ఒమిక్రాన్ భయంతో ఇన్నాళ్ళూ వెళ్లదీస్తున్న జనాలకు అది ఎదురుపడితే, మన వూరిలోనే ఉనికి చాటుకుంటే ఎలా ఉంటుంది. విశాఖ సిటీ జనాల పరిస్థితి ఇపుడు అదే తీరున ఉంది. మొత్తానికి సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ మెగా సిటీ విశాఖలో ఎంటరైపోయింది. ఈ రోజు ఒకరికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లుగా వైద్య అధికారులు దృవీకరించారు.
దుబాయి నుంచి విశాఖ వచ్చిన ముప్పయి మూడేళ్ల యువకుడికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ వచ్చినట్లుగా రూఢీ అయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 15న ఆయన విశాఖ వచ్చారు. చిన్న జ్వరం రావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
ఇక ఈ నెల 16న ఆయనకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ శ్యాంపిల్స్ ని సీసీఎంబీకి పంపించగా ఒమిక్రాన్ గా తాజాగా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.దీంతో ఆయన్ని వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్ లో ఉంచారు.
ఇదిలా ఉండగా ఆయనతో ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టులోకి వెళ్ళిన వారికి ఇపుడు పరీక్షలు నిర్వహించే పనిలో అధికారులు ఉన్నారు. ఇక పొరుగున ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇదే రోజు మరో ఒమిక్రాన్ కేసు బయటపడింది.
దాంతో స్టీల్ సిటీ జనాలు భయాందోళలను గురి అవుతున్నారు. వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలు కలిగిన ఒమిక్రాన్ విశాఖలో ఎంట్రీ ఇవ్వడంతో దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది జిల్లా అధికార వర్గాలు సైతం అంచనా వేసే పనిలో ఉన్నారు.