ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను నియంత్రిస్తోంది. ఇది గత కొన్నాళ్లుగా చర్చలో ఉన్న అంశం. ఈ అంశంపై సినిమా వాళ్లు అభ్యంతరం చెబుతూ ఉన్నారు. సినిమా టికెట్ల రేట్లను ప్రభుత్వం నియంత్రించవద్దని, తమ సినిమా టికెట్లను తమ ఇష్టానుసారం పెంచుకునే అవకాశం ఇవ్వాలని వారు అంటున్నారు. ఈ విషయంలో వీరి ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. ఎంతలా అంటే.. తమకు చాలా అన్యాయం జరుగుతూ ఉందని, తాము అన్యాయం అయిపోతున్నామని, ఏపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందన్నట్టుగా మాట్లాడుతున్నారు.
ఇక మధ్యలో మీడియా కూడా సినిమా వాళ్ల ఉచిత సానుభూతి చూపుతూ ఉంది. కొందరు మిడిమిడి విశ్లేషకులు.. సీఎం కాగానే జగన్ ను సినిమా వాళ్లు కలవలేదని, అందుకే ఇండస్ట్రీపై కోపంగా ఉన్నాడని విశ్లేషిస్తూ ఉన్నారు! అయితే ఈ విషయంలో జగన్ క్లియర్ గా చెబుతూ ఉన్నారు. తను ప్రజలనూ, దేవుడిని మాత్రమే నమ్ముకున్నట్టుగా జగన్ నోరు తెరిచినప్పుడల్లా చెబుతూ ఉంటారు. అంతే కానీ సినిమా వాళ్లు వచ్చి తన పక్కన నిలబడితేనో.. సినిమా వాళ్లు తనకు అనుకూలంగా ప్రచారం చేస్తేనో తను గెలుస్తాను అనే లెక్క జగన్ వద్ద లేదు. ఎప్పుడూ లేదు. తను సొంతంగా గెలిచాడు తప్ప సినిమా వాళ్లేమీ దగ్గరుండి గెలిపించలేదు. అలాంటిది తను గెలవగానే సినిమా వాళ్లు తన ముందు నిలబడాలని జగన్ అనుకుని ఉంటాడనుకోవడం చాలా చీప్ ఆలోచన. బహుశా ఇలాంటి విశ్లేషణలు చేసే వాళ్ల మనస్తత్వం అది కాబోలు!
చిరంజీవి తన ఇంటికి వస్తే జగన్ సాదరంగా ఆహ్వానించారు తప్ప.. అహాన్ని చూపలేదు. అలాగే నాగార్జున, ఇతరులు వెళ్లినప్పుడు కూడా వారితో ఉత్సాహంగా మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ ఎవరినీ గెలిపించలేదు, ఓడించలేదని గత దశాబ్దాలుగా రుజువవుతూనే ఉంది. అందులోనూ కనీసం ఏపీలో మకాం పెట్టని వీళ్లను జగన్ సీరియస్ గా తీసుకుంటాడని అనుకోవడం కేవలం కొందరి భ్రమ. మరి కొందరు కావాలని ఎక్కిస్తున్న విషం ఇది.
ఆ సంగతలా ఉంటే.. సినిమా వాళ్లు నోరెత్తితే సినిమా టికెట్ ఐదు రూపాయలు అయ్యిందని, ఏపీలో సినిమా టికెట్ ఐదు రూపాయలు అని మొత్తుకుంటున్నారు. దీనికి తోడు మీడియా ప్రతినిధులు కూడా ఐదు రూపాయల టికెట్ తో ఎలా గిట్టుబాటు అవుతుంది? అంటూ లాజిక్ గా అడుగుతున్నారు! చూసే వాళ్లు కూడా నిజంగానే సినిమా టికెట్ ఐదు రూపాయలు అయ్యిందేమో అని భ్రమ పడుతున్న పరిస్థితి! ఇంతకీ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో ఏముందో చూస్తే… ఈ ఐదు రూపాయల కథేమిటో తేలుతుంది!
ఆ జీవో ప్రకారం.. మల్టీప్లెక్స్ లో ప్రీమియం టికెట్ ధర నూటా యాభై రూపాయలు! ఇది గతం నుంచి ఉన్నదే! ఇదే మల్టీప్లెక్స్ థియేటర్లలో డిలాక్స్ ధర వంద రూపాయలు, సాధారణ ధర అరవై రూపాయలు. ఏపీలో ప్రధాన పట్టణాల్లో కూడా చాలా థియేటర్లు మల్టీప్లెక్స్ లు అయిపోయి చాలా కాలం అయ్యింది. ఒకప్పుడు ఏసీ, డీటీఎస్ అనేది థియేటర్ల పేర్ల వెనుక ఉన్న ట్యాగ్. అయితే అలాంటి వాటిని చాలా వరకూ ఆధునీకరించారు.
సీట్లను మార్చి మల్టీప్లెక్స్ ముద్ర వేయించుకున్నారు. చూడగా… మొత్తం థియేటర్లలో కనీసం డెబ్బై శాతం వరకూ ఈ తరహా ముద్రతోనే ఉంటాయి! కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లలో చాలా వరకూ థియేటర్లు ఇదే ట్యాగ్ తో ఉన్నాయి. కేవలం కొన్ని మాత్రమే ఈ సొబగులు అద్దుకోలేదు. అలాగని వాటిల్లో ఏమీ ఐదు రూపాయల టికెట్ దొరకదు! కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ కేటగిరిలో వాటిల్లో కూడా మల్టీప్లెక్స్ రేంజ్ లోనే టికెట్లను అమ్మినా అడ్డుకునే చట్టాలేవీ లేవు!
ఎటొచ్చీ ధర నూటాయాభైకి మించకూడదంతే! ఇదే సినిమా వాళ్లకు అస్సలు మింగుడుపడటం లేదు. ఒక్కో టికెట్ నూటా యాభైకి అమ్ముకునే అవకాశం ఉన్నా.. దీన్నో కక్ష సాధింపుగా, ఇది చిల్లరంగడి వసూళ్లుగా మాట్లాడుతున్నారు సినిమా వాళ్లు!
ఇక నగర పంచాయతీల విషయానికి వస్తే.. ఇక్కడ మల్టీప్లెక్స్ లలో మాగ్జిమం రేటు 120 గా ఉంది! నగర పంచాయతీలు అంటే.. అవి కనీసం నియోజకవర్గ స్థాయి పట్టణాలు కూడా కాదు! మండల స్థాయి, అంతకన్నా చిన్నవి! వాటిల్లో ఏసీలో కూర్చుని సినిమా చూడాలంటే 120 రూపాయలు తక్కువా? ఇక్కడకు సినిమాలకు వచ్చేది ప్రధానంగా గ్రామీణులే అని వేరే చెప్పనక్కర్లేదు. ఈ మల్టీప్లెక్స్ లతో తెరకు అతి దగ్గరగా వేసిన కుర్చీల్లో కూర్చుని సినిమా చూడాలన్నా.. నలభై రూపాయలు టికెట్ ధర!
మరి ఎక్కడ ఐదు రూపాయలు? అనంతపురం జిల్లా కొత్త చెరువు లాంటి మండల కేంద్రంలోనో, విజయనగరం జిల్లా ఎస్ కోటలోనో.. ఒక థియేటర్లో కూర్చుని సినిమా చూడాలంటే.. ఏపీ ప్రభుత్వ జీవో ప్రకారం కూడా నలభై రూపాయలు చెల్లించాల్సిందే! అది కూడా ముందు వరసలో మెడ పైకి ఎత్తి, స్క్రీన్ కు అతి దగ్గరగా కూర్చుంటే నలభై రూపాయల టికెట్! వెనుక వైపు కూర్చువాలంటే 80, బాల్కానీలో అయితే మరి కాస్త ఎక్కువే!
ఇక ఇవే నగర పంచాయతీల్లో నాన్ ఏసీ, నాన్ కూలర్ థియేటర్లలో మ్యాగ్జిమం రేటు పాతిక రూపాయలు, మినిమం రేటు పది రూపాయలుగా ప్రభుత్వం పేర్కొంది. అసలు నాన్ ఏసీ, నాన్ కూలర్ థియేటర్లు ఇంకా ఉన్నాయా? ఏసీలు పక్కన పెడదాం.. థియేటర్లో నాలుగు కూలర్లు పెట్టడానికి ఇరవై వేలు ఖర్చవుతుంది. అప్పుడు కూడా థియేటర్ల కేటగిరి మారిపోతుంది. అక్కడ మినిమం టికెట్ విషయంలో పది, పాతిక కాదు.. ప్రీమియం పేరుతో ముప్పై ఐదు రూపాయల వరకూ అమ్ముకునే అవకాశం ఉండనే ఉంది!
ఇక్కడ ఇంకో మాట చెప్పుకోవాలి.. ఇప్పుడు తాడిపత్రి, ధర్మవరం, నంద్యాల.. వంటి టౌన్లను తీసుకుంటే.. ఇక్కడ ఏ సినిమా విడుదల అయినా.. రెండో వారం నుంచి టికెట్ ధర ముప్పై రూపాయలకు మించి లేదు! పోస్టర్ల మీదే టికెట్ ధరను రాస్తారు ఇలాంటి పట్టణాల్లో. తొలి వారం పూర్తి కాగానే అతికించే పోస్టర్లలో సినిమా టికెట్ ధర ముప్పై అని, ఇరవై అని రాసి మరీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ప్రయత్నాలు సాగుతుంటాయి.
ఇదంతా రొటీనే. మరి వాళ్లే పోస్టర్ మీద ఇరవై అని, ముప్పై రూపాయలే అని .. రాసి ప్రేక్షకులను రప్పిస్తున్నప్పుడు, అది చిల్లర పోగేసుకోవడమో కాదో.. సినిమా వాళ్లే చెప్పాలి! ఇవి మున్సిపాలిటీ లెవల్ పట్టణాల్లో. ఇక్కడ ఒక్కో టికెట్ ను నూటాభై వరకూ అమ్ముకోవచ్చని ప్రభుత్వమే రాసిస్తోంది. అయితే రెండో వారం నుంచి పోస్టర్ పై ముప్పై రూపాయలు చాలని థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు! మరి ఇంత గంగవెర్రిలెత్తుతోంది.. తొలి వారంలో చేసుకునే దోపిడీ కోసమేనా?
ఇంతకీ ఐదు రూపాయల టికెట్ ఎక్కడో తెలుసా.. థియేటర్లే లేని చోట! మాటెత్తితే ఏపీ ప్రభుత్వం టికెట్ రేటును ఐదు రూపాయలు చేసిందంటూ సినిమా వాళ్లు చెబుతున్నారు. మీడియా కూడా టన్నుల కొద్దీ సానుభూతి చూపిస్తూ ఉంది. అయితే.. ఏపీలో ఐదు రూపాయల టికెట్ దొరికేది కేవలం థియేటర్లు లేని చోట మాత్రమే. గ్రామ పంచాయతీల్లో.. నాన్ ఏసి, నాన్ కూలర్ థియేటర్లలో స్క్రీన్ కు అతి దగ్గరగా కూర్చునే ఎకానమీ తరగతి టికెట్ ను ఐదు రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం!
మరి ఇంతకీ గ్రామ పంచాయతీ ల్లో ఉన్న థియేటర్లు ఎన్ని? థియేటర్ అంటేనే.. అది కనీసం మండల స్థాయి పట్టణాల్లో మాత్రమే ఉంటుంది. బట్ట సినిమా రోజుల్లో కూడా గ్రామ పంచాయతీల్లో టెంట్లు లేవు! థియేటర్ల ఆవిర్భావం దగ్గర నుంచి అవి కనీసం మండల స్థాయి పట్టణాన్ని, నగర పంచాయితీని వెదుక్కొన్నాయి తప్ప.. పల్లెటూళ్లోనో, గ్రామ పంచాయతీలోనో థియేటర్ ను పెట్టి ఆడించే ఆనవాళ్లు కనపడవు. ఇరవై యేళ్ల కిందట చాలా మండల స్థాయిల్లో కూడా థియేటర్లు లేవు.
రాయలసీమ పరిధిలో, నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాల్లో చూసుకున్నా.. చాలా మండల కేంద్రాల్లో కూడా థియేటర్లు ఉండవు! ఇప్పటికీ లేవు! రాయలసీమలో థియేటర్లు లేని మండల కేంద్రాలు పదుల సంఖ్యలో ఉంటాయి! ఏపీ మొత్తం మీద ఇలాంటి మండలాలు ఎన్నో ఉంటాయి. థియేటర్లు అంటే.. మండలాలు, ఆ పై స్థాయే! నలుగురూ కలిసే ఊర్లలోనే కదా థియేటర్లు పెడతారు! మరి అలాంటిది.. పంచాయతీల్లో నేల టికెట్లను ఐదు రూపాయలు అని ప్రభుత్వం తన జీవోలో చెబితే.. ఏపీలో మొత్తం టికెట్ ధర ఐదు రూపాయలు అయిపోయిందనేంత రేంజ్ లో గగ్గోలు సాగుతూ ఉంది!
గ్రామ పంచాయతీల్లో ఎక్కడైనా థియేటర్లు ఉన్నాయంటే.. అవి అక్కడ భూమి ఉన్న వారు ఎప్పుడో దర్పం కోసమో, పేరు కోసమో థియేటర్లను నిర్మించుకుని ఉండవచ్చు. అయితే కాల క్రమంలో అలాంటివి మూతపడిపోయి ఉంటాయి. ఇప్పుడు ఏపీ మొత్తం వెదికినా.. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న థియేటర్లు ఎన్నో సినిమా వాళ్లే చెప్పాలి. వీటి సంఖ్య ఏ ఇరవై ముప్పై లోపే ఉన్నా.. ఆశ్చర్యం లేదు. ఇక్కడ కూడా మ్యాగ్జిమం రేటు 80 రూపాయల వరకూ ఉంది. నాన్ ఏసీ, నాన్ కూలర్ నేల టికెట్ మాత్రం ఐదు రూపాయలు!
ఎలా చూసినా.. ఏపీలో ఐదు రూపాయల టికెట్ దొరికే ఛాన్సే లేదు. ఐదు రూపాయలు కాదు.. జీవో గట్టిగా అమలైనా టికెట్ కొనాలంటే 20 రూపాయలకు పైనే! పట్టణ స్థాయి, థియేటర్లను బట్టి నూటా యాభై. ఇది తక్కువా? ప్రభుత్వం ఇచ్చే జీవో క్లియర్ గా ఉండాలి కాబట్టి.. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, నగర పంచాయతీ అంటూ.. వేర్వేరు కేటగిరిలను అప్లై చేసింది. దీంట్లోని ఆఖరి కేటగిరిలోని నేల టికెట్ రేటును పట్టుకుని, ఐదు రూపాయలే అయిపోయిందంటూ సానుభూతి పొందడానికి సినిమా వాళ్లు తమ వైన తెలివి తేటలు చూపిస్తూ, వేషాలు వేస్తున్నారు!
ప్రభుత్వ జీవో యథాతథంగా అమలైనా.. ఏపీలో మినిమం టికెట్ ను నూటా యాభైకి అమ్ముకుంటారు సినిమా వాళ్లు, థియేటర్ల వాళ్లు కలిసి. అందులో ఎలాంటి అనుమానం లేదు. తొలి వారంలో ఆ మేరకు వసూలు చేసుకుని, రెండో వారం నుంచి ఇరవైకి, ముప్పైకి కూడా టికెట్లను ఇస్తామంటూ పోస్టర్ల మీద రాస్తారు. ఇది వారి వ్యాపారం. అయితే.. ఎటొచ్చీ తొలి వారంలో తమ దందాను సాగించుకునే అవకాశం లేకుండా పోతోందని గగ్గోలు పెడుతున్నారు. ఇందులో ప్రేక్షకులు, అవమానాలు.. ఇలాంటివేమీ లేవు.
అభిమానులు కూడా మరీ ఆందోళన చెందనక్కర్లేదు తమ హీరోల సంపాదన తగ్గిపోతుందని, తొలి వారంలో దోపిడీకి మాత్రం చెక్ పడాలి, పడుతుంది ప్రభుత్వ జీవో అమలైతే. అయితే కోర్టులు గనుక ఈ జీవోను పూర్తిగా అడ్డుకుని.. తొలి వారం కూడా వదిలేయాలని స్పష్టం చేస్తే.. సినిమా వాళ్ల దోపిడీకి ఎలాంటి అడ్డుకట్టా ఉండదు. ఇదీ కథ.
జీవన్ రెడ్డి. బి