కండువా పడదు.. ‘వంశీ-గిరి’ దారిలో ఇంకెందరు?

వల్లభనేని వంశీ చూపించిన బాట రాజమార్గంగా మారనుందా? ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం మనకు అవుననే అనిపిస్తుంది.  ఇవాళ మద్దాలి గిరి సంగతి తేలింది. ఇంకా ఎందరున్నారు? అనేది ప్రశ్నార్థకం. వైఎస్సార్…

వల్లభనేని వంశీ చూపించిన బాట రాజమార్గంగా మారనుందా? ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మాత్రం మనకు అవుననే అనిపిస్తుంది.  ఇవాళ మద్దాలి గిరి సంగతి తేలింది. ఇంకా ఎందరున్నారు? అనేది ప్రశ్నార్థకం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కొనసాగించడానికి ముచ్చటపడుతున్న వారు మాత్రము ప్రస్తుతం బయటకు వస్తున్నారు. ఈ కేటగిరీలోకి రానివారు కూడా ఇదే బాట ఎంచుకుంటే.. తెదేపా దాదాపు ఖాళీ కావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు.

ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున గెలిచిన తర్వాత.. మరో పార్టీలోకి మారిపోయే ఫిరాయింపు సంస్కృతిపట్ల జగన్మోహన రెడ్డి ప్రభుత్వం చాలా స్పష్టమైన అభిప్రాయాన్నే కలిగి ఉంది. తొలినుంచి వారు స్పష్టంగానే చెబుతున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎవ్వరు వచ్చినా తమ పార్టీలో చేర్చుకునేది లేదని జగన్ పలుమార్లు చెప్పారు. అలాగే.. రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే.. ఎవరిమీదనైనా అనర్హత వేటు పడుతుందని తమ్మినేని సీతారాం కూడా పలుమార్లు చెప్పారు.

టెక్నికల్‌గా ఉన్న అవకాశాన్ని వాడుకుంటూ.. తెలుగుదేశం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేసేశారు. ఆయనను పార్టీ కూడా సస్పెండ్ చేసింది. ఆయనను స్వతంత్ర సభ్యుడిగా స్పీకరు సభలో గుర్తించారు. ఎమ్మెల్యే పదవి పోకుండా, ఉప ఎన్నిక రాకుండా ఇదొక అడ్డదారిగా మారింది. ఆ బాటలో మరింతమంది తెలుగుదేశాన్ని వీడిపోవచ్చునని ముందునుంచి విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పుడు అదే వంశీ బాటలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి అడుగులు వేశారు.

ఆయన సీఎం జగన్‌ను కలిశారు. నియోజకవర్గం కోసమే అన్నారు. కానీ.. అంతరార్థం.. అప్రకటితంగా పార్టీలో చేరినట్లే. వంశీ, గిరి ఇద్దరూ స్వతంత్ర సభ్యులుగానే ఉండబోతున్నారు. పదవి పోకుండా పార్టీ మారే అవకాశం సులువుగా కనిపిస్తుండడంతో.. ఇంకా వీరి బాటలో మరింత మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేసి.. స్వతంత్ర సభ్యలుగా మారే అవకాశం కనిపిస్తోంది. చంద్రబాబు తమ బలగాన్ని కాపాడుకోడానికి ఏం ఎత్తులు వేస్తారో చూడాలి.