ఏపీ బీజేపీకి దేవుడే దిక్కు!

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీది విచిత్ర ప‌రిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటోంది. టీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని రుజువు చేసుకుంటోంది. ఉప ఎన్నిక‌ల్లో విజ‌యాలు సాధిస్తూ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భ‌విష్య‌త్‌పై భ‌రోసా క‌ల్పిస్తోంది. కానీ…

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీది విచిత్ర ప‌రిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకూ పుంజుకుంటోంది. టీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయ‌మ‌ని రుజువు చేసుకుంటోంది. ఉప ఎన్నిక‌ల్లో విజ‌యాలు సాధిస్తూ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు భ‌విష్య‌త్‌పై భ‌రోసా క‌ల్పిస్తోంది. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీకి అందుకు పూర్తి భిన్న‌మైన ప‌రిస్థితి నెల‌కుంది. రోజురోజుకూ పార్టీ బ‌ల‌హీన ప‌డుతోంది. దీనికి కార‌ణం టీడీపీ నుంచి వ‌ల‌స వెళ్లిన నేత‌ల వైఖ‌రే అని ఆ పార్టీ శ్రేణులు ఆవేద‌న చెందుతున్నాయి.

గ‌తంలో ఏపీలో బీజేపీ ఎదుగుద‌ల‌కు అడ్డంకిగా నిలిచిన అగ్ర‌నాయ‌కుడిని వ్యూహాత్మ‌కంగా మ‌రో ప‌ద‌విలో నియ‌మించారు. ఇక‌పైనా పార్టీ ఎదుగుతుంద‌ని భావించిన బీజేపీ అధిష్టానం ఆశ‌లు ఆవిర‌వుతున్నాయి. అప్పుడే ఒక‌రే అడ్డంకైతే, ఇప్పుడు అంత‌కు ఐదారు రెట్టింపు సంఖ్య‌లో నాయ‌కులు త‌యార‌య్యార‌నే ఆవేద‌న నిజ‌మైన బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల్లో క‌నిపిస్తోంది.

కొంత కాలం క్రితం వ‌ర‌కూ చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేసే నాయ‌కులు బీజేపీలో ఒక‌రిద్ద‌రే ఉండేవాళ్ల‌ని, ఇప్పుడు సీఎం ర‌మేశ్‌, సుజ‌నాచౌద‌రి, నాగ‌భూష‌ణం చౌద‌రి, లంకా దిన‌క‌ర్ చౌద‌రి, నాగోతు ర‌మేశ్‌నాయుడు, స‌త్య‌కుమార్ ఇలా అనేక మంది పేర్లను చెప్పొచ్చ‌ని సొంత పార్టీ నేత‌లు అంటున్నారు. ఎంత‌సేపూ చంద్ర‌బాబు స్క్రిప్ట్‌ను చ‌ద‌వ‌డ‌మే త‌ప్ప బీజేపీ బ‌లోపేతం చేసేందుకు ఏ ఒక్క నాయ‌కుడు ప్ర‌య‌త్నించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. చంద్ర‌బాబు కోసం సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డానికి, బెదిరించ‌డానికి టీడీపీ అనుకూల బీజేపీ నేత‌లు మీడియా ముందుకొస్తున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి.

ఏపీ పోలీస్ వ్య‌వ‌స్థ‌ను కేంద్ర ప్ర‌క్షాళ‌న చేస్తుంద‌ని బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్‌నాయుడు అన‌డాన్ని ఆ పార్టీ నేత‌లే త‌ప్పు ప‌డుతున్నారు. సీఎం ర‌మేశ్ ఎవ‌రి కోసం ఇలాంటి మాట‌లు మాట్లాడుతున్నారో అంద‌రికీ తెలుసు అని అంటున్నారు. ఐపీఎస్ అధికారులు నిబంధ‌న‌ల‌ను అతిక్ర‌మించి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, అవ‌స‌ర‌మైతే అలాంటి వారిని కేంద్రం రీకాల్ చేస్తుంద‌ని పరిధి మించి ర‌మేశ్ వ్యాఖ్యానిస్తున్నార‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. 

ఏపీలోని పోలీస్ వ్య‌వ‌స్థ‌పై హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర‌హోం శాఖ కార్య‌ద‌ర్శికి వివ‌రించామ‌ని, ఏపీ పోలీస్‌ వ్య‌వ‌స్థ‌ను కేంద్రం టెలిస్కోప్‌లో చూస్తోంద‌ని ర‌మేశ్ అంటున్నార‌ని…ఏపీలో బీజేపీ ప‌రిస్థితి గురించి ఎప్పుడైనా కేంద్రం పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లారా? అని సొంత పార్టీ నేత‌లు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం. పార్టీని టెలిస్కోప్‌లో చూస్తే వాస్త‌వాలు ఏంటో కేంద్రం పెద్ద‌ల‌కు తెలుస్తాయ‌ని అంటున్నారు. పార్టీపై దృష్టి పెట్ట‌కుండా, కేంద్రం పెద్ద‌ల్ని కూడా త‌ప్పుదోవ ప‌ట్టించేలా టీడీపీ అనుకూల బీజేపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లున్నాయి.

పార్టీని ప్ర‌క్షాళ‌న చేస్తే త‌ప్ప ఏపీలో బీజేపీ బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌ద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఇలాంటి నేత‌లను పెట్టుకుని బీజేపీ ఏ విధంగా రానున్న రోజుల్లో అధికారంలోకి వ‌స్తుంద‌ని సొంత పార్టీ నేత‌లు నిల‌దీస్తున్న వైనం బీజేపీలో క‌నిపిస్తోంది. జ‌న‌సేన‌తో పొత్తు అనే మాటేగానీ, ఎక్క‌డా క‌లిసి కార్య‌క్ర‌మాలు చేస్తున్న దాఖ‌లాలు లేవ‌ని అంటున్నారు. ఏపీలో బీజేపీకి దేవుడే దిక్క‌ని ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు నిర్వేదంతో అంటుండం విశేషం.