఆర్ సంగతేంటని అడిగాను. తారక్ కూడా మంచి నటుడే కానీ చరణే బెస్ట్ అన్నారు వాళ్లు. ఆ తర్వాత ఎన్టీఆర్ అభిమానులతో మాట్లాడాను. వాళ్లు రామ్ చరణ్ మంచి నటుడు అంటూనే, తారక్ బెస్ట్ అన్నారు. ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని తెలుసుకున్నాను. ఆ తర్వాతే సినిమా ఎనౌన్స్ చేశాం.”
తారక్, చరణ్ నిజజీవితంలో ఎలా ఉంటారో వాళ్లను, వాళ్ల అభిమానులు కూడా అలానే ఫాలో అవుతున్నారని.. ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య ఎలాంటి ఇబ్బందులు లేవనే విషయాన్ని తెలుసుకున్నానంటున్నాడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ కంటే ముందే తారక్-చరణ్ ఫ్రెండ్స్ అవ్వడం తనకు కలిసొచ్చిందని.. అదే ఫ్రెండ్ షిప్ ను వెండితెరపై కూడా చూపించానంటున్నాడు.
మొత్తమ్మీద అభిమానుల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకొని మరీ ఆర్ఆర్ఆర్ సినిమా స్టార్ట్ చేశాననే విషయాన్ని రాజమౌళి బయటపెట్టాడు. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో సినిమా వాయిదా పడుతుందనే ఊహాగానాలు ఓవైపు కొనసాగుతున్నప్పటికీ.. మరోవైపు ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం తమ ప్రచారాన్ని కొనసాగిస్తోంది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది ఆర్ఆర్ఆర్ మూవీ.