దమ్ముండాలే కానీ చట్టాలే కొరడాలు అవుతాయి. దందాలు చేసేవారికి అరదండాలు వేయిస్తాయి. రాష్ట్రంలో సుప్రసిద్ధ నారసింహ దేవాలయం సింహాచలంలో ఉంది. వేలాది ఎకరాల భూమి కూడా ఆలయానికి ఉంది. గతంలో కొందరు రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న పెద్దల అండదండలతో బాగానే భూములు పోగేశారు.
నాటి పొత్తు మహిమో మరేమో తెలియదు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చేంతవరకూ దీని మీద మౌనం వహించిన బీజేపీ లాంటి పార్టీలు ఇపుడే నిద్రలేచినట్లుగా భూములు ఆక్రమణకు గురి అయ్యాయంటూ కొంతకాలంగా గగ్గోలు పెడుతున్నాయి. మరో వైపు గత పాలనలో చక్రాలు చాలా పెద్దవే తిప్పిన మహా నేతలు కూడా మాజీలయ్యాక మొత్తం తప్పంతా వైసీపీ మీదకు తోసేస్తూ బురద జల్లేస్తున్నాయి.
చిత్రమేంటంటే అక్రమణలలో పచ్చ తమ్ముళ్ళదే పై చేయి అని భారీ ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినా నిస్సిగ్గుగా విపక్ష నేతలు అప్పన్నకు అపచారం అంటూ బొల్లి ఏడుపులు ఏడవడం విశేషం. ఇవన్నీ ఇలా ఉంటే అప్పన్న ఆలయానికి సంబంధించిన భూములు దురాక్రమణపైన వైసీపీ సర్కార్ తాజాగా కొరడా ఝలిపించింది.
ఎక్కడెక్కడ భూములు దురాక్రమణకు గురి అయ్యాయో మొత్తం చిట్టాను బయటకు తీసి గుట్టు విప్పేందుకు స్పెషల్ డ్రైవ్ ఒకటి నిర్వహించాలని నిర్ణయించింది. ఇది నిజంగా అక్రమార్కుల గుండెల్లో గునపాలు దించే ప్రొగ్రామేనని అంటున్నారు. మరి చూడాలి ఎవరెవరు బయటకు వస్తారో.. ఎవరి తాటను తీస్తారో.