“ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గించి, థియేటర్ వ్యవస్థని నాశనం చేయడం కోసం ఓటీటీల నిర్వాహకులంతా కలసి జగన్ కు కోట్ల రూపాయల ముడుపులు చెల్లించారు. అందుకే వారి కోసం జగన్ థియేటర్లని తొక్కేస్తున్నారు.” ఇదీ టీడీపీ లేటెస్ట్ ప్రచారం. సినిమా టికెట్ రేట్ల తగ్గింపు, టికెట్ అమ్మకాలను ఆన్ లైన్ చేయడంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఇన్నాళ్లూ బెనిఫిట్ షోల పేరుతో ప్రజల డబ్బుల్ని దోచుకున్నారని, ఈ ప్రభుత్వం మంచి పని చేసిందని, కాస్త ఆలస్యమైనా సినిమా టికెట్ల విషయంలో వైసీపీ సరైన నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నారు. అందుకే ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. ఏకంగా సినిమా హీరోలు సైతం ప్రభుత్వ నిర్ణయంలో తలదూరుస్తున్నారు.
టికెట్ రేట్ల తగ్గింపుతో ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత పెరగడంతో ప్రతిపక్షానికి ఏంచేయాలో తోచలేదు. నిత్యావసరాల ధరలు ఎందుకు తగ్గించడం లేదనే చెత్త లాజిక్ ని తెరపైకి తెచ్చారు కొంతమంది. సాక్షి పేపర్ రేటు తగ్గించాలని, భారతి సిమెంట్ బస్తా రేటు కూడా తగ్గించాలంటూ అర్థంపర్థంలేని డిమాండ్లు చేస్తున్నారు. అంటే టికెట్ రేట్లు తగ్గించడం, ప్రజలపై ఆ మేరకు భారాన్ని దించడం వైసీపీ చేసిన తప్పు అంటూ ప్రచారం చేస్తోంది టీడీపీ.
కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడేలా టికెట్ రేట్లు తగ్గిస్తే టీడీపీకి గిట్టడం లేదు. కొద్దిమంది హీరోల కోట్ల రూపాయల రెమ్యునరేషన్లకి అనుకూలంగా టికెట్ రేట్లు పెంచడమే వారికి కావాల్సి ఉంది. అది జరగలేదు కాబట్టి ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం ప్రచారం మొదలు పెట్టింది. ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే.. ఏకంగా ఓటీటీ నిర్వాహకులు జగన్ తో మిలాఖత్ అయ్యారని, వారి కోరిక మేరకే థియేటర్లను తొక్కేస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.
సినిమాలు థియేటర్లకి ఇవ్వాలా, ఓటీటీలకు ఇవ్వాలా అనేది హీరోలు, నిర్మాతల ఇష్టం. హీరో నాని ఓటీటీలకు ఇవ్వడం ఇష్టం లేదంటూనే రెండు సినిమాలని ఆన్ లైన్ లో విడుదల చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు కొత్త సినిమాని థియేటర్లలోకి తెచ్చాడు. నిజంగానే ఓటీటీలు థియేటర్స్ ని తొక్కేయాలంటే.. ఏపీ సీఎం జగన్ ఒక్కర్ని మేనేజ్ చేస్తే సరిపోదు. తెలుగు సినిమాలకైతే తెలంగాణ సీఎంతో కూడా బేరం కుదుర్చుకోవాలి. పాన్ ఇండియా సినిమాలకు థియేటర్లు దొరక్కుండా చేయాలంటే ప్రధానితో మాట్లాడి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లలో టికెట్ రేట్లను తగ్గించేలా చూడాలి.
ఇదంతా జరిగే పని కాదు. కానీ పచ్చ కార్యకర్తలకి మాత్రం ఈ ఐడియా దొరికింది. అంతే.. జగన్ ఓటీటీల కోసమే థియేటర్లలో టికెట్ రేట్లు తగ్గిస్తున్నారనే ప్రచారం చేస్తున్నారు. పక్కవారిపై బురదజల్లాలనే పాడుబుద్ధితో.. తమ చేతినిండా, ఒంటినిండా బురదపూసుకుంటున్నారు టీడీపీ నేతలు. ఇప్పుడు థియేటర్ల వ్యవహారంలో కూడా జగన్ వైపు తప్పు నెట్టేయాలని చూస్తున్నారు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం పలుచన అయిపోతున్నారు.