తెలుగుదేశం పార్టీ ప్రస్తుత తీరు ఎలా ఉంది అంటే ముందుకు అన్న మాట దేముడెరుగు అలా వెనక్కు వెనక్కే అడుగులు పడిపోతున్నాయి. పార్టీ అధినాయకత్వం వ్యవస్థనలు మ్యానేజ్ చేస్తూ జగన్ని అడ్డుకుంటున్నామని సంబరపడుతోంది కానీ అన్నీ తెలిసిన జనం ఉన్నారు. వారి కంటే ముందు తమ్ముళ్ళు, చెల్లెళ్ళూ కూడా ఇదేం రాజకీయమని బాధపడుతున్నారు.
హుందాగా రాజకీయాలు చేయాలి. ఓడిన జనం నుంచే ప్రేమను గెలుచుకోవాలి. కానీ టీడీపీ తీరు అలా లేదని సీనియర్లు, సిన్సియర్లు అయిన నేతల ఆవేదనగా ఉందిట. ఇవన్నీ ఇలా ఉంటే ఉత్తరాంధ్రా జిల్లాలకు చెందిన అత్యంత సీనియార్ మోస్ట్ మహిళా నేత ఒకరు సైకిల్ దిగిపోనున్నారని టాక్ నడుస్తోంది.
ఆమె రాజ్యాంగబద్ధమైన పదవిలో కూడా పనిచేసి శభాష్ అనిపించుకున్న నాయకురాలు. ఆమె చంద్రబాబు కంటే కూడా సీనియర్ అనుకోవాలి. అన్న ఎన్టీయార్ పిలుపు మేరకు టీడీపీలోకి వచ్చిన ఆమెకు అల్లుడు గారి జమానాలో మాత్రం ఆ రకమైన మర్యాదలు పెద్దగా లేకపోగా వరసగా ఇబ్బందులే ఎదురవుతూ వస్తున్నాయిట.
సమర్ధులకు, సమున్నతులకు చోటు లేకుండా నోరున్న వారికే పార్టీలో పెద్ద పీట వేయడం కూడా ఆమె లాంటి సీనియర్లకు నచ్చడంలేదని అంటున్నారు. ఇవన్నీ అధినాయకత్వానికి తెలిసినా కూడా పట్టించుకోకపోవడంతో ఆమె ఒక కఠిన నిర్ణయమే తీసుకుంటారని అంటున్నారు. ఆమె కనుక టీడీపీని వీడి వైసీపీలో చేరితే అది రాష్త్ర స్థాయిలోనే పెను సంచలనం అవుతుందని అంటున్నారు. చూడాలి మరి ఆ శుభ ముహూర్తం ఎపుడో.