బాలయ్య నియోజకవర్గంలో వైసీపీ ఫైటింగ్..!

వైసీపీ ఫైటింగ్ అంటే.. అదేదో ప్రత్యర్థులతో కాదు.. వారిలో వారే ఫైట్ చేసుకుంటున్నారు. ప్రత్యర్థి బలంగా ఉన్న చోట.. పార్టీ కోసం ఉమ్మడిగా పనిచేయాల్సింది పోయి.. తమలో తామే కీచులాడుకుంటున్నారు. పరోక్షంగా బాలయ్యకి మేలు…

వైసీపీ ఫైటింగ్ అంటే.. అదేదో ప్రత్యర్థులతో కాదు.. వారిలో వారే ఫైట్ చేసుకుంటున్నారు. ప్రత్యర్థి బలంగా ఉన్న చోట.. పార్టీ కోసం ఉమ్మడిగా పనిచేయాల్సింది పోయి.. తమలో తామే కీచులాడుకుంటున్నారు. పరోక్షంగా బాలయ్యకి మేలు చేస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో వైసీపీలో ఉన్న అంతర్గత కుమ్ములాట టీడీపీకి లాభం చేకూర్చేలా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలనాటికి టీడీపీ ఎంత బలహీన పడినా.. వైసీపీ ఇంటర్నల్ వార్ తో గెలిచే సీటుని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు.

హిందూపురంలో పార్టీ ఒకటే కానీ, ఆధిపత్యం కోసం ఇద్దరు నాయకులు రెండు కార్యాలయాలు పెట్టుకున్నారు. రెండు గ్రూపులు మెయింటెన్ చేస్తున్నారు. గత ఎన్నికలనుంచీ ఇక్కడ ఇదే వ్యవహారం. 2019 ఎన్నికలకోసం ఇక్కడ నవీన్ నిశ్చల్ పక్కాగా ప్రిపేర్ అయ్యారు. అయితే చివరి నిముషంలో ఐపీఎస్ అధికారి మహ్మద్ ఇక్బాల్ ని తీసుకొచ్చి ఇక్కడ బరిలో దింపారు. అప్పటికే అక్కడ పాతుకుపోయిన నవీన్ కి, ఇక్బాల్ కి మధ్య పొసగలేదు. దీని ఫలితం హిందూపురంలో కనిపించింది.

2014లో గెలిచిన తర్వాత హిందూపురం కంటే ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్న బాలయ్య, రాజకీయాలకంటే ఎక్కువగా సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఎమ్మెల్యే.. 2019లో కూడా అక్కడ్నుంచి గెలిచారంటే అది కచ్చితంగా వైసీపీలో ఉన్న అనైక్యతే. అయితే 2024 నాటికి కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది.

హిందూపురంలో ఓడిపోయిన ఇక్బాల్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఆయనే పార్టీ ఇన్ చార్జ్.  నవీన్ నిశ్చల్ ని పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ చార్జిగా నియమించడంతో పాటు, రాష్ట్ర ఆగ్రో చైర్మన్ గా చేసింది అధిష్టానం. ప్రస్తుతం ఇద్దరికీ పదవులుండటంతో గొడవలుండవని భావించారు. కానీ విచిత్రంగా ఇంకా ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. హిందూపురంలో నువ్వా నేనా అంటూ లోకల్ క్యాడర్ ని కన్ఫ్యూజన్లో పడేస్తున్నారు ఇద్దరు నేతలు. పార్టీ కమిటీల ఏర్పాటుతో ఈ గొడవ మరోసారి బయటపడింది.

ఇక్బాల్ కి తెలియకుండా రెండు మండలాలకు కన్వీనర్లను నియమించారు నవీన్ నిశ్చల్. ఆ నియామకాలు చెల్లవని కుండబద్దలు కొట్టారు ఇక్బాల్. తాను ఇన్ చార్జిగా ఉన్న నియోజకవర్గంలో వేరేవారి పెత్తనమేంటని మండిపడ్డారు. తనని కాదని నియామకాలు చేపడితే జగన్ కి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అయితే పార్టీ కోసం పనిచేసినవారినే తాను నియమించానంటున్నారు నవీన్. తనని కాదని పార్టీ పదవులిచ్చేందుకు నువ్వెవరని ప్రశ్నిస్తున్నారు ఇక్బాల్. ఇలా ఈ గొడవ ముదిరిపోయింది. చివరికి హౌసింగ్ బోర్డ్ కాలనీ అనే ఏరియాలో వైసీపీకి రెండు పార్టీ ఆఫీస్ లు వెలిశాయి.

కుప్పంలో సాధించారు కానీ.. హిందూపురంలో ఏంటిది..?

కుప్పంలో ఇప్పటికే చంద్రబాబుకి షాకుల మీద షాకులిస్తోంది వైసీపీ. కుప్పం మున్సిపాల్టీని కూడా కైవసం చేసుకుని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి 2024లో ఎమ్మెల్యే పదవి కూడా దక్కకుండా చేయాలనుకుంటోంది. సమష్టి కృషితోనే అది సాధ్యమైంది. పార్టీలోనే ఇద్దరు నాయకులు కీచులాడుకుంటూ ఉండటంతో హిందూపురం ఇలా తయారైంది.