ఎన్ఆర్సీపై బాబు యూట‌ర్న్‌

జాతీయ పౌర ప‌ట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జ‌నాభా ప‌ట్టిక (ఎన్పీఆర్‌)ల‌కు తాము వ్య‌తిరేక‌మ‌ని టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న యూట‌ర్న్‌పై త‌న‌కే స‌ర్వ‌హ‌క్కులున్నాయ‌ని మ‌రోసారి రుజువు చేసుకున్నాడు. ఈ…

జాతీయ పౌర ప‌ట్టిక (ఎన్ఆర్సీ), జాతీయ జ‌నాభా ప‌ట్టిక (ఎన్పీఆర్‌)ల‌కు తాము వ్య‌తిరేక‌మ‌ని టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న యూట‌ర్న్‌పై త‌న‌కే స‌ర్వ‌హ‌క్కులున్నాయ‌ని మ‌రోసారి రుజువు చేసుకున్నాడు. ఈ రెండు బిల్లుల‌కు వైసీపీతో పాటు టీడీపీ కూడా పార్ల‌మెంట్‌లో కేంద్ర‌ప్ర‌భుత్వానికి అండ‌గా నిలిచాయి. ఈ రెండు బిల్లుల‌కు అనుకూలంగా పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లోనూ త‌మ స‌భ్యులతో ఓట్లు వేయించారు.

వారం క్రితం క‌డ‌ప ప‌ర్య‌ట‌న‌లో సీఎం జ‌గ‌న్ త‌మ ప్ర‌భుత్వం ఎన్ఆర్సీకి వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌క‌టించాడు. ముస్లింల‌కు అండ‌గా ఉంటామ‌ని సీఎం ప్ర‌క‌టించాడు. ఇప్పుడు మాజీ సీఎం చంద్ర‌బాబు కూడా మ‌రోసారి జ‌గ‌న్ బాట‌లోనే న‌డిచాడు. త‌మ పార్టీ కూడా వ్య‌తిరేక‌మ‌ని సోమ‌వారం అమ‌రావ‌తిలో ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో ముస్లిం నేత‌ల స‌మావేశంలో ప్ర‌క‌టించాడు. ముస్లింల పోరాటానికి మ‌ద్ద‌తుగా ఉంటామ‌ని ప్ర‌క‌టించాడు.

13 జిల్లాల మైనార్టీ నేత‌ల‌తో స‌మావేశంలో చంద్ర‌బాబు మాట్లాడుతూ  పార్ల‌మెంట్‌లో పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వైసీపీ మ‌ద్ద‌తు ఇచ్చింద‌ని, ఇప్పుడు ఎన్ఆర్సీకి వ్య‌తిరేక‌మ‌ని వైసీపీ ప్ర‌క‌టిస్తూ ముస్లిం మైనార్టీల‌ను మోసం చేస్తోంద‌ని  విమ‌ర్శించాడు. ఒక‌వైపు తాము కూడా మ‌ద్ద‌తు ఇచ్చామ‌ని మ‌రిచిపోయి జ‌గ‌న్‌ను విమ‌ర్శించ‌డం ఏంట‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

ఎన్ఆర్సీకి జ‌గ‌న్ మ‌ద్ద‌తు లేద‌ని ప్ర‌క‌టించిన సంద‌ర్భంలో టీడీపీ యువ‌నేత నారా లోకేశ్ త‌న‌దైన శైలిలో ట్విట‌ర్ వేదిక‌గా ఘాటైన విమ‌ర్శ‌లు చేశాడు.

'ఇప్పుడు కడప సభలో ఎన్ఆర్సీ అమలు చేయమని ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు కదా, ఎంతకైనా దిగజారుతారు. వైసీపీ నాయకులు వారి అధ్యక్షుడు వైఎస్ జగన్ గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని గుర్తించడం మంచిది. పార్లమెంట్లో మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారు. బయట మాత్రం మేము వ్యతిరేకం అని ప్రచారం చేస్తారు. 16 ఆగస్టు 2019న NRC పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం' అని నారా లోకేశ్ నాడు ఘాటుగా ట్వీట్ చేశాడు.

జ‌గ‌న్‌పై లోకేశ్ ట్వీట్ చేసిన అంశాల‌న్నీ ఇప్పుడు త‌న తండ్రి చంద్ర‌బాబుకు వ‌ర్తించ‌వా అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. అయ్యా లోకేశా ఎక్కుడున్నావయ్యా…కాస్త స‌మాధానమైనా చెప్పు లేదంటే ట్వీట్ అయినా చేయి స్వామి!