పచ్చ పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పరువు తీస్తున్నాయి. గౌరవ న్యాయమూర్తికి అనుకూల ఇంటర్వ్యూలు, వార్తా కథనాలు ఇస్తున్నామనే అత్యుత్సాహంలో మౌలికమైన విషయాల్ని ఆ రెండు పత్రికలు విస్మరించడాన్ని గమనించొచ్చు. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు.
కానీ ఎన్వీ రమణ విషయంలో ఎల్లో మీడియా ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించి గంతులేస్తోంది. ఇది జస్టిస్ ఎన్వీ రమణ పరువు, ప్రతిష్టలకు మరింత భంగం కలిగిస్తోంది. ఎన్వీ రమణ విషయంలో పూర్తిగా ఏకపక్షంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి వ్యవహరిస్తుండడంతో, జగన్ లేఖకు ప్రజల్లో సానుకూల అభిప్రాయాల్ని ఎల్లో మీడియా పుణ్యమా అని పెంచినట్టవుతోంది.
సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు మరికొందరు న్యామూర్తులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆ లేఖలో జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారని, అందుకు తగ్గ ఆధారాలను చీఫ్ జస్టిస్‌కు పంపారు. ఈ లేఖ విషయమై ఒక్క వాక్యం కూడా ప్రచురించని ఈనాడు, ఆంధ్రజ్యోతి ….కౌంటర్ వార్తలను మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.
ఈ రోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను ఒకసారి పరిశీలిద్దాం. “జడ్జిలను బెదిరించేందుకే జగన్ లేఖ -న్యాయమూర్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే కుతంత్రం” అనే శీర్షికతో బ్యానర్ వార్త ఇచ్చారు. ఈనాడు విషయానికి వస్తే “సీజేకు లేఖతో జగన్ లక్ష్మణరేఖను దాటారు” శీర్షికతో ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈటీవీ భారత్‌తో ఢిల్లీ రిటైర్డ్ జడ్జి ఆర్ఎస్ సోధి మాట్లాడుతూ ముఖ్యమంత్రే న్యాయమూర్తులను విమర్శించడం ఏంటి? అంటూ ప్రశ్నించారని తాటికాయంత అక్షరాలతో ఇచ్చారు.
అలాగే ” కోర్టులను బెదిరించి లబ్ధి పొందే ఎత్తుగడ” శీర్షికతో మరో వార్తా కథనాన్ని ఈనాడులో చూడొచ్చు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాయడాన్ని తప్పు పడుతున్న వాళ్లకు ఎల్లో మీడియా అగ్రస్థానం కల్పించింది. సీజేకు లేఖ రాయడాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఢిల్లీ బార్ అసోసియేషన్ , తమిళనాడు అడ్వకేట్స్ అసోసియేషన్, సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం తప్పు పడుతూ తీర్మానాలు చేశాయి. ఈ మేరకు ప్రకటనలు విడుదల చేశాయి.
మరి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, కాబోయే చీఫ్ జస్టిస్ రేస్‌లో ఉన్న వ్యక్తి, అన్నిటికీ మించి ఒక తెలుగు న్యాయమూర్తికి ఆయన సొంత రాష్ట్రం నుంచి ఎందుకని మద్దతు కొరవడింది. ఏపీ బార్ అసోసియేషన్, అలాగే మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ బార్ అసోసియేషన్ ఎందుకని జగన్ లేఖ రాయడంపై మౌనం పాటించాయి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
దీనికి ఎల్లో మీడియా ఎన్వీ రమణకు దేశమంతా పెద్ద ఎత్తున మద్దతు ఉప్పెనలా వస్తోందని ఓవరాక్షన్ చేస్తుండడంతో …తెలుగు సమాజం నుంచి ఓ తెలుగు న్యాయమూర్తికి ఆదరణ కనిపించకపోవడంపై సహజంగానే అనుమానాలు తలెత్తుతున్నాయి.
తెలుగు సమాజం నుంచి ఎన్వీ రమణకు మద్దతు రాకపోవడానికి ప్రధాన కారణం ఒకటి ఆయన్ని టీడీపీ తమ వాడని ప్రచారం చేయడం, రెండోది ఎల్లో మీడియా భుజానేసుకుని ఊరేగుతుండడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, ఎల్లో మీడియా ఎన్వీ రమణ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం వల్ల …ఔను కదా, జగన్ ఆరోపించిన దాంట్లో తప్పేముందనే అభిప్రాయాలు సామాన్యుల నుంచి వ్యక్తం కావడం గమనార్హం. జాతీయ స్థాయిలో జగన్ లేఖను ఏ విధంగా ఖండించారో చూద్దాం.
” కోర్టును బెదిరించి వ్యక్తిగత లబ్ధి పొందాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి తన లేఖను మీడియా ద్వారా బహిర్గతం చేయడానికి ఒడిగట్టినట్టు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కాబోయే వరుసలో ఉన్న అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఎన్వీ రమణను లక్ష్యంగా చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుసరించిన విధానాన్ని చూసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విస్మయానికి, భయాందోళనకు గురైంది” అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, సీనియర్ అడ్వొకేట్ మనన్‌కుమార్ మిశ్రా ఒక ప్రకటన విడుదల చేశారు.
“న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకోవాలనే దుర్భుద్ధితోనే ఈ పని చేసినట్టు కనిపిస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశాం” అని ఢిల్లీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవ్ నాసియర్, గౌరవ కార్యదర్శి దివ్యదర్శన్ శర్మ పేర్కొన్నారు.
జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం ఆరోపణలు గుప్పించడాన్ని తమిళనాడు అడ్వకేట్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు జగన్ రాసిన లేఖను తప్పుబడుతూ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.ప్రభాకరన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
జగన్ లేఖ రాయడాన్ని సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం ఖండించింది. ఇలాంటి దుందుడుకు, బాధ్యతా రాహిత్యమైన చర్యను ఖండిస్తున్నట్టు పేర్కొంటూ తీర్మానం చేసింది. ఈ తీర్మాన విషయాన్ని సంఘ ప్రధాన కార్యదర్శి ప్రేరణాకుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
వీళ్లందరి ఖండనలు, తీర్మానాలు చూసిన తర్వాత జనం ఓ అభిప్రాయానికి వస్తున్నారు. వీళ్లెవరికీ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలేవీ తెలియవని చెబుతున్నారు. అయినా జగన్ ఆరోపణలపై నిగ్గు తేల్చాల్సింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అలాగే తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్వీ రమణతో పాటు హైకోర్టు న్యాయమూర్తులపై ఉంది. అలాంటప్పుడు మధ్యలో ఈ సంఘాలేంటి?
నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థాన చీఫ్ జస్టిస్‌పై తీవ్ర ఆరోపణలు చేసినప్పుడు వీళ్లంతా ఎక్కడికి పోయారనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి. వీళ్దందరి తపన , ఆరాటం చూస్తుంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్వీ రమణ అయితే, కష్టకాలంలో మద్దతుగా నిలిచామని చెప్పి లబ్ధి పొందేందుకు సంఘాల పేరుతో ఇలాంటి తీర్మానాలు చేస్తున్నారనే అభిప్రాయాలు న్యాయవాదుల నుంచే రావడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి బాగా తెలియడం వల్ల ఎన్వీ రమణకు ఏ ఒక్కరూ మద్దతుగా ఒక్క తీర్మానం లేదా ప్రకటన ఇవ్వడం లేదనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఏ వ్యవస్థ ఎట్లా పనిచేసున్నదో, ఎందుకలా వ్యవహరిస్తున్నదో తెలంగాణ సమాజానికి కూడా బాగా తెలియడం వల్ల అక్కడి నుంచి కూడా ఏ ఒక్కరూ నోరు మెదపలేదనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.
మొత్తానికి తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు సంబంధించి ఏ ఒక్కరూ ఎన్వీ రమణకు మద్దతుగా నిలబడలేదనే విషయాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి పరోక్షంగా సమాజానికి తెలియజేస్తూ … ఎన్వీ రమణ పరువు తీస్తున్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. పాపం చేయని నేరానికి ఎల్లో మీడియా పుణ్యమా అని ఎన్వీ రమణ బలి పశువు అవుతున్నారనే సానుభూతి వ్యక్తమవుతోంది.