శీర్షిక చదవగానే ఇప్పుడేమిటి, ఎప్పుడో అయింది అని జోక్ చేయవచ్చు కొందరు. కానీ వాస్తవాలు మొదటగా మాట్లాడుకుని ఆ తర్వాత చర్చలోకి వెళదాం. ప్రస్తుతం బిజెపికి రమారమి 40% ఓటుంటే, ప్రతిపక్షాలకు 60% వుంది. ఆ 60లో ప్రాంతీయపార్టీల మొత్తం వంతు 40 దాకా వుంది. కానీ వేర్వేరు పార్టీల శాతాలు కలిపితే ఆ అంకె వస్తుంది. ఏ ఒక్క నాన్-బిజెపి పార్టీకి కాంగ్రెసుకున్నంత ఓటు బ్యాంకు లేదు. ఇంతటి అధ్వాన్న పరిస్థితిలో కూడా జాతీయస్థాయిలో కాంగ్రెసు కున్న ఓటు శాతం రమారమి 20! మూడో వంతు. 10 రాష్ట్రాలలో అది 30 దాటి వుంది. కానీ కాంగ్రెసుకు ఫైటింగ్ స్పిరిట్ లేదు, సరైన నాయకత్వం లేదు. అందుకే బిజెపిని ముఖాముఖీ ఎదుర్కొన్నపుడు చిత్తవుతోంది. అనేక చోట్ల బిజెపికి ప్రాంతీయ పార్టీలు గట్టి పోటీ యిచ్చినా కాంగ్రెసు కారణంగానే బిజెపికి అన్నేసి సీట్లు వస్తున్నాయి కాబట్టి బిజెపిని నిలవరించాలంటే మొదట కాంగ్రెసుకు మంగళం పాడాలి అని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. అది జరిగే అవకాశాలు ఎలా వున్నాయన్నదే ఆలోచించడానికి యీ వ్యాసం.
కాంగ్రెసుతో సహా అన్ని ప్రతిపక్షాలు తలకిందులుగా తపస్సు చేసినా, మోదీ అజేయుడు, బిజెపికి ఎదురే లేదు అని భావించేవాళ్లు కొన్ని గణాంకాలు చూడాలి. 1967 వరకు కాంగ్రెసు కేంద్రంలో, రాష్ట్రాలలో పరిపాలించినప్పుడు యిలాగే అనుకునేవారు. సెఫాలజిస్టులు పుట్టుకుని వచ్చి కాంగ్రెసుకు సొంతంగా వచ్చే ఓట్లు తక్కువే. ప్రతిపక్షాలలో అనైక్యత వలననే అది గెలుస్తోంది. వాళ్లు కలిస్తే కాంగ్రెసుకు ఓటమి తప్పదు అని అంకెలతో చూపించేసరికి వాళ్లకు కనువిప్పు కలిగింది. 1977లో జనతా పార్టీ ఏర్పడింది. కాంగ్రెసు పదవీభ్రష్టురాలైంది. ఇప్పుడు బిజెపి కాంగ్రెసు స్థానంలో వుంది. ‘దానికి స్థిరమైన ఓటు బ్యాంకు 35-37% వరకు వుంది. అందుకే అది అధికారపక్షంగానో, ప్రతిపక్షంగానో యింకో 30-40 ఏళ్లుంటుంది, నాలుగు ట్వీట్లు వేసేసి, బిజెపి కనుమరుగై పోతుందని అనుకోవడం మూర్ఖత్వం’ అని ప్రశాంత్ కిశోర్ హెచ్చరిస్తున్నాడు.
ప్రధానిగా మోదీ విజృంభించేస్తున్నా స్థానిక నాయకుల కారణంగా, కేంద్ర విధానాల పట్ల అసమ్మతి కారణంగా, కొన్ని అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి పట్ల వ్యతిరేకత బయటపడుతోంది. ప్రత్యామ్నాయం గట్టిగా వున్న చోట్ల ప్రజలు అవతలివాళ్లని ఆదరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోకి బిజెపి చొచ్చుకుని వెళ్లలేకపోతోంది. తూర్పు, దక్షిణ భారతంలోని బిహార్, బెంగాల్, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళలలో దాదాపు 200 ఎంపీ సీట్లున్నాయి. వాటిలో 2019లో బిజెపి 47 మాత్రమే గెలవగలిగింది. ఆ 47లో 17 బిహార్, 18 బెంగాల్‌లలో వచ్చాయి. 2024 వచ్చేసరికి ఆ అంకె తగ్గవచ్చు. బిజెపి బలమంతా పశ్చిమం, ఉత్తరంలో వుంది. అక్కడ కనుక గట్టి ప్రతిపక్షం తగులుకుని 100 సీట్లు తగ్గితే బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమౌతుంది. 2022లో యుపి అసెంబ్లీలో గెలిచేస్తే 2024 పార్లమెంటు గెలిచేసినట్లే అనుకోవడానికి లేదు. 2012లో యుపి అసెంబ్లీలో ఎస్పి గెలిచి, బిజెపి ఓడిపోయింది. 2014 వచ్చేసరికి బిజెపి విజయదుందుభి మోగించింది. ఇప్పుడు యుపిలో బిజెపియే అధికారంలోకి వస్తుంది కానీ, గతంలో కంటె తక్కువ సీట్లు వస్తాయంటున్నారు. ఆ లెక్కన 2024లో బిజెపికి తక్కువ ఎంపీ సీట్లు వస్తాయా?
అది ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెసు ఉంటుందా? లేక దాని స్థానంలో వేరే ఏదైనా పార్టీ తయారవుతుందా అనే విషయంపై ఆధారపడుతుంది. ఎందుకంటే 2019 పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెసు-బిజెపి ముఖాముఖీ తలపడినప్పుడు ప్రతి 100 సీట్లలో బిజెపికి వచ్చినవి 96, కాంగ్రెసుకు వచ్చినవి 4! 2014లో అది 6 ఉండింది. సోనియా చురుగ్గా వుండే రోజుల్లో దాని స్ట్రయిక్ రేట్ 32%. అంటే 100 స్థానాలకు పోటీ చేస్తే 32 గెలిచేదన్నమాట. రాహుల్ అధ్యక్షుడుగా వున్న 18 నెలల్లో అది 34-35 అయింది. ఇప్పుడది 10% కు వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెసు గెలుచుకున్న పార్లమెంటు స్థానాల్లో తమిళనాడు, కేరళ, పంజాబ్‌లలో వచ్చినవే ఎక్కువ. అక్కడ బిజెపికి బలం లేదు. దేశం మొత్తం మీద బిజెపికి 40% ఓట్లు పోగా, తక్కిన 60%లో కాంగ్రెసు కనీసం 40% ఓట్లు తెచ్చుకుంటేనే బిజెపిని ఎదిరించగలదు. అంటే 24%. కానీ ప్రస్తుతం ఉన్నది 19. దాన్ని యింకో 5% పెంచాలంటే నాయకత్వం చాలా శ్రమించాలి. శ్రమిస్తోందా? యుపిఏ రోజుల్లో బిజెపి యిలాగే వుందా? ఎన్ని రకాలుగా ఆందోళనలు చేయలేదు! మరి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెసు పార్టీ నిస్తేజంగా, నీరసంగా, దిక్కు తోచకుండా కూర్చుంది. కానీ తక్కిన ప్రతిపక్షాలన్నీ తనను పిలిచి పెద్ద పీట వేయాలని, ‘నీకు చేతకాదు, మేం వచ్చి ఎంతోకొంత చేస్తాం’ అని ఎవరూ అనకూడదని కోరుకుంటోంది.
కాంగ్రెసుకి రెండున్నరేళ్లగా అధ్యక్ష పదవిలో ఎవరూ లేరు. ఆ పదవికి రాహుల్ రాజీనామా చేశాక సోనియా గాంధీ ఆపద్ధర్మ అధ్యక్షురాలిగా వుంది. ఆవిడకు పుట్టెడు రోగం. రాహుల్ మొహం కళ తప్పి ఏడాది దాటింది. అతని 50 దాటాయి కానీ 60 దాటినట్లు కనబడుతున్నాడు. అతనికీ ఏదైనా తీవ్ర అనారోగ్యం వుందేమో తెలియదు. మాటిమాటికీ విదేశాలు వెళ్లిపోతున్నాడంటారు కానీ, విలాసాలకో, చికిత్సకో ఎవరికీ తెలియదు కదా! వీళ్లిద్దరూ పీఠం దిగరు, నిర్ణయాలు తీసుకోరు, జి 23 వారు కోరినట్లు సంస్థాగత ఎన్నికలు నిర్వహించరు. వేరే ఎవర్నీ ఏ పనీ చేయనివ్వరు. గడ్డివాము కాపలా సామెతలా తయారైంది. ఏదైనా కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో వీళ్లు దొరకరు. దొరికినా మాట వినరు. ఎన్నికల ప్రచారానికి కదలరు. రాష్ట్రాలలో కాంగ్రెసు ప్రభుత్వాలు కూలిపోతున్నా మెదలరు. దేశప్రధానికైనా తీరిక వుంటుంది కానీ రాహుల్‌కు ఉండదు. ఒక ట్వీట్ పడేస్తే ‘అమ్మయ్య, యీ రోజు చాలా పని చేసేశాను’ అనుకుంటాడు.
ఇక ప్రియాంకా గాంధీ. రాహుల్ రాకపోతే ప్రియాంకా వచ్చి పార్టీని రక్షించేయాలి అని కొందరు అంటూంటారు. పార్టీ వ్యవహారాలు చూడడానికి ఆమె కేటాయించే టైమెంతో తెలియదు. యుపిలో కాంగ్రెసును బతికించి, తన సత్తా చాటుదామని ఆమె ఉబలాటం. పార్టీ అక్కడ సోదిలోకి లేకుండా పోయింది. గత అసెంబ్లీ ఎన్నికలలో దానితో పొత్తు కుదుర్చుకుని పెద్ద తప్పు చేశానని, అఖిలేష్ యిప్పటికీ వాపోతాడు. బిహార్‌లో లాలూది సేమ్ ఫీలింగ్. తను మునగడమే కాక, తోటివారినీ ముంచగల డేంజరస్ పార్టీ అయిపోయింది కాంగ్రెసు. 2019లో అమేఠీలో తన సోదరుణ్ని గెలిపించుకోలేక పోయిన ప్రియాంక, తక్కిన చోట్ల ఏం సాధించగలదు? అసలామె రాజకీయ పరిజ్ఞానం ఎలాటిది? ఎప్పుడైనా టీవీ చర్చల్లో పాల్గొంటే, ప్రముఖ జర్నలిస్టులకు యింటర్వ్యూలు యిస్తే తెలిసేది. బహిరంగ సభల్లో బట్టీపట్టిన ప్రసంగాలు ఊదరగొడితే ఏం లాభం? మా కుటుంబసభ్యులు కానివారు కాంగ్రెసుకు నేతృత్వం వహించాలి అని రాహుల్ స్టేటుమెంట్లు యిస్తూ వుంటాడు కానీ సోనియమ్మ ఒప్పుకోదు. పార్టీ నాశనమై పోయినా ఫర్వాలేదు కానీ పార్టీ నాయకత్వం మాత్రం చేజారకూడదు అనే పంతం ఆవిడది.
రాహుల్ ఒక్కోప్పుడు అపర త్యాగిలా, ప్రజాస్వామ్యవాదిలా మాట్లాడతాడు. కానీ ఆచరణకు వచ్చేసరికి తనకు తోచినదే చేస్తాడు. తనకు నచ్చనివారిని అణచడానికి ఎంత దూరమైనా వెళతాడు. అతనిలో ప్రధానమైన లోపమేమిటంటే, తన చుట్టూ చేరిన యువనాయకులకు పట్టం కడదామని ప్రయత్నిస్తాడు. వాళ్లకు యితని భజన చేయడం వచ్చు తప్ప, క్షేత్రస్థాయిలో అనుభవం లేదు. పార్టీలో వృద్ధనాయకత్వం తమ పట్టు వదులుకోవడానికి సిద్ధపడరు. అందుకని సోనియా అనుభవజ్ఞులు అంటూ వృద్ధుల వైపే మొగ్గు చూపుతోంది. ఎందువలన అంటే ఆ మార్గానే నడిచి ఆమె పార్టీని విజయపథాన నడిపించింది. 1998 మార్చిలో సోనియా కాంగ్రెసు అధ్యక్షురాలైంది. ఎన్డి తివారీ, అర్జున్ సింగ్, నట్వర్ సింగ్, శరద్ పవార్ వంటి సీనియర్ నాయకులు అధ్యక్షుడిగా వున్న సీతారాం కేసరిని పక్కకు నెట్టేసి, సోనియాకు పార్టీని అప్పగించారు, వరుసగా రెండు లోకసభ ఎన్నికలు ఓడిపోయింది కాబట్టి, వరుసగా అనేక అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయింది కాబట్టి!
2017 వరకు సోనియా నిరాటంకంగా అధ్యక్షపదవిలో వుంది. తన 19 ఏళ్ల నేతృత్వంలో సోనియా 2004-14 మధ్య పదేళ్ల పాటు కేంద్రంలో అధికారం చేజిక్కించుకుంది. అనేక రాష్ట్రాలలో కూడా! అందువలన ఆమె అప్పట్లో సమర్థురాలనే ఒప్పుకోవాలి. రాజీవ్ గాంధీ తన హయాంలో రాజకీయాలతో సంబంధం లేని సలహాదారులను పెట్టుకునేవాడు. కానీ సోనియా పూర్తి రాజకీయవాదులైన అర్జున్ సింగ్, నట్వర్ సింగ్, కరుణాకరన్, అంబికా సోనీ, అహ్మద్ పటేల్ వంటి వారినే నమ్ముకుంది. కొంతకాలానికి యీ గ్రూపులో మన్మోహన్ సింగ్, ప్రణబ్ ముఖర్జీ, శివశంకర్ వంటివారు వచ్చి చేరారు. శరద్ పవార్ కూడా ఆమెతోనే ఉన్నాడు కానీ ఏడాది తర్వాత విడిగా వెళ్లి ఎన్‌సిపి పెట్టుకున్నాడు.
వాజపేయి 13 నెలల ప్రభుత్వం పడిపోయి 1999లో ఎన్నికలు వచ్చినపుడు కాంగ్రెసు ఒంటరిగా బరిలో దిగాలని సోనియా నిర్ణయించింది. ఆ కారణంగా అప్పటికి రికార్డు స్థాయిలో అతి తక్కువగా 114 వచ్చాయి. (పదేళ్ల పాలన తర్వాత కాంగ్రెసు ఆ రికార్డును బద్దలుకొట్టి 2014లో 44 తెచ్చుకుందనుకోండి) దెబ్బకి బుద్ధి తెచ్చుకుని, సోనియా 2003లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. తమలోంచి వెళ్లిపోయిన ఎన్‌సిపితో, రాజీవ్ హత్యలో భాగముందని పేరుబడిన డిఎంకెతో కూడా పొత్తుకు వెనకాడలేదు. దాంతో 2004లో యుపిఏ ప్రభుత్వం ఏర్పడింది. కానీ యుపి, బిహార్, తమిళనాడు, ఒడిశాలలో పార్టీ గెలవలేక పోయింది. యుపిఏ ద్వారా పదేళ్లు పాలించింది కాబట్టి కాంగ్రెసు ఏడేళ్ల క్రితందాకా బలంగానే వుంది అనుకోవడం పొరబాటు. పార్లమెంటు స్థానాలలో హెచ్చుతగ్గులు మాత్రమే సంకేతం కాదు, అసెంబ్లీ స్థానాలు సరైన చిత్రాన్ని కనబరుస్తాయి.
కాంగ్రెసు ఉచ్చస్థానంలో వుండగా దేశవ్యాప్తంగా 3500 అసెంబ్లీ స్థానాలలో 1 లేదా 2వ స్థానాల్లో వుండేది. ఇప్పుడు 1500-1600 స్థానాలకు పడిపోయింది. గత పదేళ్లగా 50 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరిగితే వాటిలో 90% వాటిల్లో కాంగ్రెసు ఓడిపోయింది. 2012 కర్ణాటక, 2017 పంజాబ్, 2018లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో మాత్రమే గెలిచింది. అయినా సోనియా కుటుంబం కుర్చీ పట్టుకుని వేలాడుతోంది తప్ప వదలటం లేదు. రాహుల్ గాంధీ తన విధేయులంటూ తీసుకుని వచ్చిన యంగ్ తరంగ్ పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. హరియాణా కాంగ్రెసు అధ్యక్షుడిగా రాహుల్ నియమించిన అశోక్ తన్వార్ విజయం తెచ్చిపెట్టలేకపోయాడు. ఇప్పుడతను తృణమూల్‌లోకి గెంతేశాడు. ఝార్ఖండ్, త్రిపుర రాష్ట్రాల అధ్యక్షులను తనే నియమించినా వాళ్లు పార్టీ వదిలేసినప్పుడు రాహుల్ వాళ్లను పిలిచి ఎందుకు అని కూడా అడగలేదు. సచిన్ పైలట్ కూడా జ్యోతిరాదిత్య సింధియా తరహాలో బిజెపిలోకి గెంతేసేవాడే కానీ గెహ్లోత్ ప్రభుత్వాన్ని పడగొట్టేటంతమంది ఎమ్మెల్యేలు అతని దగ్గర లేరు కాబట్టి ఆగేడు.
రాహుల్ అధ్యక్ష పదవిని 18 నెలల పాటు ప్రత్యక్షంగా, తర్వాత పరోక్షంగా చలాయిస్తున్న యీ రోజుల్లో కాంగ్రెసు అనుబంధ సంస్థలేవీ చురుగ్గా లేవు. వివిధ వర్గాలకు సంబంధించిన ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్, సేవాదళ్, ఐఎన్టియుసి.. యిలా ఎన్నో వున్నా వాటిల్లో మహిళా కాంగ్రెసు ఒక్కటే కాస్త ఆందోళనలు చేస్తూ చురుగ్గా వుంది. అది కూడా దాని అధినేత సుస్మితా దేవ్ కారణంగా! ఇప్పుడు ఆమె కూడా తృణమూల్‌లోకి మారిపోయింది. రాష్ట్ర అధ్యక్షులలో కూడా చురుగ్గా వుండి కార్యక్రమాలు చేసేవాళ్లు లేరు. నిరసనో, ర్యాలీయో, మరోటో చేయకపోతే ఎలా అని అదిలించదు అధిష్టానం. రేవంత్ రెడ్డి లాటి వాళ్లు ఏదో కిందామీదా పడి హంగామా చేస్తే కదలకుండా యింట్లో కూర్చున్న హనుమంతరావు బాపతు సోకాల్డ్ సీనియర్లు ఏదో ఒకటి అని వెనక్కి గుంజుదామని చూస్తారు. అధిష్టానం వాళ్లను అదుపు చేయదు. ఏమైనా అంటే యిది కాంగ్రెసు సంస్కృతి అంటారు. ఉదాహరణకి ఆంధ్రలో కాంగ్రెసు చేస్తున్న కార్యక్రమాలేమిటో ఎవరైనా చెప్పగలరా, తులసిరెడ్డి వచ్చి ఎబిఎన్‌లో మాట్లాడడం తప్ప! కరోనా సమయంలోనైనా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కనబడ్డారా? ఇలాటి పార్టీలో చేరడం మాట అలా వుంచి, ఉందామనైనా రాజకీయ భవిష్యత్తు ఆశించేవాడు అనుకుంటాడా?
సోనియా కున్న రాజకీయచాతుర్యం రాహుల్‌కు లేదు. మోదీ పట్ల దేశప్రజల కున్న మోజుని గమనించి ఆమె మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగవద్దని ఆదేశాలు జారీ చేసింది. హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయంలో దాన్ని అమలు చేసి ఓ మేరకు ఫలితాలు సాధించారు. కానీ రాహుల్ మాత్రం దాన్ని బేఖాతరు చేసి ఎప్పుడూ మోదీని కించపరుస్తూ మాట్లాడుతూనే వుంటాడు. వెక్కిరింతలు ఎదుర్కుంటూనే వుంటాడు. ఏ అంశం గురించైనా అభ్యంతరం లేవనెత్తితే, వ్యాఖ్యానిస్తే కొసదాకా తీసుకెళ్లడు. హోం వర్క్ చేసుకోడు కాబట్టి మధ్యలోనే మానేస్తాడు. పార్లమెంటుకి రానే రాడు. వచ్చినా సరిగ్గా మాట్లాడడు.
కాంగ్రెసు సాధ్యమైనంత వరకు రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురాకుండా అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ వచ్చింది. యుపిఏ హయాంలో జరిగిన అవినీతి కారణంగా ప్రజాదరణ పోగొట్టుకుంది. బిజెపి దాన్ని సొమ్ము చేసుకుంటూ హిందూత్వను కూడా జోడించింది. వారి సంస్థాగతమైన బలం ఎప్పుడూ వుంది. అయినా 1951లో స్థాపించిన జనసంఘ్ రోజుల నుంచి లెక్కవేసుకుంటే కేంద్రంలో అధికారంలోకి రావడానికి 47 ఏళ్లు పట్టింది. ఇప్పుడు బిజెపి ప్రభంజనం నడుస్తోంది. సెక్యులరిజం, కమ్యూనిజం అనేవి బూతుపదాలుగా చలామణీ అవుతున్నాయి. నెహ్రూ కలిపురుషుడి అవతారమని నమ్మేట్లా చేస్తున్నారు. ఈ దశలో కూడా హిందువుల్లో సగం మంది మాత్రమే బిజెపికి ఓటేస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకోని రాహుల్ కేవలం హిందూత్వ వలననే బిజెపి గెలుస్తోందనుకుని తనూ హిందూ కార్డుని వాడటం మొదలెట్టాడు. శివాలయాలకు వెళ్లడం. తమ గోత్రం ఫలానా అనడం, జందెం వేసుకుంటాడని పక్కవాళ్ల చేత చెప్పించడం, యిలా వేషాలు వేసినకొద్దీ నవ్వులపాలవుతున్నాడు.
డిసెంబరు 12న జయపూర్‌లో అధికధరలకు వ్యతిరేకంగా కాంగ్రెసు చేసిన ర్యాలీలో పాల్గొంటూ అసందర్భంగా మతం గురించి మాట్లాడాడు. ‘‘భారతదేశం హిందువులకు చెందిన దేశం, హిందూత్వవాదులకు చెందినది కాదు. నేను హిందువుని. హిందూత్వవాదులను గద్దె దింపి, హిందువులను అధికారంలోకి తీసుకురావడమే నా ధ్యేయం.’’ అన్నాడు. ఆ తర్వాత కాంగ్రెసు ప్రతినిథి గౌరవ్ వల్లభ్ ‘‘మహాత్మా గాంధీ గారు హిందుమతానికి ప్రాతినిథ్యం వహిస్తే, గోడ్సే హిందూత్వకి ప్రాతినిథ్యం వహించాడు.’’ అన్నాడు. అంటే కాంగ్రెసు నిఘంటువు నుంచి భారతీయత ఎగిరి పోయిందన్నమాట! మనం భారతీయులం కాము, హిందువులం మాత్రమే! గాంధీగారి జాతిపిత కాదు, హిందువులకు మాత్రమే పిత! భారతదేశానికి ఆరెస్సెస్ వాళ్ల నిర్వచనం భారతదేశం హిందువులదే అని. రాహుల్ కూడా అలాగే మాట్లాడితే, యిక కాంగ్రెసుకి, బిజెపికి తేడా ఏముంది? ఒవైసీ ఒక్కోప్పుడు మూర్ఖంగా, ఒక్కోప్పుడు లాజికల్‌గా మాట్లాడతాడు. రాహుల్‌ను ఖండిస్తూ ‘‘ఇండియా భారతీయులది, హిందువులది మాత్రమే కాదు. అనేక మతాలకు చెందినవారిది మాత్రమే కాదు, ఏ మతమూ లేనివారిది కూడా!’’ అన్నాడు.
అసలు రాహుల్ తను హిందువునని పదేపదే చెప్పుకోవడం దేనికి? ప్రజలకు అతని మతవిశ్వాసాలతో పనేముంది? వాళ్లకు సోనియా క్రైస్తవురాలని తెలుసు, విదేశీయురాలని తెలుసు. అయినా నాయకురాలిగా అంగీకరించి, పదేళ్ల పాటు ప్రభుత్వపాలనను ఆమెకు అప్పగించలేదా? హిందూత్వ గోదాలోకి దిగితే రాహుల్ మోదీతో జన్మలో పోటీ పడలేడు. అందుకని అటువైపు పోకపోవడమే మంచిది. హిందూ ఓట్లు దక్కకపోగా తటస్థుల, యితర మతస్థుల ఓట్లు పోతున్నాయి, యింకా పోతాయి. దాన్ని ఎన్నికల అంశంగా తీసుకోకపోవడమే మంచిదనుకున్న సోనియా ఆపద్ధర్మ అధ్యక్షురాలు కాగానే హిందూ హడావుడి తగ్గించమని ఆదేశాలు యిచ్చింది. కానీ రాహుల్ ఆమె మాట వినటం లేదు. కేదారనాథ్ వెళ్లివచ్చాడు. అతనికి తోడు ప్రియాంకా ఒకత్తి. విశ్వనాథ మందిరదర్శనం, బహిరంగసభల్లో దుర్గాస్తుతి చేసి, ఓట్లు అడుగుతోంది. ఆమె తండ్రి పార్శీ అని చెప్పుకున్నాడు (అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరిగాయి), తల్లి క్రైస్తవురాలు, భర్త క్రైస్తవుడు. ఈమె హిందుగా చూపించుకోవలసిన అవసరం ఏముంది? ప్రజలకు మంత్రాలే కావాలనుకుంటే పూజారులనే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నుకుంటారుగా!
అన్నాచెల్లెలు కలిసి పంజాబ్‌లో చెడుగుడు ఆడేశారు. సిద్ధూని ఎందుకు ఆదరించారో, అతనిలో ఏ ఘనత చూశారో తెలియదు. కెప్టెన్ అమరీందర్ వంటి పెద్ద నాయకుణ్ని దూరం చేసుకుని, అతన్ని బిజెపి కౌగిట్లోకి తరిమారు. అతను పార్టీని ఏ మేరకు చీలుస్తాడో తెలియదు. కులపరమైన లెక్కల ప్రకారం చన్నీ ఎంపిక సరిగ్గానే వున్నట్లు తోస్తున్నా, సిద్దూ అతనికి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. తన చేతిలో కీలుబొమ్మ అని చూపించడానికి శతథా ప్రయత్నిస్తున్నాడు. అన్నాచెల్లెళ్లు అతన్ని ఆపలేక పోతున్నారు. ‘రెండున్నరేళ్ల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో ముఖ్యమంత్రిగా బాఘేల్‌ను దింపేసి, నిన్ను ముఖ్యమంత్రిని చేస్తానని రాహుల్ నాకు మాట యిచ్చారు’ అంటాడు సింగ్‌దేవ్ అనే మంత్రి. అలాటిది ఉన్నట్లు రాహుల్ నాకు చెప్పలేదంటాడు బాఘేల్. కాబినెట్ రీషఫిల్‌తో గొడవ చల్లారుద్దామని చూస్తున్నారు కానీ ఎప్పుడైనా ప్రజ్వరిల్లవచ్చు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ చేతులు కట్టేసి యీదమంటారు వీళ్లు అంటూ రాహుల్‌ను దులిపేశాడు.
ఇతనే కాదు, కాంగ్రెసు నాయకులందరూ యిదే ఫిర్యాదు చేస్తారు. రాహుల్ అందుబాటులో వుండడు, ఉన్నా చెప్పినమాట వినడు అని. పార్టీ విడిచివెళ్లిన వాళ్లు ఫిర్యాదు చేస్తే కొట్టి పారేయవచ్చు, ఏదో సాకు చెప్తున్నారని. కానీ కాంగ్రెసు పార్టీలోనే వుంటూన్న సీనియర్లు కూడా సంస్థాగత ఎన్నికలు పెట్టండి, ఎవరికి బలం వుందని తేలితే వాళ్లకు పగ్గాలు అప్పగించండి అని చెప్తూ వున్నా సోనియా వినటం లేదు. ఎన్నికలా? వచ్చే ఏడాది చూసుకుందాం అని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ పోతోంది. నిజానికి రాహుల్ కాంగ్రెసుకు ఎసెట్ కాదు, బిజెపికి! అతను ప్రత్యామ్నాయ ప్రధాని అభ్యర్థిగా వున్నంతకాలం మోదీకి ఢోకా లేదు. మోదీ చేస్తున్న తప్పులు ఎత్తి చూపగానే ‘అయితే రాహుల్‌ను ప్రధాని చేయమంటావా? చాల్లేవయ్యా, నవ్విపోతారు’ అని కొట్టి పారేస్తున్నారు ఓటర్లు. ఇలాటి కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా తృణమూల్‌కు ఏ మేరకు ఛాన్సుంది అనేది తర్వాతి వ్యాసంలో చర్చిద్దాం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)