తిట్టాడా..పొగిడాడా: మంత్రి అనీల్ కు బండ్ల కౌంటర్!

దేవుడ్ని ఏదైనా అంటే భక్తుడికి కోపం రావడం ఎంత సహజమో.. పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఏదైనా అంటే బండ్ల గణేశ్ కు కోపం రావడం కూడా అంతే సహజం. ఈరోజు మంత్రి అనీల్…

దేవుడ్ని ఏదైనా అంటే భక్తుడికి కోపం రావడం ఎంత సహజమో.. పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఏదైనా అంటే బండ్ల గణేశ్ కు కోపం రావడం కూడా అంతే సహజం. ఈరోజు మంత్రి అనీల్ కుమార్ యాదవ్, పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. దీంతో బండ్ల సీన్ లోకి ఎంటరయ్యారు. అనీల్ కు కౌంటర్ ఇచ్చారు. అయితే ఇక్కడ చర్చ ఏంటంటే.. బండ్ల గణేశ్, మంత్రిని విమర్శించారా.. మెచ్చుకున్నారా..?

ఇంతకీ మంత్రి అనీల్ ఏమన్నారంటే..!

ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన హీరో నానికి కౌంటర్ గా మంత్రి ప్రతివిమర్శలు చేశారు. అయితే తన విమర్శల్ని నానికి మాత్రమే పరిమితం చేయకుండా పవన్ కు కూడా విస్తరించారు. పవన్ పై క్రేజ్ తో అందరికంటే ముందే తను గుండు గొరికించుకున్నానని, అతడి కోసం తన బైక్ అమ్మి బ్యానర్లు కట్టానని, కటౌట్లకు పూలమాలలు వేశానని చెప్పుకొచ్చారు అనీల్. పవన్ తన సినిమాకు 50 కోట్లు కాకుండా.. 10 కోట్లు పారితోషికం తీసుకుంటే సమస్య ఉండదని, ప్రేక్షకులకు సినిమా అందుబాటులోకి వస్తుందని అన్నారు.

బండ్ల గణేశ్ ఏమన్నారంటే…!

మంత్రి అనీల్ చెప్పిన వ్యాఖ్యల నుంచి కేవలం ఒకే ఒక్క కామెంట్ ను తీసుకొని, దానికి తనదైన సెటైర్ జోడించారు బండ్ల గణేశ్. బైక్ అమ్మి పవన్ కల్యాణ్ సినిమాకు కటౌట్లు కట్టానంటూ మంత్రి అనీల్ చెప్పిన మాటలకు మాత్రం కౌంటర్ ఇచ్చారు. “అందుకే రాష్ట్రానికి మంత్రి అయ్యావ్ అన్నా” అంటూ సెటైర్ వేశారు బండ్ల. అంటే.. పవన్ కల్యాణ్ అభిమానివి కాబట్టే మంత్రి స్థాయి వరకు ఎదిగావ్ అనే అర్థం వచ్చేలా పోస్ట్ వేశారు బండ్ల.

ఈ సెటైర్ పై పవన్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తుంటే.. వైసీపీ కార్యకర్తలు మాత్రం బండ్లపై ఫైర్ అవుతున్నారు. అనవసరంగా ఈ వివాదంలోకి వచ్చి ట్రోలింగ్ కు గురికావొద్దంటూ హెచ్చరిస్తున్నారు. మరికొంతమంది మాత్రం అసలు బండ్ల గణేశ్, అనీల్ ను తిట్టారా, పొగిడారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.