ఎమ్బీయస్‍: కాంగ్రెసు స్థానంలో తృణమూల్?

ఇప్పటిదాకా ప్రతిపక్షాల ఐక్యత అనేది కాంగ్రెసు కేంద్రంగా ఆలోచిస్తూ వచ్చారు. కానీ తృణమూల్ కాంగ్రెసు స్థానాన్ని ఆక్రమిద్దామని చూస్తోంది. కాంగ్రెసు అది సహించలేక పోతోంది. కాంగ్రెసు ప్రతినిథులు మమతను తిట్టిపోస్తున్నారు. అసలు కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం…

ఇప్పటిదాకా ప్రతిపక్షాల ఐక్యత అనేది కాంగ్రెసు కేంద్రంగా ఆలోచిస్తూ వచ్చారు. కానీ తృణమూల్ కాంగ్రెసు స్థానాన్ని ఆక్రమిద్దామని చూస్తోంది. కాంగ్రెసు అది సహించలేక పోతోంది. కాంగ్రెసు ప్రతినిథులు మమతను తిట్టిపోస్తున్నారు. అసలు కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం గురించి ఆలోచించ వలసిన అవసరం ఉందా లేదా? బిజెపికి వ్యతిరేకంగా పార్టీలను కూడగట్టే పని తృణమూల్ వలన అవుతుందా లేదా అనేది చర్చించడమే యీ వ్యాసం ఉద్దేశం. దేశవ్యాప్తంగా కాంగ్రెసుకు దాదాపు 20% ఓట్లుంటే మరి తృణమూల్‌కు? కేవలం 4%! ‘దిల్లీ దూర్ ఆస్త్’! తృణమూల్‌కు ఉన్న లోకసభ ఎంపీలు 22. వైసిపికీ అంతే! డిఎంకెకు ఉన్నది 24! కాంగ్రెసుకు 53. తృణమూల్ అనేది బెంగాలీల కోసమే పని చేస్తూ వచ్చిన పార్టీ. మమత కేంద్రమంత్రిణిగా చేసినా, బెంగాల్‌కు బయట ఆమెకు పాప్యులారిటీ లేదు. ఆమె పార్టీలో ఎవరికీ జాతీయస్థాయిలో గుర్తింపు కూడా లేదు. కానీ మమత దేశం మొత్తం మీద వీలైతే 50 ఎంపీ స్థానాలు గెలిచి, ప్రస్తుత కాంగ్రెసుతో సమానస్థాయి సంపాదించి, జాతీయ నాయకురాలు అయిపోదామని చూస్తోందట. ప్రతిపక్షాల ఐక్యతకు తను కేంద్రంగా మారాలని ప్లాన్లు వేస్తోంది. ఏం చూసుకుని ఆమె పెద్దపెద్ద ప్లాన్లు వేస్తోంది?

నిక్కచ్చిగా చెప్పాలంటే కాంగ్రెసు సన్నాసుల మఠంగా, బద్ధకస్తుల సత్రంలా తయారవడం చూసి! ‘ఎవడిచ్చాడురా నీకీ పెత్తనం?’ అని అడిగితే ‘ఒకడిచ్చేదేముంది? అక్కడ పడివుంటే నేనే భుజాన వేసుకున్నాను’ అన్నాట్ట వెనకటికెవడో. అలా తయారైంది, ప్రతిపక్షనాయకత్వం. బిజెపి ఆటలు కాంగ్రెసు పార్టీ దగ్గర చెల్లినట్లు తక్కినవాళ్ల దగ్గర చెల్లటం లేదని ప్రశాంత కిశోర్ గణాంకాలు వల్లిస్తుంటే యితర ప్రతిపక్షాలకు నోరూరుతోంది. ఇండియా టుడేకు యిచ్చిన యింటర్వ్యూలో ప్రశాంత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. 1984లో 404 సీట్లు తెచ్చుకున్న కాంగ్రెసుకు ఆ తర్వాత సొంత మెజారిటీ లేదు. 1991లో పివి గారిది ఐదేళ్ల మైనారిటీ ప్రభుత్వం. 2004-14 యుపిఏ అనేది భాగస్వాములతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం. 1989లో 198 తెచ్చుకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని కాంగ్రెసు 2004లో 145 మాత్రమే తెచ్చుకున్న భాగస్వామ్య పక్షాల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పరచింది. 2009 వచ్చేసరికి 206 తెచ్చుకుంది.

2014లో మోదీ చేతిలో చావుదెబ్బ తిని 44 దగ్గర ఆగిపోయింది. అయితే రాష్ట్రాలలో కాంగ్రెసుకి వున్న బలమైన నాయకుల కారణంగా 2018లో కర్ణాటకలో జెడిఎస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో సొంతంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంతో రాహుల్‌కు ధైర్యం పెరిగిపోయి 2019లో పొత్తుల గురించి సరిగ్గా ప్రయత్నించలేదు. 2019 పార్లమెంటు ఎన్నికలలో బిజెపికి గతంలో కంటె ఎక్కువ సీట్లు రావడంతో రాహుల్ బిత్తరపోయి, అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాడు. కాంగ్రెసు గెలిచిన రాష్ట్రాలలో కూడా బిజెపి ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెసు ప్రభుత్వాలను బిజెపి పడగొట్టింది. రాహుల్ నిస్తేజంగా చూస్తూ కూర్చున్నాడు. ఇలాటి పార్టీ కనీసం ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుని వాళ్ల సాయంతో ఫైట్ చేయాలి కదా!

కానీ సోనియా కుటుంబానికి ప్రాంతీయ పార్టీలంటే చిన్నచూపు. బిజెపికి దీటైన జాతీయ పార్టీ తమదొక్కటే అని, అందరూ తమ చుట్టూనే తిరగాలని వాళ్ల ఉద్దేశం. క్షేత్రస్థాయిలో బలం లేకపోయినా, పాతికేళ్ల క్రితం నాటి రికార్డు చూపించి, భాగస్వాములను దబాయించి, ఎక్కువ సీట్లు అడగడం, వాటిలో ఓడిపోయి, కూటమిని దెబ్బ తీయడం ఆనవాయితీ అయిపోయింది. కూటమి ప్రచారానికి రావడానికి కూడా రాహుల్, ప్రియాంకాలకు తీరిక వుండదు.

ప్రాంతీయ పార్టీలకు నిజంగా బలం లేదా? 1984 నుంచి 2014 వరకు అవి 43-52% ఓట్లు సంపాదిస్తూ వచ్చాయి. 2014లో 49% తెచ్చుకున్నాయి. కానీ 2019లోనే అది 44కి పడిపోయింది. ఐనా బిజెపి తెచ్చుకున్న 37.5% కంటె, కాంగ్రెసు తెచ్చుకున్న 19.5% కంటె అది ఎక్కువే. ప్రాంతీయ పార్టీలతో ముఖాముఖీ పోటీ వున్న చోట బిజెపి విజయావకాశాలు అంతంత మాత్రమే! కానీ కాంగ్రెసుతో తలపడినప్పుడే అది దాని తడాఖా చూపిస్తోంది. దాని స్ట్రయిక్ రేట్ 90% పైన వుంటోంది. వచ్చిన యిబ్బందేమిటంటే బిజెపి-కాంగ్రెసు తలపడే మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా రాష్ట్రాలలో 140 సీట్లున్నాయి. వీటిలో అధికాంశం బిజెపి పట్టుకుపోతోంది. ఇవి కాక పంజాబ్, అసాం, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాలలో కూడా కాంగ్రెసు బలం వుంది. అక్కడ 60 సీట్లున్నాయి. అంటే మొత్తం 200 సీట్లలో కాంగ్రెసు కనీసం సగం, అంటే 100 తెచ్చుకుంటే అది బిజెపిని ఓడించలేక పోయినా ప్రతిపక్షాలకు కేంద్రంగా నిలవగలదు. కానీ అదే జరగటం లేదు.

బిజెపికి దడ పుట్టించాలంటే కాంగ్రెసులో చలనం రావాలి. బిజెపికి మంచో, చెడో ఒక ఐడియాలజీ అంటూ వున్నట్లు కాంగ్రెసుకూ ఓ ఐడియాలజీ అంటూ వుండాలి. బిజెపిని చూసి వాతలు పెట్టుకుంటే లాభం లేదు. ముఖ్యంగా లేచి పరిగెట్టాలి. ఇవన్నీ ప్రశాంత కిశోర్ రాహుల్‌ను కూర్చోబెట్టి చెప్పాడు. ‘బయటి మనిషిగా ఏదైనా చెప్తావు. అమలు చేసి చెడిపోతే మేం పోతాం’ అంటారనో, కాంగ్రెసుకి జీవం పోశానని చెప్పుకుని కాలరెగరేయడానికో ఒక దశలో ఆ పార్టీలో చేరదామని కూడా అనుకున్నాడు. రెండేళ్ల పాటు చర్చలు జరిగినా టెర్మ్‌స్ కుదరలేదు. దాదాపు మూడేళ్లు టైముంది కాబట్టి 2024 నాటికి పార్టీని సిద్ధం చేస్తాను అని ప్రశాంత్ అంటే ‘అబ్బే, అదంతా కుదరదు, చేతనైతే యుపి, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెసును గెలిపించి చూపించు’ అన్నాడు రాహుల్.

సర్వేలు చేసి బలాబలాలు నిర్ధారించుకుని, తగిన ప్రణాళికలు రూపొందించుకుని, వాటిని అమలు చేయిస్తే తప్ప ఫలితాలు కనబడవు. తృణమూల్ విషయంలో నైతే అభిషేక్ పూర్తి సహకారాన్నిచ్చాడు. మమత, ప్రశాంత్ సలహాలపై పూర్తి నమ్మకాన్ని వుంచి, పార్టీ పెద్దలు ఎదురు చెప్పినా కొట్టిపారేసి అమలు చేసింది. కాంగ్రెసులో ఆ పరిస్థితి లేదు కదా. అసలు రాహుల్ మాట వినాలి. మోదీ ఎందుకు విజేత అయ్యాడో చెప్తూ ప్రశాంత్ ‘నేను ఆయన వద్దకు వెళ్లినప్పటికే నాలుగు దశాబ్దాల ఏళ్ల అనుభవం వుంది. 15 ఏళ్ల పాటు ఆరెస్సెస్ కార్యకర్తగా క్షేత్రస్థాయిలో ప్రజలతో కలిసి తిరిగిన అనుభవం, 15 ఏళ్ల పాటు బిజెపి ప్రతినిథిగా ఆర్గనైజేషన్ నడిపిన అనుభవం, 13 ఏళ్ల పాటు గుజరాత్ సిఎంగా పరిపాలించిన అనుభవం యివన్నీ తన దగ్గర పెట్టుకుని ఆయన మాట్లాడేవాడు. అన్నిటికన్న ముఖ్యం ఆయన గొప్ప శ్రోత. ఎవరు చెప్పినా శ్రద్ధగా వింటాడు.’ అన్నాడు.

రాహుల్‌ విషయంలో సంస్థాగత అనుభవం అనే ఒక్క పాయింటే కనబడుతుంది. అదీ ఎన్నాళ్లు, ఎంత యిన్వాల్వ్‌మెంట్‌తో అన్నది ఎవరికి వారే ఊహించుకోవాలి. యుపిఏ హయాంలో జూనియర్ మంత్రిగా కూడా పనిచేయలేదు. అయితే ప్రధాని కావాలి తప్ప చిల్లరమల్లర వద్దనుకున్నాడేమో! ఇక శ్రోత అనే పదానికి అర్థమే తెలియదు. రాష్ట్రంలో నాయకులు వచ్చి కొంపలు మునిగిపోతున్నాయి బాబోయ్ అన్నా కుక్కపిల్లతో ఆడుకుంటూ సరేలే అనే రకం. ఇలాటి రాహుల్ నేతృత్వంలో ఉన్న పార్టీని ఉత్తేజితం చేయాలంటే టైము కావాలని ప్రశాంత్ అడగడానికి కారణం అదే. టైమిచ్చి అతను నిజంగా పార్టీని బాగుపరిచేస్తే తను చవట అని లోకానికి రుజువై పోతుందని రాహుల్ భయం. అందుకే నెలల వ్యవధిలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో నీ ప్రతాపం చూపించు అని సవాలు విసిరాడు. కితంసారి యుపి అసెంబ్లీ ఎన్నికలలో ప్రశాంత్ చెప్పిన ఏ పనీ జరగలేదు. ఈసారీ అలాగే చేసి ప్రశాంత్ కాదు, ఎవడొచ్చినా యింతకంటె బాగా చేయలేడు అని నిరూపించాలని రాహుల్ తాపత్రయం.

తన మాట పార్టీలో సీనియర్లతో సహా అందరూ వినాలంటే, ఒక పెద్ద పదవి కావాలని కూడా ప్రశాంత్ అడిగాడట. నిజంగా మార్పులు తెచ్చేసి, 2024 ఎన్నికలలో కాంగ్రెసుకు ఏ 200 సీట్లో తెచ్చిపెట్టేశాడంటే, అతనంటే యూత్‌లో క్రేజ్ పుట్టి, అతనే కాంగ్రెసు తరఫున ప్రధాని పదవికి అర్హుడు అనే మాట దేశంలో ప్రబలిందంటే తన పదవికి ముప్పు అని రాహుల్‌ బెదిరాడు. అందుకని ప్రశాంత్‌ను తృణీకరించి పంపేశాడు. దాంతో ప్రశాంత్‌కు ఒళ్లు మండిపోయినట్లుంది. చేసిన కసరత్తంతా వేస్టయిందనుకుని, రాహుల్‌ అప్రయోజకుడని నిరూపించడానికి బహిరంగంగా చురకలు వేయడం మొదలెట్టాడు. ‘నాయకత్వం దైవదత్తం అనుకోకూడదు, ఓ ట్వీట్ వేస్తే చాలనుకోకూడదు..’ వంటి వ్యాఖ్యలు ధారాళంగా చేయసాగాడు.

దానితో బాటు కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రతిపక్షాలను కూడగట్టే అవకాశం మీరెందుకు తీసుకోకూడదని మమతను ఉత్సాహ పరిచాడు. బెంగాల్ విజయంతో ఉప్పొంగిపోతున్న ఆమె సై అంది. కాంగ్రెసు బలహీనంగా ఉన్న రాష్ట్రాలలో వల వేసి కాంగ్రెసు వాళ్లను పడుతోంది. కాంగ్రెసు పార్టీపై మనసు విరిగిన వాళ్లకు ప్రస్తుతం బిజెపి ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనబడుతోంది. కానీ బిజెపి ఐడియాలజీ వాళ్లకు యిబ్బందిగా వుంటోంది. అదే తృణమూల్ అయితే కాంగ్రెసులోంచి ఉద్భవించిందే కాబట్టి యీజీగా అడ్జస్టు కాగలరు. కాంగ్రెసు ముస్లిములను బుజ్జగిస్తూ, వాళ్లకు అన్నీ కట్టబెట్టిందని బిజెపి ఆరోపిస్తూ హిందువులను సంఘటితం చేద్దామని చూస్తోంది. ముస్లిముల పరిస్థితి ఏమంత గొప్పగా లేదని గణాంకాలు చూస్తే తెలుస్తుంది.

సెప్టెంబరులో ఒవైసీ మాట్లాడుతూ తెలంగాణలో ముస్లిముల పరిస్థితి గురించి ఎకడమీషియన్స్ యిచ్చిన గణాంకాలు చదివాడు. తెలంగాణ జనాభాలో ముస్లిములు 12.7%. రాష్ట్ర ప్రభుత్వోద్యోగాల్లో ముస్లిముల శాతం 7.4. ఐఏఎస్, ఐపిఎస్ వంటి సివిల్ సర్వీసెస్‌లో ముస్లిముల శాతం 2.9. ఫిమేల్ వర్క్ ఫోర్స్ శాతం హిందువుల్లో 51, ముస్లిముల్లో 18. ప్రాథమిక స్థాయిలో స్కూళ్లలో చేరడంలో హిందూ, ముస్లిములు దాదాపు సమానంగానే వున్నా 15-20 సం.ల వయసు వచ్చేసరికి ముస్లిములు 49%, హిందువులు 69% వుంటున్నారు. అంటే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేక మానేస్తున్నారన్నమాట. అభివృద్ధి లేకపోవడానికి కారణం ఇన్నేళ్లగా పాలించిన కాంగ్రెస్సనే చెప్పాలి. తమను బాగు చేయకపోయినా, తమపై కక్ష కట్టరనే భావంతో ముస్లిములు, యితర మైనారిటీలు కాంగ్రెసును నమ్మి ఓటేస్తూ వచ్చారు. ఇప్పుడు బిజెపి హిందూత్వ ప్రచారాన్ని తట్టుకోలేక, కాంగ్రెసు కూడా హిందూగానం ఆలపిస్తే వాళ్లకు చికాకుగా వుంది. ప్రత్యమ్నాయం ఉన్న చోట వాళ్లకే ఓటేస్తున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెసునే అంటిపెట్టుకుని వున్నవాళ్లు తృణమూల్ వంటి పార్టీలో చేరితే యీ ఓట్లు, తటస్థులుగా వుండే హిందూ ఓట్లు పడతాయి. పైగా బిజెపి రైటిస్టు విధానాలను సమర్థించవలసిన అగత్యం తప్పుతుంది.

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి చేసిన హడావుడి చూసి మమత బెదిరిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ అమోఘమైన విజయాన్ని సాధించి, బిజెపి అందరూ భయపడేటంత గొప్ప శక్తి ఏమీ కాదని నిరూపించింది. తర్వాత ఉపయెన్నికలలో కూడా తన తడాఖా చూపించింది. తాజాగా కలకత్తా కార్పోరేషన్ ఎన్నికలలో 72% ఓట్లు తెచ్చుకుని 144 వార్డుల్లో 134 గెలిచింది. బిజెపి 9% ఓట్లు, 3 వార్డులు దక్కాయి. బెంగాల్‌లో బిజెపి లోంచి నాయకులు జారిపోతున్నారు. ఈ ధైర్యంతో మమత జాతీయస్థాయికి వెళ్లాలని అనుకుంది. వెళ్లాలంటే కాంగ్రెసును వెనక్కి నెట్టేయాలి. అందుకని కాంగ్రెసు పని అయిపోయినట్లే అని తన పార్టీ పత్రికలో సంపాదకీయాలు రాయించింది. డిసెంబరు 1న కాంగ్రెసుతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వం నడుపుతున్న శరద్ పవార్‌ను కలవడానికి వెళ్లినపుడు ఒక ప్రశ్నకు బదులిస్తూ యుపిఏయా? అదెక్కడుంది? అని అడిగింది. మమత యుపిఏ నుంచి 2012లోనే బయటకు వచ్చేసింది.

దిల్లీ వెళ్లినపుడు సోనియాను కలవలేదేం? అని పాత్రికేయులు అడిగితే వెళ్లి కలవాలని రాజ్యాంగంలో రాసి వుందా? అని అడిగింది. డిసెంబరు 13న గోవాలో మాట్లాడుతూ బిజెపిని ఓడించడానికి కాంగ్రెసుతో సహా అన్ని ప్రతిపక్షాలు కలిసి రావాలని పిలుపు నిచ్చింది. అయినా మర్నాడు దిల్లీలో సోనియా రాజ్యసభ సభ్యుల బహిష్కరణపై చర్చించడానికి ప్రతిపక్షాలను పిలిచినపుడు తృణమూల్‌ను ఆహ్వానించలేదు. కాంగ్రెసు నాయకులు టీవీల్లో మమతను తిట్టిపోస్తున్నారు. మమతకు యితర ప్రతిపక్షాలతో కూడా పేచీలు వస్తున్నాయి. గోవాలో ఆప్‌తో పోటీపడడంతో అరవింద్‌కు కోపంగా వుంది. గోవాలో ఎన్‌సిపి ఎమ్మెల్యేను తృణమూల్‌లోకి లాక్కోవడంతో శరద్‌కు కోపం వచ్చింది. ఎవరి బాగు వారు చూసుకునే ప్రతిపక్షాలు ఒక చోటికి రావడమంటే యిలాటి కష్టాలు చాలా వుంటాయి. పైగా కొన్ని పార్టీలు కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుని వున్నాయి.

కాంగ్రెసు అధ్వాన్నంగా వుందని ఒప్పుకుంటూనే కొన్ని వాస్తవాలు గుర్తించాలి. అది మూడు రాష్ట్రాలలో సొంతంగా ప్రభుత్వం నడుపుతోంది. మరో రెండు రాష్ట్రాలలో జూనియర్ పార్ట్‌నర్‌గా ప్రభుత్వంలో వుంది. 15 రాష్ట్రాలలో ఒక పార్టీగా వుంది. అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో 102 లోకసభ స్థానాలున్నాయి. అక్కడ ప్రాంతీయ పార్టీలు లేవు. బిజెపితో తలపడగలిగేది కాంగ్రెసు ఒకటే. 2019లో వీటిలో 4 మాత్రమే గెలిచింది. పంజాబ్, అసాం, కర్ణాటక, కేరళ, హరియాణా, మహారాష్ట్ర, ఝార్‌ఖండ్, గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌లలో 155 సీట్లున్నాయి. వీటిలో దానికి కొద్దోగొప్పో బలం వుంది. కాంగ్రెసును దూరంగా నెట్టేస్తే బిజెపి వ్యతిరేక ఓటు చీలిపోతుంది. 2019 పార్లమెంటు ఎన్నికలలో 543 మొత్తం లోకసభ స్థానాల్లో కాంగ్రెసు 403 స్థానాల్లో పోటీ చేస్తే 52 మాత్రమే గెలిచినా, 196టిలో ద్వితీయ స్థానంలో నిలిచింది.

ఇలాటి పార్టీని పూర్తిగా విస్మరించడం ఎవరి తరమూ కాదు. అలా అని దాని నేతృత్వంలో పని చేయడమూ సాధ్యం కాదు. ప్రతిపక్ష ఐక్యతకు కాంగ్రెసు ఒక పెద్ద గుదిబండ. ఆ పార్టీకి సోనియా కుటుంబం ఒక గుదిబండ. ఇక దీనికి పరిష్కారమంటూ ఏదైనా వుందా అంటే ఒకటే మమత, శరద్, జగన్, అమరీందర్ లాగ రాష్ట్రస్థాయి కాంగ్రెసు నాయకులు బయటకు వచ్చేసి పేరులో కాంగ్రెసు అనే తోక తగిలించుకుని సొంత పార్టీలు పెట్టుకుని కాంగ్రెసు ఓటుబ్యాంకును గుంజేసుకోవాలి. కాంగ్రెసు ఏ మాత్రమైనా గెలుస్తోందంటే దానికి కారణం దాని గత చరిత్ర, స్థానిక నాయకులకు ప్రజల్లో వున్న పలుకుబడి తప్ప సోనియా కుటుంబీకులు కాదు.

బయటకు వచ్చేటంత ధైర్యం వాళ్లకు లేకపోతే మమత వాళ్లకు కలిగించాలి. ధైర్యం ఒక్కటే కాదు, నిధులు కూడా! అసాంలో విద్యార్థి నాయకులు అసాం గణ పరిషత్ పేర పార్టీ పెట్టినపుడు ఇందిరకు వ్యతిరేకంగా పార్టీ పెట్టారు కాబట్టి ఎన్టీయార్ వాళ్లకు నిధులిచ్చి, ప్రచారానికి కూడా వెళ్లారు. ఇప్పుడు మమత కూడా అలాటి పని చేయాలి. అప్పుడే తృణమూల్ కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా మారుతుంది. అయితే వాళ్లు మమత చెంత చేరతారా అంటే తప్పకుండా చేరతారు. ఎందుకంటే కాంగ్రెసుకు భారీశరీరం వుంది కానీ గుండె లేదు. మమతకు శరీరం చిన్నదైనా గట్టి గుండెకాయ వుంది. దమ్ము చూపి పోరాడేవాళ్లనే ప్రజలు మెచ్చుతారని చరిత్ర అనేకసార్లు నిరూపించింది. ప్రస్తుతం ఒక్క రాష్ట్రంలోనైనా బిజెపికి దడ పుట్టిస్తున్నది మమత ఒక్కరే! అందువలన బిజెపిని ఎదిరించా లనుకునేవాళ్లకు ఆమె ఒక్కతే దిక్కు!

– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2021)

[email protected]